గడ్డకట్టే చలి, జవాన్ చనిపోతే ..భారత్ సైన్యంలో భర్త గురించి యాంకర్ గాయత్రీ భార్గవి ఎమోషనల్
మనం ఇక్కడ హాయిగా నిద్రపోతున్నామంటే దేశ సరిహద్దుల్లో రెప్ప వాల్చకుండా కాపలా కాస్తున్న సైనికుల వల్లే. ఎముకలు కొరికే చలి ఉండే హిమాలయాల్లోనైనా, ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే రాజస్థాన్ ఏడారిలోనైనా, ఏకధాటిగా వర్షం కురిసే ఈశాన్య రాష్ట్రాల్లోనైనా దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తారు సైనికులు. అయితే శత్రువుల కంటే ప్రకృతితోనే భారత సైన్యం యుద్ధం చేస్తోంది. అన్నింటిలోకి ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ గ్లేసియర్‌లో పహారా కాయడం ప్రాణాలతో చెలగాటమే.
మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు, వణికించే చలి, ఎప్పుడు ఎటువైపు నుంచి మంచు తుఫాను విరుచుకుపడుతుందో తెలియని పరిస్ధితి ఇలా వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అర్ధం కాదు. భూ ఉపరితలానికి దాదాపు 20 వేల అడుగుల ఎత్తులో పగలు రాత్రి సైనికులు కాపలా కాస్తుంటారు. ప్రతికూల వాతావరణం కారణంగా గత కొన్నేళ్లుగా ఎందరో సైనికులు తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారు. మంచు ఎప్పుడు కుంగిపోయి గోతులు ఏర్పడతాయో తెలియదు.. వాటిలో పొరపాటున పడితే ఇక అంతే సంగతులు. కార్గిల్ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య కంటే ఎక్కువగా దాదాపు 97 శాతం మంది కేవలం ప్రతికూల వాతావరణం వల్లే ప్రాణాలు కోల్పోయారు.

అయితే దేశ రక్షణ విధుల్లో పాల్గొంటున్న సైనికుల కుటుంబాలు ఇక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతాయి. ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందోనని వారు వణికిపోతూ ఉంటారు. తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను, తోబుట్టువులను , బంధుమిత్రులను అనుక్షణం గుర్తుచేసుకుంటూ సైనికులు పహారా కాస్తుంటారు. మనం ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేం. ఇదిలావుండగా.. భారత సైన్యం ధైర్యసాహసాలను, కష్టాలను యాంకర్, సినీనటి గాయత్రీ భార్గవి పంచుకున్నారు.
బుల్లితెరపై యాంకర్‌గా ప్రేక్షకులను అలరిస్తూనే సినిమాల్లోనూ కీలకపాత్రలు పోషిస్తున్నారు గాయత్రీ. దిగ్గజ దర్శకుడు బాపుకి స్వయంగా ఆమె మనవరాలు. కానీ ఆయన పేరుని వాడుకుని తాను పైకి రావాలని అనుకోలేదని.. స్వశక్తితోనే ఈస్థాయికి వచ్చినట్లు గాయత్రీ ఎన్నోసార్లు చెప్పారు. ఆమె భర్త పేరు విక్రమ్.. ఆర్మీలో పనిచేస్తూ దేశానికి సేవలందిస్తున్నారు. మాది ప్రేమ వివాహమని, తమకు ఇద్దరు అబ్బాయిలని గాయత్రీ తెలిపారు. తన భర్త చాలా సైలెంట్‌గా ఉంటారని, తన కెరీర్‌కు ఆయన ఎంతో తోడ్పాటును అందించారని చెప్పారు.

ఆయన నిద్రలో ఒక్కొక్కసారి ఉలిక్కిపడేవారని.. ఏమైందని అడిగితే తనకు ఓ కల వచ్చినట్లుగా చెప్పేవారని గాయత్రీ అన్నారు. ఆ కలలో '' తన అండర్‌లో ఓ ఏడుగురు జవాన్లు గ్లేసియర్‌లో పహారా కాస్తుంటారు, ఓ చిన్న బంకర్‌లో తలదాచుకుంటూ ఉంటారు.. శత్రువు ఎప్పుడైనా బాంబింగ్ చేయొచ్చు. అందుకే ఈ బంకర్‌లో దాక్కుంటాం. ఏడుగురు సభ్యులున్న తన బృందంలో ఓ జవాన్ తోటివారు వారిస్తున్నా వినకుండా ఎక్కడికో వెళ్లాడట. అతను వెనక్కి రాలేదు.. అప్పటికే రాత్రి అయ్యింది, టార్చ్ వేసి చూద్దామంటే శత్రువుకి తెలిసిపోతుంది. అయినప్పటికీ చాలా వెతికినా ప్రయోజనం లేక పొద్దున్నే చూద్దామని వచ్చేశారు ''.
'' మర్నాడు ఓ మృతదేహాన్ని వీరు గుర్తిస్తారు. అది ఆ సైనికుడి బాడీయే.. మొత్తం మంచుతో గడ్డకట్టుకుపోయింది. అయితే అతను బుల్లెట్ తగిలి చనిపోయాడా.. స్పృహ తప్పాడో తెలియదు, కానీ విషయం పై అధికారులకు చెప్పాలి. అనంతరం గడ్డకట్టుకుపోయిన డెడ్ బాడీని గొడ్డలతో కొట్టి మడిచి బాక్స్‌లోకి సర్ధి పంపించాలి. అప్పటి వరకు తమతో ఉన్న వ్యక్తిని ఇలా చేయాల్సి వచ్చినా ఆఫీసర్‌గా తనకు తప్పలేదని '' ఆయన గాయత్రీతో చెప్పారట. ఈ విషయం వివరిస్తూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు భారత జవాన్లకు సెల్యూట్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











