1000 ఏళ్ల ఆలయంలో ప్రియాంకతో పెళ్లి.. ఆ రూమర్స్‌కు నటుడు శివ్ చెక్!
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రియాంక జైన్, శివకుమార్ జంట (Siva Kumar -Priyanka Jain) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'మౌనరాగం' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ఇద్దరూ, మొదటి ప్రాజెక్ట్‌తోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్న ఈ జంట, ఆ సీరియల్ సమయంలో ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వీరిద్దరి రిలేషన్‌షిప్ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంది. ప్రస్తుతం వీరిద్దరూ వరుస సీరియల్స్, షోలతో బిజీగా ఉంటూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ప్రేమలో ఉన్న విషయం ఓపెన్‌గా చెప్పిన తర్వాత నుంచి అభిమానులు వీరి పెళ్లి గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా, ఏ ఇంటర్వ్యూకి హాజరైనా "పెళ్లి ఎప్పుడు?" అనే ప్రశ్న మాత్రం వీరికి కామన్‌గా మారిపోయింది.
తాజాగా శివకుమార్ కిస్సిక్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ప్రేమ, పెళ్లి, ప్రియాంకపై ఉన్న అనుబంధం గురించి ఓపెన్‌గా మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ప్రియాంకను తన జీవితంలో ఎంత ప్రత్యేకంగా భావిస్తున్నాడో చెప్పిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివకుమార్‌ను యాంకర్ వర్ష "మోస్ట్ ఎలిజిబుల్ లవర్" అంటూ సరదాగా వెల్కమ్ చేసింది. అయితే స్టేజ్‌పైకి వచ్చిన వెంటనే శివకుమార్ "హాయ్ మేడమ్" అంటూ సంభోదించడంతో వర్ష వెంటనే అదే విషయాన్ని ప్రశ్నించింది. "ఎందుకు అందరినీ సార్, మేడమ్ అని పిలుస్తారు?" అని అడగగా, శివకుమార్ చాలా ఎమోషనల్‌గా స్పందించాడు.

"మా అమ్మ స్కూల్ టీచర్. ఆమె అందరినీ సార్, మేడమ్ అని పిలిచేది. చిన్నప్పటి నుంచి అది చూస్తూ పెరగడంతో నాకు కూడా అదే అలవాటైంది. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే.. ఇలా పిలవడం వల్ల మనుషుల మధ్య ఒక బోర్డర్ లైన్ ఏర్పడుతుంది. నేను కూడా ఎవరికీ ఎక్కువగా దగ్గర కాలేకపోయాను. ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువయ్యారు" అంటూ తన మనసులోని విషయాన్ని బయటపెట్టాడు. అయితే వెంటనే ప్రియాంక జైన్ గురించి మాట్లాడిన శివకుమార్, ఆమె తన జీవితంలో ఎంత ముఖ్యమో చెప్పుకొచ్చాడు. "ఇప్పటివరకు నాకు ప్రియాంక తప్ప మరెవ్వరూ బెస్ట్ కాదు. ఆమె నాకు ఫ్రెండ్, లవర్, గైడ్ అన్నీ. నాకు బాధ ఉన్నా, సంతోషం ఉన్నా మొదట గుర్తొచ్చేది ప్రియాంకే" అంటూ చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. ఆయన మాటల్లో ప్రియాంకపై ఉన్న ప్రేమ, నమ్మకం స్పష్టంగా కనిపించాయి.
అక్కడితో ఆగని యాంకర్ వర్ష, "ప్రియాంక కాకుండా ఇంకెవరైనా గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారా?" అని సరదాగా అడిగింది. దీనికి శివకుమార్ వెంటనే "నాకు వేరే గర్ల్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ప్రియాంక నాకంటే ఎక్కువగా నన్ను చూసుకుంటుంది. అలాంటి అమ్మాయి నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఇంకెవరిని ఎందుకు చూడాలి?" అంటూ స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చాడు. అంతేకాదు, ప్రతి అబ్బాయి జీవితంలో ఉండే కోరిక గురించి కూడా శివకుమార్ ఆసక్తికరంగా చెప్పాడు. "ప్రతి అబ్బాయి తన అమ్మలాగా చూసుకునే అమ్మాయి జీవితంలోకి రావాలని కోరుకుంటాడు. నా విషయంలో ప్రియాంక అచ్చం మా అమ్మలాగే కేరింగ్‌గా ఉంటుంది. నిజంగా ఆమె నా జీవితంలోకి రావడం నా అదృష్టం" అంటూ చెప్పారు.
ఇక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెళ్లి విషయంపైనా శివకుమార్ క్లారిటీ ఇచ్చాడు. "ఈ సంవత్సరం కచ్చితంగా పెళ్లి చేసుకుంటా. త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతాం" అంటూ ప్రకటించాడు. అయితే అసలు హైలైట్ మాత్రం .. తన పెళ్లి ప్లానింగ్స్ గురించి చెప్పడం. యాంకర్ వర్ష "పెళ్లి ఎక్కడ? ఎలా చేసుకుంటారు?" అని అడగగా, శివకుమార్ చాలా స్పెషల్‌గా స్పందించాడు. ఉత్తరాఖండ్‌లోని త్రియోగి నారాయణ ఆలయంలో పెళ్లి చేసుకోవాలని తమ కోరిక అని వెల్లడించాడు. ఈ ఆలయానికి ప్రత్యేకమైన పురాణ ప్రాధాన్యం ఉంది. 1000 ఏళ్ల చరిత్ర గల ఆలయం. శివపార్వతుల వివాహం అక్కడే జరిగిందని విశ్వసిస్తారు. అక్కడ వెలిగే అఖండ జ్యోతి వేల సంవత్సరాలుగా ఆరిపోకుండా వెలుగుతూనే ఉందని చెబుతారు.
"నేను శివుడిని.. ప్రియాంక నా పార్వతి. ఆ అఖండ జ్యోతి సాక్షిగా మేమిద్దరం ఒక్కటవ్వాలని కోరుకుంటున్నాం" అంటూ చెప్పడం అభిమానులను ఫిదా చేసింది. తన ప్రేమను ఆధ్యాత్మికతతో కలిపి చెప్పిన తీరు చాలా మందిని ఆకట్టుకుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో శివకుమార్-ప్రియాంక జంటకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ కలిసి చేసే వీడియోలు, ఇంటర్వ్యూలు, ఫోటోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు పెళ్లిపై శివకుమార్ ఇచ్చిన క్లారిటీతో ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది.


Click it and Unblock the Notifications




