విశాల్‌కు సాయి ధన్సిక ఎలా దగ్గరయ్యారంటే? లవ్ స్టోరీలో కొత్త ట్విస్ట్
బ్యాచిలర్ లైఫ్‌కు రామ్ రామ్ చెబుతూ.. 47 ఏళ్ల వయసులో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కోలీవుడ్ స్టార్ హీరో విశాల్. ఆయన పెళ్లి, ప్రేమకు సంబంధించి గతంలో ఎన్నో రూమర్లు వచ్చాయి. కానీ ఏ ఒక్కసారి కూడా అవి నిజం కాలేదు. జనాలకు కూడా ఇలాంటివి విని విని బోర్ కొట్టేసింది. అయితే రెండ్రోజుల క్రితం కూడా విశాల్ పెళ్లి గురించి ఊహాగానాలు వినిపించాయి. మీడియా షరామామూలే అన్నట్లుగా కథనాలు వండి వార్చింది. కానీ ఈసారి మాత్రం విశాల్ షాకిచ్చారు.
శపథం నెరవేర్చిన విశాల్
నడిగర సంఘం భవన నిర్మాణం పూర్తయ్యాకే తాను పెళ్లి చేసుకుంటానని గతంలో విశాల్ శపథం చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఈ భవన నిర్మాణాన్ని తుది దశకు తీసుకొచ్చారు విశాల్. ఆగస్ట్ 15న ఈ భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో తన ప్రేమ జీవితం, పెళ్లికి సంబంధించి త్వరలో ప్రకటన చేస్తానని విశాల్ హింట్ ఇచ్చారు. దీంతో విశాల్ ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నారని ఆగస్ట్ 29న పెళ్లి చేసుకుంటారని మీడియాలో కథనాలు వచ్చాయి. మే 19 ఉదయం కూడా ఓ ప్రముఖ హీరోయిన్‌తో విశాల్ రిలేషన్‌లో ఉన్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి.

సాయి ధన్సికను పెళ్లి చేసుకుంటున్నా
సోమవారం సాయంత్రం సాయి ధన్సిక నటించిన యోగీ దా ఆడియో విడుదల, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్‌కు విశాల్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతారని తెలిసినప్పటి నుంచి ఈ హీరోకు కాబోయే భార్య సాయి ధన్సికనే అని కథనాలు ఊపందుకున్నాయి. కట్ చేస్తే తాను సాయి ధన్సికతో రిలేషన్‌లో ఉన్నానని, త్వరలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు విశాల్ అధికారికంగా అదే వేదికపై ప్రకటించి షాకిచ్చారు. అక్కడితో ఆగకుండా తన పుట్టినరోజైన ఆగస్ట్ 29నే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ముహూర్తం కూడా ఖరారు చేశారు.
కబాలితో పాపులరైన సాయ ధన్సిక
సాయి ధన్సిక చాలా మంచి అమ్మాయి అని.. కొంతకాలం క్రితం మా మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారిందని విశాల్ తెలిపారు. పెళ్లి తర్వాత కూడా సాయి సినిమాల్లో నటిస్తారని ఆయన వెల్లడించారు. అసలు సాయి ధన్సికకు, విశాల్‌కు ఎప్పుడు? ఎక్కడ? పరిచయం కలిగిందంటూ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. తంజావూరుకు చెందిన సాయి ధన్సిక 2009లో పేరణ్మాయితో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అరవణ్, పరదేశి తదితర చిత్రాల్లో నటించారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీలో ఆయనకు కూతురిగా నటించి పాపులర్ అయ్యారు సాయి. తెలుగులోనూ షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో నటించారు.
సాయి ధన్సికపై టీ.రాజేందర్ తిట్ల పురాణం
కానీ ఎనిమిదేళ్ల క్రితం జరిగిన సంఘటన విశాల్ - సాయి ధన్సిక మధ్య బంధానికి బాటలు వేసింది. కృష్ణ, విధర్త్, సాయి ధన్సిక న టించిన విజితిరు సినిమాలో హీరో శింబు తండ్రి, టీ రాజేందర్ కీలకపాత్రలు పోషించారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో సాయి ధన్సిక మాట్లాడుతూ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పి రాజేందర్‌ను మరిచిపోయింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజేందర్ అదే వేదికపై మీడియా ముందు సాయి ధన్సికను తిట్టాడు. రజనీ సినిమాలో నటిస్తోంది కాబట్టి పొగరుగా వ్యవహరిస్తోందని అసభ్యంగా మాట్లాడారు.
సాయి ధన్సికకు అండగా నిలిచిన విశాల్
జరిగిన దానికి సాయి ధన్సిక క్షమాపణలు చెప్పినా రాజేందర్ వినిపించుకోలేదు. ఇంత అవమానం ఎదురై సాయి ధన్సిక ఏడుస్తున్నా వేదికపై ఉన్న ఏ ఒక్కరూ రాజేందర్‌ను అడ్డుకోకపోగా.. సహనటులు, ఇతర పెద్దలు చప్పట్లు కొడుతూ నవ్వుతూ కనిపించారు. ఆమెకు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి మద్ధతు లభించకపోవడంతో నెటిజన్లు సైతం ఫైర్ అయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న నాటి తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) అధ్యక్షుడు విశాల్ మాత్రం రాజేందర్‌పై భగ్గుమన్నారు. అప్పటికే సాయి ధన్సిక, విశాల్ మధ్య ఫ్రెండ్‌షిప్ ఉండగా రాజేందర్ ఎపిసోడ్ తర్వాత తనకు అండగా నిలిచిన విశాల్‌తో ఆ బంధం మరింత బలపడి ప్రేమగా మారింది. 8 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నప్పటికీ ఎక్కడా బయటపడకుండా తాజాగా తాము ఒక్కటవుతున్నట్లు ప్రకటించి షాకిచ్చారు విశాల్ - సాయి ధన్సిక.


Click it and Unblock the Notifications











