TVK Vijay: దళపతి నుంచి సీఎం దిశగా? విజయ్ నెట్ వర్త్ ఎన్ని కోట్లో తెలుసా?

TVK Vijay Net Worth: తమిళనాడు రాజకీయాల్లో సినీ తారల ప్రభావం కొత్తేమి కాదు. ఏం.జీ.ఆర్ నుంచి జయలలిత వరకు, అలాగే C.N.అన్నాదురై, కరుణానిధి వంటి నేతలు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా రాజకీయాల్లో అడుగుపెట్టి, సంచలనంగా మారుతున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా, ఆయన స్థాపించిన టీవీకే (TVK)పార్టీతో సింగిల్ గా రంగంలోకి దిగారు. డీఎంకే, అన్నాడీఎంకే లాంటి బడా పార్టీలకు గట్టి పోటీ ఇస్తూ అధికారం వైపు దూసుకెళ్తున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ పార్టీ అవతరించింది. ఈ నేపథ్యంలో విజయ్ వ్యక్తిగత విషయాలు చర్చనీయంగా మారుతున్నాయి. ముఖ్యంగా విజయ్ దళపతి నెట్ వర్త్ ఎన్ని కోట్లు? అనేది హాట్ టాపిక్ గా మారింది.

కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అత్యధిక అభిమాన గణం సంపాదించిన నటుడిగా విజయ్ ప్రత్యేక గుర్తింపు పొందారు. అభిమానులు ప్రేమగా 'దళపతి' అని పిలుచుకుంటారు. 1974 జూన్ 22న మద్రాస్‌లో జన్మించిన విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. దర్శకుడు S. A.చంద్రశేఖర్, గాయని శోభా చంద్రశేఖర్ దంపతుల కుమారుడు. చిన్నప్పుడే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. దాదాపు పదేళ్ల వయసులోనే బాలనటుడిగా తెరపై కనిపించి, క్రమంగా నటనలో తనదైన ముద్ర వేశారు. 1992లో 'నాలయ తీర్పు' సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన విజయ్, ఆరంభంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ, ఆ తర్వాత వరుస విజయాలతో స్టార్ హీరోగా ఎదిగారు.

TVK Vijay Net Worth From Kollywood Star to CM Hopeful Assets Worth 603 Crore

కమర్షియల్ ఎంటర్టైనర్లలో తన ప్రత్యేక శైలిని ఏర్పరుచుకుని, భారీ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నారు. ఇక కమల్ హాసన్ - రజనీకాంత్ యుగం క్రమంగా ముగుస్తున్న సమయంలో తమిళ సినీ పరిశ్రమకు కొత్త దిశ చూపించిన నటుడిగా విజయ్ నిలిచారు. తన సినిమాలతో మార్కెట్‌ను విస్తరించి, తమిళ సినిమాల రేంజ్‌ను దేశవ్యాప్తంగా పెంచడంలో కీలక పాత్ర పోషించారు. మొత్తంగా... బాలనటుడిగా మొదలైన ఆయన ప్రయాణం, దళపతి స్థాయికి చేరిన ప్రస్థానం తమిళ సినీ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం.

ఇక విజయ్ రాజకీయ ప్రయాణం విషయానికి వస్తే.. దళపతి పొలిటికల్ జర్నీ ఒక్కసారిగా ప్రారంభం కాలేదు. 2009లోనే తన అభిమాన సంఘాలను విజయ్ మక్కల్ ఇయక్కంగా మారుస్తూ, వాటిని సామాజిక సేవలకు ఉపయోగించడం ప్రారంభించాడు. ఈ నెట్‌వర్క్ క్రమంగా రాజకీయ బేస్‌గా మారింది. 2011లో స్థానిక ఎన్నికల్లో ఈ సంఘం మద్దతుతో వచ్చిన విజయాలు ఆయనకు రాజకీయంగా ధైర్యాన్నిచ్చాయి. ఇంత భారీ ఫ్యాన్ బేస్‌ను ఓటు బ్యాంక్‌గా మార్చడం ఆయన స్ట్రాటజీలో కీలకంగా మారింది.

