అన్నలా భావించా... నాతో కోరికలు తీర్చుకుని... బుల్లితెర నటి షాకింగ్ కామెంట్స్
సినీరంగంలో వెలిగిపోవాలని వచ్చే అమ్మాయిలను అవకాశాల పేరుతో ట్రాప్ చేసి వారిపై లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నారు కొందరు. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో జరిగే ఈ దారుణాలను ఎందరో హీరోయిన్లు బయటపెట్టారు. దేశంలో మీ టూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సమయంలోనూ, గతేడాది కేరళలో హేమ కమిటీ రిపోర్ట్ వెలుగుచూసిన తర్వాత కూడా పలువురు నటీమణులు తమ జీవితంలో జరిగిన సంఘటనలు తెలియజేశారు. అయితే కొందరు హీరోయిన్లు చిన్నతనంలోనే లైంగిక వేధింపులకు గురైనట్లు బయటపెట్టడం కలకలం రేపింది.
కుటుంబ సభ్యులు, బంధువులు చేతుల్లోనే తాము అత్యాచారానికి గురైనట్లు పలువురు హీరోయిన్లు తెలిపారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇలాంటి వారెందరో. కొందరు ఈ భయంకర సంఘటనలను బయటపెడితే, కొందరు మాత్రం లోలోపల కుమిలిపోతున్నారు. తాజాగా బుల్లితెర నటి ఒకరు తనకు చిన్నతనంలో ఎదురైన చేదు సంఘటనను బయటపెట్టారు. ఆమె ఎవరు? ఆ నటిపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి ఎవరు? అనే వివరాలు పరిశీలిస్తే.

తెలుగు బుల్లితెరపై నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు సమీరా షెరీఫ్. ఆడపిల్ల, జీవితం, భార్యామణి, ముద్దుబిడ్డ, డాక్టర్ చక్రవర్తి, మనసు మమత, ప్రతిబింబం, మంగమ్మగారి మనవరాళ్లు, తోడికోడళ్లు, అరవింద సమేత వంటి సీరియల్స్‌లో నటించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు ధారావాహికల్లో మెప్పించారు సమీరా. సీనియర్ నటి సన కుమారుడు సయ్యద్ అన్వర్ అహ్మద్‌ను 2019లో పెళ్లి చేసుకున్నారు సమీరా. ఈ జంటకు అర్హాన్, ఆమీర్‌లు సంతానం. గతేడాడి రెండో బిడ్డకు జన్మనిచ్చిన సమీరా.. ఎన్ఐసీయూ శిశువుల కోసం 6 లీటర్లకు పైగా తన తల్లిపాలను విరాళంగా అందించి తన పెద్ద మనసు చాటుకున్నారు. దీని వల్ల తల్లులకు ఎలాంటి నష్టం జరగదనీ... తల్లిపాలు ఇవ్వడం అంత కష్టమేమీ కాదని పాలిచ్చే తల్లులకు ప్రోత్సాహాన్నిచ్చారు.
తన అత్తగారు సనతో క్లోజ్‌గా ఉంటారు సమీరా. వీలున్నప్పుడల్లా వీరిద్దరూ రీల్స్, వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. అలాగే కొన్ని అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా సనతో కలిసి సమీరా.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అన్న అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా తన చిన్నతనంలో జరిగిన సంఘటనను సమీరా బయటపెట్టారు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఎదురింట్లో ఉండే ఆంటీవాళ్ల ఇంటికి రిలేటివ్స్ వచ్చారు. వాళ్లలో ఒక అంకుల్ లాంటి అన్న.. కొంచెం పెద్ద వయసు వ్యక్తి ఉండేవాడు. చిన్న పిల్లలకు మనం బుగ్గలు లాగి ముద్దు చేస్తూ ఉంటాం. అలా నన్ను ఎక్కువ ముద్దు చేసేవాడు. ముద్దులు పెడుతూ, బుగ్గలు లాగేవాడు. రైల్వే క్వార్టర్స్‌లో ఉండేవాళ్లం.. అందరం ఆడుకునేవాళ్లం. రైల్వే క్వార్టర్స్‌లో ఇళ్లు దూరం దూరంగా ఉండేవి, పైన టెర్రస్ ఉండేది అని సమీరా తెలిపారు.
పైన టెర్రస్ దగ్గరికి ఎవ్వరు రారు. దాగుడుమూతలు ఆడుకుందాం.. మనం ఇక్కడ ఆడుకుందామని చెప్పి మాతో సరదాగా ఉండేవాడు. పిల్లలతో కలిసి ఈ అన్న కూడా జాయిన్ అయ్యేవాడు. అలా నన్ను దాచిపెట్టి ముద్దులు పెట్టేవాడు. నాకు కొంచెం ఇబ్బందిగానే ఉండేది. కొంచెం వయసులోకి వచ్చిన తర్వాత నాకు అర్ధమైంది ఏంటంటే.. ఆయన నన్ను ముద్దు చేసేవాడు కాదు, నాతో కోరికలు తీర్చుకునేవాడు. ఇది పిల్లలపై జరిగే లైంగిక దాడి లాంటిదే. ఆ టైంలో మనకి అంత అవగాహన లేదు.. పేరెంట్స్‌కి తెలిసినా పిల్లలకు నేర్పించాలి, పిల్లలకు చెప్పాలి.. ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ ఇలాంటివి నేర్పించాలని మా తల్లిదండ్రులు అనుకోలేదేమో అని సమీరా గుర్తుచేసుకున్నారు.
నేను వెళ్లి చెప్పినా నువ్వెందుకు అక్కడికి వెళ్లావని ఫస్ట్ నన్ను కొట్టేవారు. నీకు అలా జరిగింది.. నీకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పకుండా పిల్లల్ని తిట్టేస్తే వాళ్లు ఇలాంటివి చెప్పడానికి భయపడతారు. నాకే కాదు.. ఇలా చాలామందికి జరిగింది. ఇది పిల్లలపై చూపించే ప్రేమ కాదు, లైంగిక పరమైన కోరిక అని సమీరా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు సమీరా ప్రయత్నాన్ని, ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











