‘బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచినా నో యూజ్... వాడి బతుకు ఏక్ దిన్ కా రాజాయే’
ఇండియాలో మెగా రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్‌బాస్. 100 రోజుల పాటు 15 మంది కంటెస్టెంట్స్ ప్రపంచానికి దూరంగా ఒకే ఇంట్లో ఉంటూ వినోదాన్ని పంచడం అన్న కాన్సెప్ట్ ఆధారంగా బిగ్‌బాస్‌కి రూపకల్పన చేశారు నిర్వాహకులు. తొలుత హిందీలో ప్రారంభమైన బిగ్‌బాస్ ఆ తర్వాత దేశంలోని ప్రాంతీయ భాషల్లోకి విస్తరించి కోట్లాది మందికి వినోదాన్ని పంచుతోంది. అయితే బిగ్‌బాస్‌లో విజేతగా నిలిచిన వారికి తర్వాత కెరీర్ ఉండదంటూ మాజీ కంటెస్టెంట్స్ ఎన్నోసార్లు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ మెగా రియాలిటీ షోపై బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, బుల్లితెర నటుడు అమర్‌దీప్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఉద్యోగానికి రాజీనామా
రాయలసీమలోని అనంతపురం జిల్లాలో పుట్టి హైదరాబాద్‌కు మకాం మార్చిన అమర్‌దీప్ తన కష్టంతో ఇక్కడి వరకు వచ్చాడు. లండన్‌లో చదువుకుని కొంతకాలం ఉద్యోగం చేసిన అమర్‌దీప్ నటనపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రయత్నాలు ప్రారంభించాడు. 2016లో పరిణయం అనే షార్ట్ ఫిల్మ్‌తో నటనను ప్రారంభించిన అమర్‌దీప్ చౌదరి అనంతరం పిజ్జా వర్సెస్ గొంగూర, మంగమ్మగారి మనవడు, సూపర్ మచ్చి, రాజుగారి కిడ్నాప్, నా పబ్ జీ నా వైఫ్, గర్ల్ ఫ్రెండ్, డబుల్ డేట్ వంటి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లలో నటించాడు.

సినిమాలు, సీరియల్స్‌తో బిజీ
2017లో ఉయ్యాల జంపాలా సీరియల్‌లో నటించిన అమర్‌దీప్ ఆ తర్వాత సిరిసిరి మువ్వలు, అత్తారింటికి దారేది, హిట్లర్ గారి పెళ్లాం సీరియల్స్ చేశాడు. ఈ దశలో జానకి కలగనలేదు సీరియల్ సూపర్ హిట్ అయ్యింది. అనంతరం సినిమాల్లోనూ అవకాశాల కోసం ట్రై చేశాడు. ఆయుష్మాన్ భవ, కేర్ ఆఫ్ అనసూయ, కృష్ణార్జున యుద్ధం, శైలజా రెడ్డి అల్లుడు తదితర సినిమాలలో నటించాడు. ఈ దశలో బిగ్‌బాస్ తెలుగు 7లో అవకాశం దక్కించుకున్న అమర్‌దీప్ చౌదరి... 15 వారాల పాటు హౌస్‌లోనే ఉన్నాడు. అయితే తృటిలో బిగ్‌బాస్ ట్రోఫీ మిస్ అవ్వగా.. రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.
బిగ్‌బాస్ ఫేమ్ ఏక్ దిన్ కా రాజాయే
అయితే సినిమాలలో అవకాశం దక్కించుకుని హీరోగా స్థిరపడాలన్నది తన కల అని అమర్‌దీప్ పలుమార్లు తెలిపాడు. తాజాగా ఐడల్ బ్రెయిన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బిగ్‌బాస్‌లో ఓట్లు వేశారని చెప్పేసి మన చేసిన సినిమా కోసం జనం థియేటర్స్‌కు వస్తారని ఊహించుకుని సినిమాలు చేయొద్దు. నువ్వు ఏం చేయగలవో ప్రూవ్ చేసుకుని వాళ్లను పిలిపించుకోవాలి తప్పా.. ఆ ఓట్లు ఇక్కడ పనిచేయవు. ఫస్ట్ వచ్చినా.. సెకండ్ వచ్చినా.. థర్డ్ వచ్చినా.. టాప్ 5 వచ్చినా ఏక్‌దిన్ కా రాజాయే, ఒక్కరోజే ఉంటుంది. ఈవెంట్స్ చేసుకుంటున్నాం.. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌లకు వెళ్తాం... స్టేజ్ షోలకు వెళ్తాం తప్పించి దాని వల్ల ఏ ఉపయోగం ఉండదు. కానీ బిగ్‌బాస్‌లో వచ్చిన ఫేమ్‌ని ఎలా వాడుకోవాలో? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో? మాత్రం తెలుసుకోవాలి. కానీ సక్సెస్ ఉండాలి. ఓపీకగా వెయిట్ చేయాలి అని అమర్‌దీప్ తెలిపారు.
లగ్జరీ కారు వదులుకున్నా
సీరియల్స్ ఇప్పుడే ఆపేశాను.. టీవీ నుంచి పక్కకి వచ్చి సినిమాలు చేద్దామని ఎంతో ఎదురుచూశాను. అలా ఉండగానే రెండు సినిమాలకు సైన్ చేశాను. ఒకటి రీ షూట్ వల్ల డిలే అయ్యింది.. ఈ గ్యాప్‌లో మరో సినిమాను కంప్లీట్ చేశాను. లేటైనా కానీ తొందరపడకుండా ఓపీకగా ఉండాలి. దీని వల్ల మనకి ఆర్ధిక సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే ఒక లైఫ్ స్టైల్ అలవాటు అయ్యింది... ఆ లైఫ్ స్టైల్ నుంచి పక్కకి వచ్చి బతకాలి. అన్ని లగ్జరీస్ ఉన్న ఒక కారులో నుంచి దిగి నేను నార్మల్ కారును వాడుతున్నాను. ఈ విషయం చెప్పడానికి నేనేం సిగ్గుపడటం లేదు.. హ్యాపీగానే ఉన్నాను. ఎందుకంటే అక్కడ దానిని మెయింటెన్ చేయాలి. ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఆ కారు తర్వాత ఏదో ఒకరోజు నా చేతికి వస్తుందని అమర్‌దీప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











