'ఉదయభానుతో గొడవకు కారణం అదే..వాళ్ళే కెలికి పెద్ద వివాదంగా'
తెలుగువారికి బుల్లితెర పరిచయమైన కొత్తల్లో స్టార్ యాంకర్లుగా వెలుగొందారు సుమ, ఝాన్సీ, ఉదయభాను, శిల్పా చక్రవర్తి . వీరిలో సుమ ఒక్కరే లైమ్ లైట్‌లో ఉండగా.. మిగిలినవారు అడపాదడపా మాత్రమే పలకరిస్తున్నారు. ఇక అప్పట్లో సుమ- ఝాన్సీ, ఝాన్సీ - ఉదయభాను మధ్య పోరు ఓ రేంజ్‌లో ఉండేది. వీరిలో ఝాన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. యాంకర్‌గా ఓ వెలుగు వెలిగిన ఆమె.. అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సపోర్టింగ్ రోల్స్, కామెడీ పాత్రలు చేసి అంతకుమించి పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈమె కామెడీ టైమింగ్ మాత్రం సూపర్ అంటారు ఫ్యాన్స్.
బుల్లితెరపై పదుల సంఖ్యలో షోలు, వందలాది సినిమా ఈవెంట్స్ చేసి శెభాష్ అనిపించుకున్నారు ఝాన్సీ. జెమినీ టీవీలో 20 ఏళ్ల క్రితం ప్రసారమైన అమృతం సీరియల్‌లో ఝాన్సీ నవ్వించారు. ఆ తర్వాత ఆహా ఓటీటీలో ది బేకర్ అండ్ ది బ్యూటీ , హాస్టల్ డేస్ అనే వెబ్ సిరీస్‌లోనూ ఆమె నటించారు. తోడు, జయంమనదేరా, తులసి, సింహా సినిమాల్లో నటనకు గాను ఝాన్సీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులతో సత్కరించింది. ఇవి గాక ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థల నుంచి ఆమె అవార్డులు, రివార్డులు అందుకున్నారు.

కెరీర్‌పరంగా ఝాన్సీ ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగిపోయారు. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమె ఇబ్బందిపడ్డారు. నటుడు , కమెడియన్ జోగి నాయుడుని ఝాన్సీ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ధన్య అనే కూతురు కూడా ఉంది. అయితే పెళ్లయిన ఏడాదికే జోగి నాయుడు - ఝాన్సీ దంపతులు విడిపోయారు. వీరిని కలిపేందుకు మెగాస్టార్ చిరంజీవి, బ్రహ్మానందం వంటి పెద్దలు ఎంతో ప్రయత్నించినా ఫలితం శూన్యం.
ఇన్నేళ్ల కెరీర్‌లో ఏ వివాదంలోనూ ఝాన్సీ తలదూర్చకపోవడం విశేషం. తన వాక్చాతుర్యం, సమయస్పూర్తితో ఎన్నో ఈవెంట్లను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించి ప్రశంసలు దక్కించుకున్నారామె.
ఇటీవలి కాలంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఝాన్సీ. ఈ సందర్భంగా బుల్లితెర, వెండితెరపై తన ప్రస్థానం.. జోగినాయుడుతో ప్రేమ, పెళ్లి, విడాకులు వంటి అంశాలను ఆమె పంచుకుంటున్నారు. తనకు బాగా పొగరని, అస్సలు మాట్లాడనని ఇండస్ట్రీలో ఇప్పటికీ అనుకుంటూ ఉంటారని కానీ అదంతా నిజం కాదని ఝాన్సీ వెల్లడించింది. డబ్బుల విషయంలో , అవకాశాల విషయంలో తనను ఎంతోమంది చీట్ చేశారని ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాంకరింగ్‌కు పిలిచినా డబ్బులిచ్చేవారని.. కొన్నిసార్లు క్రెడిట్ మొత్తం వాళ్లే కొట్టేసేవాళ్లని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభానుతో గొడవపై యాంకర్ అడిగిన ప్రశ్నకు తనదైనశైలిలో ఆన్సర్ ఇచ్చారు. మా ఇద్దరి మధ్య ఏదో జరిగిందని కొందరు కావాలని ప్రచారం చేశారని ఝాన్సీ అన్నారు. కెరీర్‌లో ఎంతో మందితో కలిసి ట్రావెల్ చేస్తామని.. కొందరు దగ్గరిగా ఉంటారు, ఇంకొందరు దూరంగా ఉంటారని తెలిపారు. వాళ్లను రోజూ కలవకపోయినా, మాట్లాడకపోయినా వారితో శత్రుత్వం ఉన్నట్లు కాదని ఝాన్సీ పేర్కొన్నారు.
కొంతమందితో సాన్నిహిత్యం ఉంటుంది, కొంతమందితో పరిచయం ఉంటుందని.. తనకు ఉదయభానుతో పరిచయం ఉంది, శత్రుత్వం లేదని ఝాన్సీ క్లారిటీ ఇచ్చారు. సుమతో ఎక్కువ క్లోజ్‌గా ఉండటం, ఉదయభానుతో అంతగా కలవకపోవడవంతో మా మధ్య గొడవ జరిగినట్లుగా జనంలోకి వెళ్లిందని , అంతకుమించి ఏం లేదని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఝూన్సీ చెప్పిన మాటలను అర్ధం చేసుకుంటారో, లేక మరో రకంగా అర్ధం చేసుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











