'విశ్వరూపం' పై కామెంట్ చేసి ఇరుక్కున్న విశాల్
చెన్నై : వివాదాలు ఎదుర్కొన్న 'విశ్వరూపం' ఎట్టకేలకు చర్చల ద్వారా విడుదల సమస్య నుంచి కమల్‌హాసన్ బయటపడితే, ఇదే చిత్రానికి సంబంధించి తాజాగా యంగ్ హీరో విశాల్‌కు చిక్కులొచ్చాయి. విశ్వరూపం విషయంలో కమల్‌హాసన్‌కు సంఘీభావం ప్రకటించే ప్రయత్నంలో భాగంగా విశాల్ చేసిన వ్యాఖ్య వివాదానికి దారి తీసింది.
'కమల్‌హాసన్ ఇంతటి సమస్య ఎదుర్కొంటుంటే నటీనటుల సంఘం ఏం చేస్తోంది?' అంటూ విశాల్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. దీనిపై తీవ్రంగా స్పందించిన నటీనటుల సంఘం విశాల్ వ్యాఖ్య నటీనటుల సంఘాన్ని కించపరచటమే అన్న అభిప్రాయానికొచ్చింది. దీంతో సంఘానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన మిమ్మల్ని సంఘం నుంచి బహిష్కరిస్తే తప్పేంటి? అంటూ, విశాల్‌కు నోటీసులు జారీ చేసింది.
విశ్వరూపం వ్యవహారంలో నడిగర్ సంఘం నటుడు విశాల్‌కు నోటీసులు పంపింది. విశ్వరూపం చిత్రంలో ముస్లింల మనోభావాలను భంగం కలిగించేలా సన్నివేశాలున్నాయంటూ ఆ సంఘాల ప్రతినిధులు చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆవేదన చెందిన కమల్‌హాసన్ దేశం వీడిపోతానని కంట తడి పెట్టారు. ఈ దృశ్యాలను టీవీలో చూసిన విశాల్ కమల్‌ను కలసి ఓదార్చారు. అనంతరం ఆయన కమల్ విషయంలో నడిగర్ సంఘం మద్దతు తెలపకుండా మౌనం వహించడానికి కారణమేమిటని ప్రశ్నించారు.
సంఘం ప్రధాన కార్యదర్శి రాధారవి సోమవారం చెన్నైలో మాట్లాడుతూ.. కమల్‌హాసన్‌కు తమ సంఘం అండగానే నిలిచిందని, అధ్యక్షుడు శరత్‌కుమార్, రాధిక, శివకుమార్ తదితరులు కమల్‌ను కలుసుకుని మద్దతుగా నిలిచారని తెలిపారు. ఇవేవి తెలిసికోకుండా నోరు జారినందుకు 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని విశాల్‌కు నోటీసులు పంపినట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











