విశాల్ గుట్టు రట్టు చేస్తా.. చీకటి కోణాన్ని బయటిపెడుతా.. మహిళ వార్నింగ్
విశాల్ ఈ మధ్య ఎక్కువగా వివాదాల్లో నిలుస్తున్నాడు. కొన్ని నెలల క్రితం మిస్కిన్ వివాదం, అంతకు ముందు నడిఘర్ సంఘం ఎన్నికలు, వరలక్ష్మీ వివాదాస్పద వ్యాఖ్యలు ఇలా ప్రతీ రోజు ఏదో ఒక సెన్సేషన్‌తో వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. తాజాగా ఆయన నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో జరిగిన అవకతవకలు, మహిళ చేసిన మోసం వార్తల్లో తెగ వైరల్ అయింది. ప్రస్తుతం ఆ మహిళ విశాల్‌పై సంచలన కామెంట్స్ చేసింది.

విశాల్ ప్రొడక్షన్ హౌస్..
విశాల్ స్వంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో అవకతవకలు జరిగాయని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సరిగా పన్నులు చెల్లించడం లేదని వచ్చిన వార్తల్లో ఇప్పుడు నిజం బయట పడింది. విశాల్ ఆఫీస్‌లో పని చేస్తున్న ఓ మహిళ ఆ డబ్బులు కాజేసినట్టు బయటకు వచ్చింది.

మహిళపై ఫిర్యాదు..
వీఎఫ్ఎఫ్‌లో దాదాపు పది మంది ఉద్యోగులు ఉంటారని తెలుస్తోంది. కొంత కాలంగా ఆదాయ పన్నుశాఖ సంస్థకు టీడీయస్‌ను చెల్లించడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై ఆరా తీయగా తన కార్యాలయంలో రూ.45 లక్షలు మోసం జరిగిందన్న విషయం వెలుగు చూసిందట. విశాల్ కార్యాలయ నిర్వాహకుడు హరి స్థానిక సాలిగ్రామంలోని పోలీస్ స్టేషన్‌లో ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. అందులో తమ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేసే రమ్య ఈ మోసానికి´పాల్పడినట్టు పేర్కొన్నారు.

అకౌంట్‌లోకి డబ్బులు..
ఆదాయ శాఖకు చెల్లించాల్సిన టీడీయస్‌ను రమ్య ఆమె భర్త బ్యాంక్ అకౌంట్లు,తన బంధువుల బ్యాంకు అకౌంట్‌లోకి తరలించిందని పేర్కొన్నారు. కాబట్టి ఆమెను విచారించాలని కోరారు. అయితే రమ్య మాత్రం విశాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

రహస్యాలు బయటపెడతా..
విశాల్ కొన్నేళ్లుగా ప్రభుత్వానికి టీడీయస్‌ను చెల్లించకుండా మోసానికి పాల్పడుతున్నాడని, దాని నుంచి తప్పిచుకోవడానికే తనపై ఆరోపణలు చేస్తున్నారని రమ్య ఆరోపించింది. విశాల్ కార్యనిర్వాహకుడు హరి వర్గం తన ఇంటికి వచ్చి బెదిరించిందని పేర్కొంది. విశాల్‌కు సంబంధించిన చాలా విషయాలు తనకు తెలుసని, తనకు పోలీసులు రక్షణ కలిపిస్తే విశాల్‌కు సంబంధించిన మరిన్ని రహస్యాలను బయట పెడతానని రమ్య చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











