అదే నా మూడో అవతారం: విశాల్
చెన్నై : యాక్షన్, కమర్షియల్ హీరోగా విశాల్ తమిళ, తెలుగు భాషల్లో పేరు సంపాదించుకున్నాడు. తాజాగా సరికొత్త అవతారమెత్తానని అంటున్నాడు. అదేంటని అంటే నిర్మాతగా మారడమే నా మూడో అవతారం అని చెప్తున్నారు.
దాని గురించి విశాల్ వివరిస్తూ..... నేను సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించా. నాన్న, అన్న ఇద్దరూ నిర్మాతలే. నన్ను ప్రయోజకుణ్ని చేయాలన్నదే వారి తపన. అలా నటుడు అర్జున్ వద్ద సహాయ దర్శకుడిగా చేరా. ఆ తర్వాత అర్జున్ సూచనల మేరకు హీరోగా తెరంగేట్రం చేశా. తాజాగా 'సమర్' వరకు సినీజనాలను అలరించాననే అనుకుంటున్నా అన్నారు.
ఇవి నా రెండు అవతారాలైతే నిర్మాతగా మారడమే నా మూడో అవతారం. నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాలని నాన్న, అన్న కలసి నిర్మాతగా చేశారు. విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టర్(వీఎఫ్‌ఎఫ్) పేరిట కొత్త బ్యానరు రూపొందించా. నిర్మాతగా మారాక బాధ్యతలు మరింత పెరిగాయి. నా బ్యానరులో వస్తున్న తొలిచిత్రం 'పాండియ నాడు'. నాకు జంటగా లక్ష్మీమీనన్ నటిస్తోంది. సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.
మదురై నేపథ్యంలో తెరకెక్కుతోంది. ద్విపాత్రాభినయం చేస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. బుధవారం నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుందని చెప్పాడు. తెలుగులోనూ ఒకే సమయంలో తెరకెక్కిస్తామని, రెండు భాషల్లోనూ దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.


Click it and Unblock the Notifications











