యాంకర్ శ్యామలకు నోటీసులు.. అరెస్ట్ తప్పదా? ఆ ఇద్దరు పరారీలో.. ఈడీ రంగ ప్రవేశం
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ తారలు, ఇన్‌ఫ్లూయెన్సర్లకు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ స్కామ్‌లో ఇప్పటికే విష్ణుప్రియ, టేస్టీ తేజకు నోటీసులు జారీ చేయగా.. తాజాగా మరో ఆరుగురికి నోటీసులు జారీ చేయడం గమనార్హం. అయితే ఈ కేసులో విచారణ జరుపుతున్న పోలీసులు.. అవసరమైతే అరెస్ట్ చేయాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ స్కామ్ పూర్తి వివరాల్లోకి వెళితే..
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో మంగళవారం విష్ణుప్రియ, టేస్టీ తేజకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరారు. అయితే షూటింగ్ బిజీ కారణంగా విచారణకు హాజరు కాలేనని చెప్పి.. తన తరఫున రేడియో జాకీ, బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాషా హాజరు అయ్యారు. అయితే ఈ కేసులో టేస్టీ తేజ విచారణకు హాజరై పోలీసులు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పినట్టు తెలిసింది.

బెట్టింగ్ యాప్ కేసు విచారణను వేగవంతం చేసిన పంజాగుట్ట పోలీసులు.. తాజాగా మరో ఆరుగురికి నోటీసులు జారీ చేశారు. వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల, సుప్రిత, రీతూ చౌదరీ, అజయ్, సన్నీ సుధీర్, అజయ్ సన్నీలకు నోటీసులు జారీ చేశారు. గురువారం వారిని విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే బెట్టింగ్ యాప్‌లో ప్రముఖంగా పేర్లు వినిపించిన ఇమ్రాన్, హర్ష సాయి ఇద్దరు పరారీలో ఉన్నట్టు తెలుస్తున్నది. పోలీసులు విచారణకు సిద్దమవుతున్నారని తెలుసుకొన్న వెంటనే వారిద్దరూ దుబాయ్‌కి వెళ్లినట్టు పోలీసులు ప్రాథమికంగా సమాచారాన్ని సేకరించారు. వారిని ఆచూకీ తెలిసిన తర్వాత వెంటనే వారికి నోటీసులు ఇచ్చి విచారించాలని ప్రయత్నిస్తున్నారు.
అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ స్కామ్‌లో భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగాయి. పెద్ద ఎత్తున్న మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. పంజాగుట్ట పోలీసులతోపాటు ఈడీ అధికారులు కూడా విచారించేందుకు రెడీ అవుతున్నారు. వీరికి సంబంధించిన విషయాలను అత్యాధునిక టెక్నాలజీతో సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ నుంచి సేకరిస్తున్నట్టు సమాచారం.
బెట్టింగ్ యాప్ కారణంగా చాలా మంది యువకులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే అభియోగాలతో ఓ సిటిజెన్ ఇచ్చిన ఫిర్యాదును ఆధారం చేసుకొని సినీ తారలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు చేశాం. మొత్తం 11 మందిపై క్రిమినల్ కేసు నమోదు చేశాం. ఎవరైతే ఆన్‌లైన్‌లో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారో వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశాం అని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ కేసును స్వయంగా విజయ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.


Click it and Unblock the Notifications











