టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటి మృతితో.. కరాటే కళ్యాణి ఎమోషనల్ పోస్ట్
Actress Vahini: తెలుగు టీవీ, సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటి వాహిని (వాసవి అలియాస్ పద్మ) బుధవారం తన స్వస్థలం విజయనగరంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో తీవ్రంగా పోరాడుతున్న ఆమెకు చికిత్స పొందుతూ చివరి శ్వాస విడిచారు. ఈ వార్త వెలుగులోకి రావడంతో సినీ అభిమానులు, టీవీ ప్రేక్షకులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
వాహిని మరణ వార్తను నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 'వాహిని అక్కను కాపాడాలని చాలా ప్రయత్నం చేశాను. కానీ కొద్దిసేపటి క్రితం తన జన్మస్థలమైన విజయనగరంలో స్వామిని చేరుకుంది. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి,' అంటూ కళ్యాణి చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. చిన్నప్పటి నుంచే వాహినిని తెలుసునని, విజయనగరంలో తమ ఇళ్లు పక్కపక్కనే ఉండేవని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు.

1978లో విజయనగరంలో జన్మించిన వాహిని... టీవీ, సినీరంగాల్లో 'జయ వాహిని' పేరుతో గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రలతో అడుగుపెట్టిన ఆమె, క్రమంగా తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి పేరు తెచ్చుకున్నారు.
సినిమాల కంటే టీవీ సీరియల్స్‌లోనే ఆమె ప్రయాణం మరింత సాఫీగా సాగిందని చెప్పాలి. 2019లో విడుదలైన రఘుపతి వెంకయ్య నాయుడు సినిమాలో వీకే నరేష్ సరసన నటించిన వాహిని... ఆ తర్వాత బహిర్బూమి సినిమాలో చివరిసారిగా కనిపించారు. నటనతో పాటు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.
గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న వాహిని ఆరోగ్య పరిస్థితిని ఇటీవలే కరాటే కళ్యాణి బయటపెట్టారు. ఆమె వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేయగా... పలువురు నటీనటులు, అభిమానులు తమవంతు సాయం అందించారు. అయినప్పటికీ ఆరోగ్యం మరింత విషమించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. అలా స్వస్థలం విజయనగరానికి వెళ్లిన వాహిని... బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
వాహిని మరణ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు, టీవీ నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. అటు వెండితెరపై , ఇటు బుల్లి తెరపై అలరించిన వాహిని... నిజజీవితంలో ప్రాణాలతో పోరాడుతూ చివరకు ఓడిపోయారు. ఆమె చేసిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరకాలం నిలిచిపోతాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











