ఇంద్ర మూవీని చిరంజీవి డైరెక్ట్ చేశాడా..? దర్శకుడు గోపాల్ ఆ కారణంగా షూటింగ్ దూరం కావడంతో..!
తొలుత హీరోగా చేసి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారమెత్తినవారు టాలీవుడ్‌లో చాలామంది ఉన్నారు. ఈ కోవలోకే వస్తారు నటుడు రాజా రవీంద్ర. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన యముడికి మొగుడిలో ఓ చిన్న రోల్‌లో తళుక్కున మెరిసిన ఆయన.. నాటి నుంచి నేటి వరకు నటిస్తూనే ఉన్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రాజా రవీంద్ర గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. సినిమాలే కాదు.. బుల్లితెరపైనా కనిపించి ప్రేక్షకులకు చేరువయ్యారు.
తాను హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదని రాజా రవీంద్ర ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. హీరోగా చేయడం కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడం హ్యాపీగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. హీరో అంటే ఎంతో టెన్షన్ పడాలని.. అదే సినిమా ఫ్లాప్ అయినా సహాయ పాత్రలు పోషించిన వారిపై ఎలాంటి ప్రభావం పడదని రాజా రవీంద్ర పేర్కొన్నారు. సినిమాల్లో నటిస్తూనే పలువురు స్టార్స్‌కు ఆయన మేనేజర్‌గానూ వ్యవహరించారు. రవితేజ స్టార్ హీరోగా మారిన తర్వాత తనను మేనేజర్‌ను చేశాడని, అలాగే డేట్స్ ఎలా చూడాలో తెలియదని చెబితే తనే దగ్గరుండి నేర్పించాడని రాజా రవీంద్ర గుర్తుచేసుకున్నారు. ఆయన ప్రోత్సాహంతోనే ఎంతోమంది నటీనటులకు పర్సనల్ మేనేజర్‌గా పనిచేశానని చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవిని ఎంతో ఇష్టపడే రాజా రవీంద్ర.. చిరు నటించిన పలు సినిమాలలో కీలకపాత్రలు పోషించారు. పలు సందర్భాలలో అన్నయ్యపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన బ్లాక్‌బస్టర్ మూవీ ఇంద్రను 4కే వెర్షన్‌లో ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్. బీ.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంద్రలో చిరంజీవి సరసన సోనాలీ బింద్రే , ఆర్తి అగర్వాల్‌లు హీరోయిన్లుగా నటించగా ప్రకాష్ రాజ్, ముఖేష్ రుషి, సునీల్ తదితరులు కీలకపాత్ర పోషించారు. జూలై 24, 2002న రిలీజైన ఇంద్ర బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌తో దక్షిణాదిలో ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా నిలిచింది.
ఇంద్రలో రాజా రవీంద్ర.. వీర భద్రా రెడ్డి అనే పాత్ర పోషించారు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంద్ర సినిమా నాటి సంగతులను పంచుకున్నారు. ఈ సినిమాతో పాటే ఎన్టీఆర్ నటిస్తోన్న అల్లరి రాముడును కూడా బీ గోపాల్ డైరెక్ట్ చేస్తున్నారు. ఎర్టీఆర్ సినిమా సాంగ్స్‌ను తీసేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిపోయారు. దీంతో ఇంద్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తం చిరంజీవి డైరెక్ట్ చేశారని.. ముఖ్యంగా హోమం సీన్, ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే అనే పాట ఎపిసోడ్స్‌కి మెగాస్టారే దర్శకత్వం వహించారని రాజా రవీంద్ర పేర్కొన్నారు.
చిరు డైరెక్ట్ చేసిన ఎపిసోడ్స్‌లో తాను లేనని.. కానీ షూటింగ్ స్పాట్‌లో మాత్రం ఉన్నానని ఆయన వెల్లడించారు. అంతేకాదు.. అప్పుడు మండు వేసవి , పైగా మే నెల కావడంతో కేరవ్యాన్ నుంచి బయటికి కాలు కూడా పెట్టలేకపోయానని రవీంద్ర చెప్పారు. అయినప్పటికీ చిరు ఎండలోనే కూర్చొని హోమం చేసే సన్నివేశంలో నటించారని, కనీసం ఒంటి మీద చొక్కా కూడా లేకుండా టవల్ వేసుకుని 29 రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొన్నారని ఆయన తెలిపారు. షూటింగ్ పూర్తయిన తర్వాత అక్కడే నిలబడి ఉన్న జూనియర్ ఆర్టిస్టుల వద్దకు వెళ్లి ... షూటింగ్ ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో ఎండలో షూట్ చేయించానని , తనను క్షమించాలని అడిగారని.. అదీ చిరంజీవి క్యారెక్టర్ అంటూ రాజా రవీంద్ర ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











