రిలీజ్ రోజే నెట్లో పెట్టేసారంటూ స్టార్ హీరోలిద్దరూ
ఇలాగయితే కష్టం.రిలీజైన రోజే మా సినిమాలు ఇంటర్నెట్లో ఉంటే ఉన్నాయి..ఇలాగయితే కష్టం అంటున్నారు తమిళ హీరోలు సూర్య, విజయ్. మొన్న దీపావళి రోజు విడుదలైన తమిళ సినిమాలు రెండూ ఇంటర్నెట్ లో దర్శనమిచ్చి అందరికి షాక్ ఇచ్చాయి. సినిమా రిలీజైన రోజే ఇంటర్‌నెట్‌లో సెవన్త్ సెన్స్(7 ఆమ్ అరివు), వేలాయుధమ్ చిత్రా లు ప్రత్యక్షం కావడం కోలీవుడ్‌ను కలవరంలో పడేసింది. విజయ్, సూర్య చిత్రాలే ఇలా తొలి రోజున ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైతే ఇక తమ గతేమిటని చిన్న చిత్రాల నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. దీపావళి పండుగను పురస్కరించుకుని దర్శకుడు మురుగదాస్, నటుడు సూర్య, నటి శృతిహాసన్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మించిన సెవన్త్ సెన్స్ విడుదలైంది. విజయ్ నటించిన వేలాయుధమ్ సినిమాను కూడా అదేరోజున విడుదల చేశారు. ఈ పరిస్థితుల్లో విడుదలైన కొన్ని గంటలకే ఈ రెండు సినిమాలు ఇంటర్‌నెట్‌లో ప్రత్యక్షం కావడం కోలీవుడ్ వర్గాలను విస్మయంలో పడేసింది.
ఈ విషయంగా సినీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు జి.శేఖరన్ మాట్లాడుతూ సినిమా విడుదలైన రోజే పైరసీ సీడీలు, ఆన్‌లైన్ ద్వారా సినిమాలను వీక్షించే విధంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిందన్నారు. పైరసీ సీడీల తయారీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పైరసీ సీడీల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. నిర్మాత కేఆర్ మాట్లాడుతూ పైరసీ సీడీల వల్ల నిర్మాతలు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాలకే ఇలాంటి పరిస్థితి నెలకొంటే భవిష్యత్తులో చిన్న చిత్రాల నిర్మాతల గతి ఏమిటని ప్రశ్నించారు. పైరసీ సీడీల నియంత్రణకు చర్యలు చేపట్టని పక్షంలో నిర్మాతలు వీధిన పడే ప్రమాదం ఉందన్నారు. నిర్మాతల సంఘం వెంటనే సమావేశమై దీనిపై చర్చించాలని, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.


Click it and Unblock the Notifications