ఇలా 2024 ఫిబ్రవరిలో విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం(TVK)ను ప్రకటించడం ఒక కీలక మలుపు. చాలా మంది సెలబ్రిటీలు రాజకీయాల్లోకి వచ్చి మధ్యలోనే వెనక్కి తగ్గిన సందర్భాలు ఉన్నాయి. విజయ్ మాత్రం చాలా క్లియర్ విజన్‌తో ముందుకు వెళ్లారు. 'రాజకీయాలు నాకు హాబీ కాదు... ప్రజాసేవే లక్ష్యం" అని ఆయన స్పష్టం చేయడం, ఈ ప్రయాణం తాత్కాలికం కాదనే సంకేతం ఇచ్చింది. అంతేకాదు, తన చివరి సినిమా జన నాయకన్ తర్వాత పూర్తిగా రాజకీయాలకే అంకితమవుతానని ప్రకటించడం ఆయన సీరియస్‌నెస్‌ను మరింత బలపరిచింది. ఇలా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న విజయ్ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారుతున్నారు.

ఈ నేపథ్యంలో విజయ్ వ్యక్తిగత విషయాలు చర్చనీయంగా మారాయి. ముఖ్యంగా విజయ్ నెట్ వర్త్ తెలిస్తే షాక్ కావాల్సిందే. ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన ఆస్తుల వివరాలు ప్రకారం.. విజయ్ మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.603.20 కోట్లు. ఇందులో చర ఆస్తులు సుమారు రూ.404.58 కోట్లు కాగా, స్థిర ఆస్తులు సుమారు రూ.198.62 కోట్లు ఉన్నాయి. ఈ లెక్కలతో ఆయన దేశంలోనే అత్యంత ధనిక నటుడు-రాజకీయ నాయకుల్లో ఒకరిగా నిలిచారు. ముఖ్యంగా సినిమాల్లో నుంచి రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టిన అత్యంత ధనిక వ్యక్తి కావడం విశేషం.

విజయ్ సంపదకు ప్రధాన కారణం ఆయన సినిమాలే. మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతూ, ఆయన దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఒక్కో సినిమాకు భారీ రెమ్యునరేషన్ తీసుకోవడమే కాకుండా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, ప్రకటనలు, ఈవెంట్లు కూడా ఆయనకు కోట్లలో ఆదాయం సంపాదిస్తున్నారు. అలాగే.. రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా కూడా సంపాదిస్తున్నారు. ఒక్క 2024-25 ఆర్థిక సంవత్సరంలో విజయ్ సుమారు రూ.184.53 కోట్ల ఆదాయం సంపాదించినట్టు ప్రకటించారు. బ్యాంకుల్లోనే రూ.213 కోట్లకు పైగా డిపాజిట్లు ఉండటం, ఆయన లిక్విడ్ ఆస్తులు ఉన్నట్లు తెలిపారు.

ప్రాపర్టీల విషయంలో కూడా విజయ్ మంచి ప్రణాళికతో ముందుకు వెళ్లారు. చెన్నైలో విలాసవంతమైన ఇళ్లు, కోడైకెనాల్‌లో వ్యవసాయ భూములు, ఇతర కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాపర్టీలు ఆయన పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. ఇవి భవిష్యత్‌లో ఆయన ఆస్తి విలువను మరింత పెంచే అవకాశం ఉంది. ఇక లగ్జరీ లైఫ్‌స్టైల్ విషయానికి వస్తే.. విజయ్ కార్ల కలెక్షన్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రోల్స్ రాయిస్ ఘోస్ట్, బీఎండబ్ల్యూ ఎక్స్ 5, ఆడీ ఏ8 ఎల్, రేంజ్ రోవర్ ఎవాక్, ఫోర్డ్ ముస్తాంగ్, వోల్వో ఎక్స్‌సీ 90, మెర్సెడెస్ బెంజ్ జీఎల్ఏ వంటి కోట్లు విలువ చేసే ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ కార్లు కేవలం విలాసానికి మాత్రమే కాకుండా, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే చిహ్నాలుగా మారాయి.

ఇప్పుడు విజయ్ కేవలం సినీ హీరో కాదు.. ఒక బ్రాండ్, ఒక రాజకీయ శక్తి. ఆయన పార్టీ TVK ఇప్పటికే 100కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తమిళనాడు రాజకీయాల్లో పెద్ద మార్పుకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. యువతలో ఉన్న విపరీతమైన ఫాలోయింగ్, బలమైన ఫ్యాన్ బేస్, స్పష్టమైన రాజకీయ అజెండా అన్ని కలిసి విజయ్‌ను బలమైన కంటెండర్‌గా నిలబెడుతున్నాయి. ఈ పరిణామాలు అన్ని విజయ్ ను సీఎం పదవికి చేరువ చేస్తున్నాయి. రానున్న మరికొద్ది గంటల్లో తమిళ రాజకీయాల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకుంటుందో వేచి చూడాలి.

Read more about: kollywood vijay thalapathy tvk
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X