'విశ్వరూపం-2' లో ఆ సీన్స్ కే ప్రాధాన్యత : కమల్ హాసన్
చెన్నై : 'విశ్వరూపం'లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్‌హాసన్ తెలిపారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు.
కమల్ చెన్నైలో మాట్లాడుతూ ''వివాదాల అవరోధాలను దాటుకుని విడుదలైంది. తొలి భాగంలో కొన్ని అంశాలు చూపించలేకపోయాను. ప్రేమ ఘట్టాలు లేవు. అలాగే తల్లీకొడుకుల మధ్య ఉండే ఆప్యాయతానురాగాలు లేవు. వాటన్నింటికి 'విశ్వరూపం 2'లో స్థానం ఉంది. ఇందులో యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో తీరిక లేకుండా ఉన్నాను'' అన్నారు.
ఇక 'విశ్వరూపం' కష్టాలనుంచి మొత్తానికి కమల్ పూర్తిగా బయిటపడుతున్నారు. ఆ చిత్రం కోసం తాకట్టు పెట్టిన ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఆ మధ్య కమల్‌హాసన్ ప్రకటించారు. ఆయన హీరోగా నటించి, స్వీయదర్శకత్వంలో నిర్మించిన 'విశ్వరూపం' చిత్రం విడుదలలో సమస్యలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అప్పుడు మీడియా సమావేశం నిర్వహించి కమల్‌హాసన్ 'విశ్వరూపం' కోసం తన ఇంటిని తాకట్టు పెట్టానని, చిత్రం విడుదల కాకపోతే ఇంటిని కోల్పోయి తాను దేశాన్ని విడిచి వెళ్లిపోతానని ఆవేదన వ్యక్తం చేసారు.
వివాదాలతో మొదలైన 'విశ్వరూపం' భాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంతో కమల్ తనకు సాటిలేదని మరోసారి ప్రూవ్ చేసి, రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇప్పటికే రూ.100 కోట్లకుపైగా వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ మైలురాయిని దాటిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తీవ్రవాదుల నేపథ్యంతో కమల్ ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన 'విశ్వరూపం' తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











