నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నా.. సీరియల్ హీరోయిన్ ఆవేదన
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు ప్రియాంక నల్కరి. ఈ అమ్మడు ఒకప్పుడు తెలుగు సీరియల్స్‌లో వరుస అవకాశాలు దక్కించుకుని తన నటనతో ఆకట్టుకున్న ఈ భామ, ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి వెళ్లి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే ఇప్పుడు మళ్లీ తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానంటుంది. అంతే కాదు తాను చేసిన తప్పులను ఎవరు చేయొద్దని, తన జీవితాన్ని తానే చేతులారా నాశనం చేసుకున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఏం జరిగింది?
ప్రియాంక నల్కరి కెరీర్ ప్రారంభ రోజుల్లో తెలుగు బుల్లితెరపై 'ఆహ్వానం', 'మేఘమాల', 'మంగమ్మగారి మనవరాలు', 'శ్రావణ సమీరాలు' వంటి పలు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయం ఉన్నప్పటికీ తెలుగులో ఆమెకు స్టార్ హీరోయిన్ స్థాయి గుర్తింపు మాత్రం రాలేదు. అనంతరం యాంకర్‌గా మారి గెటప్ శ్రీనుతో కలిసి 'సినిమా చూపిస్తా మావా' కార్యక్రమంలో సందడి చేసింది. కానీ ఆ షో కూడా ఆమె కెరీర్‌కు పెద్దగా మలుపు తిప్పలేకపోయింది. సీరియల్స్‌తో పాటు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ప్రియాంక. అందరి బంధువయ, శివ మనసులో శృతి (SMS), కిక్ 2, హైపర్, నేనే రాజు నేనే మంత్రి వంటి చిత్రాల్లో నటించింది.

అలాగే రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన కాంచన 3 సినిమాలోనూ కనిపించింది. అయినప్పటికీ తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అక్కడే ఆమె జీవితాన్ని మార్చేసిన అవకాశం వచ్చింది. సన్ టీవీలో ప్రసారమైన 'రోజా' సీరియల్‌లో హీరోయిన్‌గా నటించిన ప్రియాంక, ఒక్కసారిగా తమిళనాడులో ఇంటింటా గుర్తింపు తెచ్చుకుంది. 'రోజా' పాత్ర ఆమెకు అపారమైన క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ప్రేక్షకులు ఆమె అసలు పేరుకంటే 'రోజా'గానే ఎక్కువగా గుర్తుపట్టే స్థాయికి చేరుకుంది. ఆ సీరియల్‌తో ఎన్నో అవార్డులు, అభిమానుల ప్రేమ, స్టార్‌డమ్‌ను సంపాదించింది.
తాజాగా కిస్సిక్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ప్రియాంక తన మనసులోని బాధను బయటపెట్టింది. యాంకర్ వర్షా మాట్లాడుతూ "ఇన్ని రోజులు ఎక్కడ దాక్కున్నారు? మీరెక్కడా కనిపించడం లేదు" అని అడగగా, ప్రియాంక ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. "నేను ఎక్కడా దాక్కోలేదు. కానీ నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు" అంటూ ఎమోషనల్‌గా స్పందించింది. ఇక యాంకర్ వర్షా మాట్లాడుతూ, "ఒక తెలుగు అమ్మాయి తమిళ ఇండస్ట్రీలోకి వెళ్లి అక్కడ బుల్లితెర సూపర్ స్టార్‌గా మారడం అంటే అది చిన్న విషయం కాదు. ఆ క్రెడిట్ అంతా మీకే దక్కుతుంది" అంటూ ప్రశంసలు కురిపించింది. దీనిపై స్పందించిన ప్రియాంక, తనకు 'రోజా' పాత్ర ఎంత ప్రత్యేకమో వివరించింది.
"నేను చేసిన మొదటి పెద్ద హిట్ సీరియల్ పేరు రోజా. ఇప్పటికీ చాలా మంది నన్ను ప్రియాంక అని కాకుండా రోజా అని పిలుస్తారు. తమిళనాడులో యూత్‌కు నేను అక్కలా మారిపోయాను. నేను కోరుకున్న అవార్డులు, గుర్తింపు అన్నీ ఆ ఒక్క ప్రాజెక్ట్ వల్లే వచ్చాయి" అంటూ తన ఆనందాన్ని పంచుకుంది. అయితే ప్రస్తుతం మళ్లీ తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని ప్రియాంక చెప్పడం విశేషం. "గతంలో నాపై నమ్మకం లేక అవకాశాలు ఇవ్వకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేను నన్ను నేను నిరూపించుకున్నాను. తమిళంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించాను. ఇప్పటికైనా తెలుగు ఇండస్ట్రీ నన్ను గుర్తించి అవకాశాలు ఇస్తుందేమో అని ఆశిస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు కూడా అవకాశాలు రాకపోతే నేను ఏం చేయలేను. అది వాళ్ల నిర్ణయం" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
అంతేకాదు, తన గురించి ఒక పెద్ద అపోహ కూడా ఇండస్ట్రీలో ఉందని వెల్లడించింది. "చాలా మంది నేను విదేశాల్లో సెటిల్ అయ్యానని అనుకుంటున్నారు. ఇంకొందరు ఇండియాలోనే లేనని భావిస్తున్నారు. కానీ నేను ఎక్కడికీ వెళ్లలేదు. ఇక్కడే ఉన్నాను. మీ అందరి మధ్యే ఉన్నాను. నన్ను గుర్తించండి" అంటూ భావోద్వేగానికి గురైంది. ఇక తన కెరీర్‌లో చేసిన అతిపెద్ద తప్పు గురించి కూడా ప్రియాంక ఓపెన్‌గా మాట్లాడింది. "ఇండస్ట్రీలో జీవితాంతం కొనసాగాలంటే మధ్యలో బ్రేక్ తీసుకోకూడదు. నేను అదే తప్పు చేశాను. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద పొరపాటు అదే. నిజం చెప్పాలంటే నా కెరీర్‌ను నేనే నా చేతులారా నాశనం చేసుకున్నాను. దయచేసి నా లాంటి తప్పు మరెవ్వరూ చేయొద్దు" అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
ప్రస్తుతం ప్రియాంక నల్కరి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూసి, తర్వాత తమిళంలో స్టార్‌గా ఎదిగిన ఆమె.. ఇప్పుడు మళ్లీ తెలుగులో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని ఆశపడుతోంది. మరి తెలుగు దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇస్తారా? ప్రియాంక మళ్లీ తెలుగు బుల్లితెరపై మెరవగలదా? అనేది చూడాలి.


Click it and Unblock the Notifications





