వివాదంలో సినీ నటి రంభ.. క్షమాపణ చెప్పిన యాంకర్ రవి
తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ రంభ, యాంకర్ రవి వివాదంలో ఇరుక్కుపోయారు. ఇటీవల ఓ షోలో చేసిన స్కిట్ అభ్యంతరంగా ఉండటంతో హిందు మతవాదులు ఘాటుగా స్పందించారు. హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా స్కిట్ ఉండటం వల్ల తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని ఆరోపిస్తూ యాంకర్ రవిని హెచ్చరించారు. అయితే ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారక ముందే యాంకర్ రవి స్పందించి క్షమాపణలు చెప్పారు. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
దక్షిణాది, ఉత్తరాదిలో అగ్ర హీరోలతో నటించిన అందాల భామ రంభ వివాహం చేసుకొని దాంపత్య జీవితానికి పరిమితమైంది. అయితే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తనతో బొంబాయి ప్రియుడు సినిమాలో నటించిన జేడీ చక్రవర్తితో కలిసి ఆమె ఓ టెలివిజన్ షోలో పాల్గొన్నారు. అప్పటి సినిమా షూటింగ్ అనుభూతులను పంచుకొన్నారు. ఈ సందర్భంగా టీవీ యాజమాన్యం చిరంజీవి, రంభ నటించిన బావగారు బాగున్నారా సినిమాలోని ఓ సన్నివేశాన్ని పేరడిగా చేశారు.

బావగారు బాగున్నారా సినిమాలో నందీశ్వరుడి కొమ్ముల మీదుగా చిరంజీవి చూసిన సమయంలో శివుడు కాకుండా రంభ కనిపిస్తుంది. దాంతో అయ్యగారు కనిపించారా? అంటే అమ్మవారు కనిపించారు అంటూ రంభను చూసి అంటాడు. ఆ సమయంలో బావగారు బాగున్నారా అంటూ చిరంజీవిని రంభ పలకరిస్తుంది. దాంతో చిరు కంగారు పడిపోతాడు.
అదే సీన్‌ను జేడీ, రంభపై టెలివిజన్ షోలో రిపీట్ చేశారు. అయితే ఈ సీన్ చూసిన కొందరు హిందువాదులు నేరుగా యాంకర్ రవికి కాల్ చేశారు. మీరు చేసిన పని బాగాలేదు. హిందూ దేవుళ్లు అంటే చులకనా? అని రవిని కడిగిపడేశాడు. అయితే తాము కొత్తగా చేసిందేమీ లేదు. ఆ సీన్ చిరంజీవి నటించిన ఓ సినిమాలోనిది. అందులో అప్పుడు తప్పు కనిపించనిది ఇప్పుడు మీకు తప్పు కనిపిస్తుందా? అంటూ ప్రశ్నించారు. అయితే ఆ సినిమా తాము చూడలేదు. హిందు దేవుళ్లంటే మీకు గౌరవం లేదా? మీరు అలాంటి చెత్త స్కిట్స్ ఎలా చేస్తారు అంటూ రాష్ట్రీయ వానర సేవ ప్రతినిధులు హెచ్చరించారు.
అయితే తాము బావగారు బాగున్నారా? అనే సినిమాలోని సీన్ క్రియేట్ చేశాం. చిరంజీవి గారు చేశారంటే తప్పు చేయలేదనేది మేము భావించాం. అది తప్పు అయితే.. దానిపై ఎందుకు అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు వివాదం చేస్తున్నారు అని యాంకర్ రవి అన్నాడు. దాంతో మీరు హిందువేనా? అని సదరు వ్యక్తి ప్రశ్నిస్తే.. నేను ఇండియన్‌ను అంటూ యాంకర్ రవి సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా షో నుంచి ఆ స్కిట్‌ను తొలగించామని క్లారిటీ ఇచ్చారు.
అయితే హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయనే విమర్శల నేపథ్యంలో యాంకర్ రవి సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు. రీసెంట్‌గా నేను కొంత మంది ఆర్టిస్టులం ఓ టెలివిజన్ షోలో స్కిట్ వేశాం. అయితే మేము ఉద్దేశపూర్వకంగా చేయలేదు. ఓ రైటర్‌తో రాయించి చేసిన స్కిట్ కాదు. ఓ పాపులర్ సినిమాలోని సన్నివేశం అది. ఈ సినిమాలోని సన్నివేశాన్ని స్టేజ్ మీద ప్రదర్శించాం. దాని వల్ల చాలా మంది హిందువులు హర్ట్ అయ్యారని తెలిసింది. చాలా మంది కాల్ చేస్తున్నారు. అందుకు క్షమాపణలు చెబుతున్నాం. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకొంటాం. జై శ్రీరామ్ అంటూ యాంకర్ రవి చెప్పారు.


Click it and Unblock the Notifications











