Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజుపై బిగ్‌బాస్ దివ్య రివ్యూ.. పొలిశెట్టి మూవీపై షాకింగ్ కామెంట్స్..
Anaganaga Oka Raju: సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదలైన 'అనగనగా ఒక రోజు' సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొన్న సంగతి తెలిసిందే. 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ', 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' వంటి హిట్స్ తర్వాత యువ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) నుంచి వచ్చిన ఈ ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు, ట్రైలర్‌కు వచ్చిన స్పందన సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలైన తొలి రోజే పబ్లిక్ టాక్, సోషల్ మీడియా రియాక్షన్స్ జోరుగా వినిపిస్తున్నాయి.
నవీన్ పొలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ రొమాంటిక్ కామెడీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. తొలి చిత్ర దర్శకుడిగా మారి పరిచయమైన మారి ఈ సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన లైట్ హార్టెడ్ కామెడీగా ప్రచారం పొందిన ఈ సినిమా, సంక్రాంతి రేసులో గట్టి పోటీ ఇస్తుందనే టాక్ మొదటి నుంచే ఉంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ దివ్య నిఖిత (Divya Nikitha)తాజాగా తన రివ్యూ ఇచ్చింది. ఆమె చెప్పిన అభిప్రాయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే..?

దివ్య నిఖిత ముందుగా సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడింది. 'సినిమా మొత్తం చాలా కామెడీగా సాగిపోతుంది. అన్ని ఎలిమెంట్స్ బాగా సెట్ అయ్యాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా ఫన్నీగా ఉంటుంది. కామెడీ ఎలిమెంట్స్ అన్నీ అక్కడే బాగా వర్క్ అయ్యాయి. లైట్ హార్టెడ్, ఫుల్ ఎంటర్‌టైనర్ అనే ట్యాగ్ ఈ సినిమాకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది'అని చెప్పింది. ఇక నవీన్ పొలిశెట్టి పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించింది. 'ఇది పూర్తిగా నవీన్ పొలిశెట్టి సినిమా. అతనొక్కడే తన భుజాలపై ఈ మూవీని మోసుకెళ్లాడు అనిపిస్తుంది. కామెడీ, ఎమోషన్, డాన్స్, పాటలు అన్నింటిలోనూ ఆల్రౌండర్‌గా కనిపించాడు. అతని టైమింగ్, డైలాగ్ డెలివరీ సినిమాకు పెద్ద ప్లస్'అంటూ దివ్య నిఖిత అభిప్రాయపడింది.
కామెడీ సీన్స్ కూడా ఆర్గానిక్‌గా ఉన్నాయని, బలవంతంగా నవ్వించాలనే ప్రయత్నం కనిపించలేదని చెప్పింది. అయితే ఆమె నెగటివ్ పాయింట్స్ కూడా ప్రస్తావించింది. 'స్టోరీకి కంక్లూజన్ తీసుకురావడంలో కొంచెం అతిగా ప్రయత్నించినట్లు అనిపించింది. కొన్ని క్యారెక్టర్స్‌ను అనవసరంగా హై చేయాలని చూసిన ఫీలింగ్ వచ్చింది. ఆ సమయంలో కొద్దిగా ల్యాగ్, బోరింగ్‌గా అనిపించింది' అని తెలిపింది. అలాగే సెకండ్ హాఫ్‌లో పెట్టిన స్పెషల్ సాంగ్ గురించి కూడా విమర్శించింది. 'సందర్భం లేకుండా ఐటెం సాంగ్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు'అంటూ తన అసంతృప్తి వ్యక్తం చేసింది.
హీరోయిన్ డబ్బింగ్ విషయానికీ ఆమె స్పందించింది. 'హీరోయిన్ డబ్బింగ్ కొంచెం ఓవర్‌గా అనిపించింది. ప్రతి డైలాగ్‌ను అతిగా చెప్పించడం చిరాకు తెప్పించింది'అని చెప్పింది. అయినప్పటికీ, మొత్తం మీద చూస్తే ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సినిమాలతో పోలిస్తే 'అనగనగా ఒక రాజు' చాలా బెటర్ మూవీ అని స్పష్టం చేసింది. 'ఈమధ్య ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పేరుతో వస్తున్న కొన్ని సినిమాల కంటే ఇది చాలా బాగుంది. బెస్ట్ సంక్రాంతి మూవీగా ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు'అని దివ్య నిఖిత తన రివ్యూను ముగించింది.
మొత్తంగా చూస్తే.. నవీన్ పొలిశెట్టి వన్ మ్యాన్ షోగా నిలిచిన 'అనగనగా ఒక రాజు'పై పబ్లిక్ టాక్ ఎక్కువగా పాజిటివ్‌గా ఉంది. కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఆప్షన్‌గా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బిగ్ బాస్ దివ్య నిఖిత ఇచ్చిన రివ్యూ వైరల్ అవుతుండటంతో, రాబోయే రోజుల్లో ఈ సినిమాపై చర్చ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











