కమల్ 'విశ్వరూపం'లో..ఏడు కట్స్
చెన్నై: మొత్తానికి పదిరోజుల నుంచి సాగుతున్న వివాదాలు ముగిశాయి. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ప్రభుత్వం ఆదివారం ఎత్తివేయటంతో 'విశ్వరూపం' విడుదలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ముస్లిం సంఘాలకు కమల్‌హాసన్ ఇచ్చిన హామీ మేరకు చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, సంభాషణలను తొలగించి చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దీనిని ఈనెల 6 లేదా 7వ తేదీల్లో విడుదల చేసే అవకాశాలున్నాయి.
ఒకవైపు ముస్లిం సంఘాలు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంతో సాగిన వివాదం అనంతరం కమల్‌హాసన్ భారీ బడ్జెట్టు చిత్రం విశ్వరూపం విడుదలకు సిద్ధమైంది. ఇది గతనెల 25న విడుదల కావాల్సి ఉండగా.. ముస్లిం సంఘాల ఆందోళనల నేపథ్యంలో 23న తమిళనాడులో నిషేధానికి గురైన విషయం తెలిసిందే. ప్రభుత్వ జోక్యంతో ఈ సమస్య సద్దుమణిగింది. శనివారం సచివాలయంలో జరిగిన మూడోవిడత చర్చల్లో ముస్లిం సంఘాలు పేర్కొన్న పలు సన్నివేశాలను, సంభాషణలను పూర్తిగా తొలగించేందుకు ఈ చిత్రానికి నటన, నిర్మాత, దర్శకత్వం బాధ్యతలు వహించిన కమల్‌హాసన్ అంగీకరించారు. మొత్తం 9 నిమిషాల నిడివిని తొలగించాలని ఈ చర్చల్లో పాల్గొన్న సంఘాల ప్రతినిధులు తొలివిడత చర్చల్లో కోరారు.
మూడో విడత చర్చలూ ఇదే అంశంపై జరుగగా అందులోని చాలా వాటికి కమల్ అంగీకరించారు. మొత్తం మీద ఈ చిత్రంలో ఆరేడు నిమిషాల వ్యవధికల ఏడు కత్తిరింపులు ఉండనున్నాయి. దీంతోపాటుగా పలు సంభాషణలను తొలగించనున్నారు. (సంభాషణలు వినిపించకుండా శబ్దాన్ని ఆపనున్నారు) ఇలా కమల్‌హాసన్ అంగీకరించిన విధంగా కత్తిరింపులు పూర్తయ్యాక ఈ చిత్రాన్ని ఈనెల 6 లేదా 7 తేదీల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. గతంలో పేర్కొన్న విధంగా విశ్వరూపం విడుదల కావాల్సిన థియేటర్లలో ఇతర చిత్రాలు నడుస్తుండటంతో విడుదలకు మార్గం సుగమం అయినప్పటికీ రెండు, మూడు రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక ముందుగా పేర్కొన్నవిధంగా ఈ చిత్రం తమిళనాడులోని మొత్తం 524 థియేటర్లలో విడుదల కావాల్సిఉంది. ఇది జనవరి-25న విడుదల కావాల్సిఉండటంతో అనేక థియేటర్లు అడ్వాన్సు బుకింగ్‌లు కూడా పూర్తిచేశారు. చెన్నైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇతర పట్టణాల్లోనూ దాదాపు 30వేలకు పైగా టిక్కెట్లు అడ్వాన్సు రూపంలో విక్రయించారు. కమల్‌హాసన్ చిత్రం అంటే సహజంగానే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం నిషేధం, అనంతర పరిణామాలు ఈ ఆసక్తిని మరింతగా పెంచాయి. దీంతో ఈ చిత్రాన్ని విక్షించేందుకు తమిళనాడు వాసులు పక్కరాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకకు వెళ్తున్నారంటే దీనిపైన ఉన్న ఆసక్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం విడుదలయ్యే థియేటర్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయని సినీవర్గాలు అంచనావేస్తున్నాయి. ఈ పరిణామాలు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కడల్', 'డేవిడ్' చిత్రాలపై పడే సూచనలూ కనిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు ఒకేసారి ఫిబ్రవరి-1న విడుదలయ్యాయి.


Click it and Unblock the Notifications











