అమృతం ఈజ్ బ్యాక్.. ఎవర్‌గ్రీన్ కామెడీ సీరియల్ ఎందులో అంటే?
ఇప్పుడంటే ఓటీటీలు, వెబ్ సిరీస్‌లతో బోల్డెంత వినోదం లభిస్తోంది కానీ.. ఒకప్పుడు వినోదం అంటే మనదేశంలో కేబుల్ టీవీ ప్రసారాలే దిక్కు.. అలా టెలివిజన్ రంగంలో భారతదేశంలో తిరుగులేని హవా సాగించింది. ఇక తెలుగులో అయితే 90వ దశకం ప్రారంభంలో కేబుల్ టీవీ ప్రసారాలు ఊపందుకున్నాయి. ఈటీవీ, జెమినీ టీవీ వంటి ఛానెల్స్ రావడంతో దూరదర్శన్‌ను వదిలేసి ప్రేక్షకులు కొత్త ఛానెల్స్‌కు అతుక్కుపోయారు. వీటిలో కొన్ని ఐకానిక్ షోలు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రలు వేసుకున్నాయి. వీటిలో అమృతం సీరియల్ ఒకటి.
రాజమౌళీ కూడా అమృతం ఫ్యానే
ఐదుసార్లు మళ్లీ మళ్లీ ప్రసారమైన ఏకైక సీరియల్.. ఏకంగా 2.7 కోట్ల వ్యూస్ తెచ్చుకుని తెలుగునాట ఎవర్ గ్రీన్ కల్ట్ ఫాలోయింగ్ సంపాదించింది అమృతం. యూట్యూబ్ రంగ ప్రవేశం తర్వాత ఎన్నో ఏళ్లుగా, ఎన్నో కోట్ల వ్యూస్ సాదిస్తూ.. ఇప్పటి తరాన్ని కూడా అలరించింది అమృతం. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి వంటి వ్యక్తి కూడా ఈ ఐకానిక్ సీరియల్‌కు అభిమాని కావడం విశేషం. అలాంటి వ్యక్తినే అలరించింది అంటే అమృతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

90's కిడ్స్‌కి ఓ ఎమోషన్
అమృతం సీరియల్ గురించి ఇప్పటి తరానికి తెలియదు కానీ.. 90's కిడ్స్‌కి మాత్రం ఇది ఫేవరెట్ మాత్రమే కాదు.. ఒక ఎమోషన్. ఓరేజ్ ఆంజనేయులూ అంటూ బీజీఎంతో వచ్చే పాటతో ప్రారంభమై... అంజి, అమృతరావు, సర్వంలు చేసే అల్లరి కడుపుబ్బా నవ్వించేవి. ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు, అశ్లీలతకు దూరంగా పూర్తి ఆరోగ్యకరమైన హాస్యం అందించేది. జెమినీ టీవీలో నవంబర్ 18, 2001లో ప్రసారమైన అమృతం సీరియల్ ఏకధాటిగా ఆరేళ్ల పాటు నవంబర్ 18, 2007 వరకు ప్రసారమైంది.
ఆరేళ్ల పాటు ఏకధాటిగా స్ట్రీమింగ్
జస్ట్ ఎల్లో మీడియా పతాకంపై గుణ్ణం గంగరాజు, వెంకట్ డేగలు నిర్మాతలుగా అమృతం సీరియల్ తెరకెక్కింది. తొలుత పది ఎపిసోడ్స్ వరకు 1 నుంచి 10 ఎపిసోడ్స్ వరకు చంద్రశేఖర్ యేలేటీ దర్శకత్వం వహించగా.. వాసు ఇంటూరి, ఎస్ఎస్ కాంచీ, హరి చరణ్, సందీప్ గుణ్ణం, గోపి కసిరెడ్డిలు దర్శకత్వం వహించారు. శివాజీ రాజా, నరేష్, హర్షవర్షన్, గుండు హనుమంతరావు, వాసు ఇంటూరి, శివన్నారాయణ, రాగిణి, ఝాన్సీలు కీలకపాత్రలు పోషించారు. ఆరేళ్ల పాటు మొత్తం 313 ఎపిసోడ్స్ ప్రసారమైంది. రాజమౌళికి ఆస్థాన సినిమాటోగ్రాఫర్‌గా ఉన్న సెంథిల్ కుమార్ ఈ అమృతం సీరియల్‌కు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
అమృతం ఎందులో అంటే?
అమృతంలో నటించిన ప్రతి ఒక్క పాత్ర నాటి ప్రేక్షకుల నుంచి నేటి ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కామెడీ సీరియల్స్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఈ సీరియల్‌కు తర్వాత సెకండ్ సీజన్ వచ్చినా అంతగా ఆదరణ దక్కలేదు. అయితే ఈ ఐకానిక్ కామెడీ సీరియల్‌లోని పాత ఎపిసోడ్స్‌ను తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అమృతం టీమ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 24 నుంచి ఈ కామెడీ సీరియల్ యూట్యూబ్‌లో అందుబాటులోకి రానుంది. పాత ఎపిసోడ్లనే రీమాస్టర్ చేయించి నేటితరానికి, సాంకేతిక పరిజ్ఞానికి అనుగుణంగా ఆడియో, వీడియో హంగులను అద్ది రీ రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 24 నుంచి అంటే వచ్చే సోమవారం నుంచి అమృతం సీరియల్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో రోజుకు రెండు ఎపిసోడ్ల చొప్పున ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో అమృతం అభిమానులు పండగ చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











