సొంత చెల్లితోనైనా అలా ఉండాల్సిందే.. అబ్బాయిలకు సీనియర్ నటి వార్నింగ్
సీనియర్ నటి తోట హరిత ( Thota Haritha) అంటే.. కాస్త ఆలోచిస్తారు కావొచ్చు గానీ.. ఘట్టమనేని అఖిలాండేశ్వరి అంటే మాత్రం టక్కుమని గుర్తు పడుతారు. తోట హరిత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. తెరపై ఆమె అమాయకత్వం ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది. అదే సమయంలో ఆత్మవిశ్వాసంతో మెరిసే చూపులు దృఢమైన స్త్రీని గుర్తు చేస్తాయి. మాటలకంటే ముఖ కవళికలతోనే భావాలను పలికించగల అరుదైన నటి ఆమె. నిన్నటి 'చిన్న శాంతి'గా గుర్తింపు పొందిన ఆమె, నేటి బుల్లితెర 'ఘట్టమనేని అఖిలాండేశ్వరి'గా ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి హరిత.. నేటి సమాజంలో అమ్మాయిలు ఎలా ఉండాలో, వారి పట్ల అబ్బాయిలు ఎలా ఉండాలో సూచనలిచ్చింది.
తెలుగు నటి హరిత 'డబ్బు పెద్ద జబ్బు' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అప్పటికి ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు. చిన్న వయసులోనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వరుస సినిమాల్లో నటించింది. ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, చినరాయుడు పేకాట పాపారావు, దొంగపోలీస్ వంటి చిత్రాల్లో నటించి తన ప్రతిభను చాటింది. సీనియర్ హీరోల సరసన స్క్రీన్ పంచుకున్న ఆమె నటనకు అప్పుడే మంచి పేరు వచ్చింది. అయితే.. వెండితెరపై సినిమాల తగ్గడంతోబుల్లితెర వైపు అడుగుపెట్టింది హరిత.

అక్కడ తనకంటూ మరో అధ్యాయాన్ని ప్రారంభించింది. దాదాపు 80కు పైగా సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించింది. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. ముఖ్యంగా 'ముద్దమందారం' సీరియల్ ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఆ సీరియల్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కేవలం సీరియల్స్ లోనే కాదు.. రియాలిటీ షోలలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. సహనటుడు జాకీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది హరిత. ఇటు వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. దాదాపు 30 ఏళ్ల నట ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన హరిత, తన ప్రయాణాన్ని ఆపలేదు. హీరోయిన్‌గా మొదలైన ఆమె కెరీర్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, జడ్జిగా కొనసాగిస్తుంది.
తాజాగా నటి హరిత యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న కిస్సిక్ టాక్స్ షో పాల్గొన్నారు. ఈ సమయంలో ఆమె ముఖ్యంగా సమాజంలో ఆడపిల్లలు ఎలా ఉండాలి? అనే విషయంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత జనరేషన్‌లో ప్రేమ, పెళ్లి, పిల్లలు, డివోర్స్ వంటి విషయాలు చాలా వేగంగా జరుగుతున్నాయనే యాంకర్ వర్ష ప్రశ్నించగా... దానికి నటి హరిత తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. 'నేను ఇలానే ఉంటాను... మా ఇంట్లో అలానే ఉండేదాన్ని' అనే ధోరణి అమ్మాయిలకు సరైంది కాదన్నారు.
'ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉండాలి. గొడవలు వస్తాయి... కానీ తెగేదాకా తాడు తెంపకూడదు' అంటూ ఆమె వైవాహిక జీవితంపై తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ ఆగస్టుకు తన వివాహానికి 25 సంవత్సరాలు పూర్తవుతాయని చెబుతూ 'ఎన్ని విభేదాలు వచ్చినా గడప దాటి వెళ్లిన రోజు లేదు'అని తెలిపారు. ఇంకా ఆసక్తికరంగా 'నా ఇంట్లో కూడా ఎవరూ నాకు సపోర్ట్ చేయలేదు. నీ ఇష్టం... నీ ఇల్లు... మధ్యలో మాకేం?' అని చెప్పేవారు. బయట భర్త గురించి తప్పుగా మాట్లాడితే చివరికి పరువు పోయేది భార్యదే. భర్త గౌరవం భార్యలోనే ఉంటుంది. ఆ గౌరవాన్ని కాపాడే బాధ్యత కూడా భార్యదే' అని హరిత వ్యాఖ్యానించారు.
ఈ మధ్యకాలంలో రిలేషన్‌షిప్ పై కూడా హరిత స్పందించారు. 'గర్ల్‌ఫ్రెండ్‌గా ఎలా ఉన్నా పరవాలేదు. కానీ పెళ్లి అయిన తర్వాత భార్యగా మారితే ఆ బాధ్యతలను అర్థం చేసుకోవాలి. 'ముందు నచ్చాను... ఇప్పుడు ఎందుకు నచ్చడం లేదు?' అని అడగడం కరెక్ట్ కాదు. పెళ్లి తర్వాత నువ్వు భార్యవి... గర్ల్‌ఫ్రెండ్ కాదు' అని తెలిపారు. వివాహం అంటే కేవలం ప్రేమ కాదు, బాధ్యతలు, పరస్పర గౌరవం కూడా ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇటీవల చిన్నారులపై జరుగుతున్న దారుణాల నేపథ్యంలో కూడా హరిత భావోద్వేగంగా స్పందించారు. 'ఆడపిల్లల పట్ల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలి. నా ఇంట్లో నా కొడుకు అయినా సరే, తన చెల్లితో మాట్లాడాలంటే పది అడుగుల దూరం పాటించాలి. కోపం వచ్చినా, గొడవ పడ్డా... ఆ గౌరవం ఉండాలి' అని చెప్పారు. 'ఆడపిల్ల అంటే ఎందుకూ పనికిరానిది కాదు... ఆమెను పూజించాలి' అంటూ సమాజం ఆడపిల్లలను చూసే విధానంలో మార్పు రావాలని హరిత సూచించారు.


Click it and Unblock the Notifications











