యాంకర్ శ్యామలకు బెదిరింపు కాల్స్.. మమ్మల్ని బతకనివ్వండి..!
సినీనటి, స్టార్ యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు తనను బెదిరిస్తున్నారని, చాలా భయంగా ఉందంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో వైసీపీ తరపున శ్యామల ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ముసలి తోడేలు, గుంట నక్క స్టోరీని చెప్పారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించినవేనంటూ టీడీపీ, జనసేన శ్రేణులు భగ్గుమన్నాయి. అప్పట్లోనే ఆమెపై విపరీతంగా ట్రోలింగ్ నడిచింది.
30 ఇయర్స్ పృథ్వీ అయితే ఆమెపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. తాను చేసిన లౌక్యం సినిమాలో ఆమె ఓ చిన్న క్యారెక్టర్ చేసిందన్నారు. విశాఖలో తాము ప్రచారం చేసిన సమయంలో రెల్లి వీధి, మత్స్యకారులు నివసించే ప్రాంతాల్లోకి వెళితే అవి కాలుష్యంతో దుర్గంధపూరితంగా ఉన్నాయని, అడుగుతీసి అడుగు పెట్టడం కూడా కష్టంగా ఉందని పృథ్వీ చెప్పారు. అలాంటి ఏరియాల్లోకి వచ్చి విశాఖ చాలా సుందర ప్రాంతమని శ్యామల చెప్పిందని.. ఆవిడ కనపడితే చెప్పులు, చీపుళ్లతో కొట్టేందుకు అక్కడి జనం సిద్ధంగా ఉన్నారని పృథ్వీ కౌంటరిచ్చారు.

కట్ చేస్తే.. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లలో గెలుపొందిన వైసీపీని 11 అసెంబ్లీ స్థానాలకు, 4 ఎంపీ సీట్లకు పరిమితం చేశారు ఈ ఓటమిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మద్ధతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే శ్యామల ఓ వీడియో విడుదల చేశారు.
అందులో .. '' ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నా. ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు, అఖండ విజయం సాధించిన కూటమికి ధన్యవాదాలు. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ , పురంధేశ్వరి గారికి హార్ధిక శుభాకాంక్షలు. అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అన్నారు.
వైఎస్ జగన్ ఓటమి గురించి మాట్లాడుతూ.. ఎస్.. మేం ఓడిపోయాం.. కానీ గెలిచిన నాడు విర్రవీగలేదు.. ఓడిపోయిన నాడు కుంగిపోలేదు. జగన్ మరింత బలం పుంజుకుని.. మనందరం కలిసి జనగన్నతో నడిస్తే.. మళ్లీ మంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నా.. ఎప్పటికీ జగనన్నతోనే నా ప్రయాణం. ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.. ''
కానీ చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. ఒక రకమైన భయంగా ఉంది. అయితే మీకు ఒకటి నచ్చుతుంది.. నాకు మరొకటి నచ్చుతుంది, అలాగని మీకు నచ్చింది నాకు నచ్చాలని లేదు. తనకు నచ్చిన దారి గురించే చెప్పాను. మరి నువ్వు బతకడానికీ వీల్లేదనడం అన్యాయం అన్నా. దయచేసి వ్యక్తిగతంగా తీసుకోవద్దు, తాను పర్సనల్‌గా ఎవరిపైనా విమర్శలు చేయలేదు.. చేయను కూడా, ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాను. ఒక పార్టీని గెలిపించడం కోసం తాను చేయగలిగినదంతా చేశా.. ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడాను తప్పించి , లేనిది ఎక్కడ మాట్లాడలేదు. దయచేసి అంతా అర్ధం చేసుకుంటారని కోరుకుంటున్నా..'' అంటూ శ్యామల ముగించారు.
ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్యామలకు ఫోన్లు చేసి బెదిరిస్తోంది ఎవరు..? వారి వెనుక ఎవరున్నారు..? ఆమెకు మునుపటిలా అవకాశాలు వస్తాయా ..? కూటమికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి ఇదే ట్రీట్‌మెంట్ ఉంటుందా అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











