చిరంజీవి సినిమాలో అభిజీత్: ఎవరూ ఊహించని పాత్రను చేయనున్న బిగ్ బాస్ విన్నర్
తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతూ.. ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతూ.. సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు యంగ్ హీరో అభిజీత్. దీనికి కారణం అతడు బిగ్ బాస్ నాలుగో సీజన్ విన్నర్ అవడమే. గతంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్'తో హీరోగా పరిచయం అయిన అతడు.. ఆ తర్వాత పలు చిత్రాలు చేశాడు. అయినా అంతగా గుర్తింపును దక్కించుకోలేకపోయాడు. అయితే, బిగ్ బాస్ తర్వాత అతడి క్రేజ్ అమాంతం పెరిగింది. దీంతో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే అభిజీత్.. మెగాస్టార్ చిరంజీవి మూవీలో ఛాన్స్ పట్టేశాడని తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

లవ్ ట్రాకుల వల్ల అలా ఫేమస్ అయ్యాడు
బిగ్ బాస్ హౌస్‌లోకి సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చాడు అభిజీత్. షో ఆరంభంలో అతడు హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో బాగా క్లోజ్ అయ్యాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ఆమె అతడికి దూరమైపోయింది. అప్పటి నుంచే దేత్తడి హారికకు దగ్గరయ్యాడు అభిజీత్. ఈ ట్రాకుల వల్ల అతడికి లవర్ బాయ్ అన్న పేరొచ్చి ఫేమస్ అయ్యాడు.

మాస్టర్ ప్లాన్లతో గెలుపు... వాళ్లకు టార్గెట్
సీజన్ ఆరంభం నుంచే ప్రతి దానిని పట్టి పట్టి చూస్తూ.. కండబలంతో కాకుండా బుద్దిబలంతో గెలవాలని చూసేవాడు అభిజీత్. అందుకు అనుగుణంగానే కొన్ని టాస్కుల్లో మైండ్ గేమ్ ఆడి తన జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో హౌస్‌లో బలమైన కంటెస్టెంట్‌గా మారిపోయాడు. ఈ కారణంగానే మిగిలిన హౌస్‌మేట్స్ అంతా అతడిని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు.

ప్రేక్షకుల మద్దతు.. సీజన్ విన్నర్‌గా అభి
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లు దిగిన వారు మధ్యలోనే షో నుంచి బయటకు వెళ్లిపోయారు. అలాంటి సమయంలోనే అభిజీత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారాడు. దీంతో ఈ సారి అతడే విజయం సాధిస్తాడని అంతా అనుకున్నారు. దీనికి తోడు ప్రేక్షకులు కూడా అతడికి విపరీతంగా సపోర్ట్ చేశారు. ఈ కారణంగానే అభిజీత్ బిగ్ బాస్ నాలుగో సీజన్ విన్నర్‌గా నిలిచాడు.

ఆఫర్లే ఆఫర్లు... పుకార్లే పుకార్లు.. బిజీగా
బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత అభిజీత్ ఫుల్ బిజీ అయ్యాడు.చాలా రోజుల పాటు తన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పడంతో పాటు వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడిపాడు. అదే సమయంలో అతడికి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వెంకీ కుడుములతో మూవీ, F3లో ఛాన్స్ వచ్చిందని జోరుగా ప్రచారం జరిగింది.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అభిజీత్
టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న అభిజీత్.. ప్రస్తుతం తన ఫోకస్‌ను అంతా కథలను వినడంపైనే పెట్టాడని అంటున్నారు. కమ్‌బ్యాక్ మూవీని భారీ రేంజ్‌లో చేసి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. ఇందుకోసం సరికొత్త ప్రయోగాలకూ సిద్ధమని చెబుతున్నాడట. ఈ నేపథ్యంలో అభిజీత్‌కు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం వచ్చిందని ఓ న్యూస్ బయటకు వచ్చింది.

ఎవరూ ఊహించని పాత్రను చేయనున్న
చిరంజీవి త్వరలో మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసీఫర్' రీమేక్ చేయనున్నాడు. ఇందులో తండ్రి చనిపోతే సీఎం అయ్యే ఓ యంగ్ మ్యాన్ పాత్ర ఉంటుంది. ఎంతో స్టైలిష్‌గా ఉండే ఆ రోల్ కోసం అభిజీత్‌ను తీసుకున్నారని సమాచారం. వాస్తవానికి మరో హీరో సత్యదేవ్‌ను దీని కోసం తీసుకున్నారని ప్రచారం జరుగుతోన్నా.. అందులో నిజం లేదని.. అభినే ఆ పాత్ర చేస్తున్నాడని టాక్.


Click it and Unblock the Notifications











