బెట్టింగ్ చిక్కుల్లో స్టార్ యాంకర్.. తెలియకుండా చేసిన తప్పు అంటూ..
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ విషయం వైరల్ అవుతుందో ముందుగా చెప్పడం కష్టం. అలా ఇప్పుడు ఓ స్టార్ యాంకర్‌కు సంబంధించిన పాత వీడియో మళ్లీ వెలుగులోకి వచ్చి చర్చనీయాంశంగా మారింది. గతంలో చేసిన ఓ ప్రమోషనల్ వీడియో నెట్టింట తిరిగి ట్రెండ్ అవుతుండగా, దానిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ యాంకర్ స్వయంగా స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ స్టార్ యాంకర్ ఎవరు? ఆమె ఏమని స్పందించింది?
ఆ స్టార్ యాంకర్ ఎవరో కాదు.. ప్రముఖ యాంకర్ స్రవంతి చోకరపు (Sravanthi Chokarapu). గతంలో చేసిన ఒక ప్రమోషనల్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కంటెంట్ కావడంతో ఈ వీడియో చుట్టూ వివాదం మరింత ముదురుతోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో యాంకర్ స్రవంతి ఒక టెలిగ్రామ్ చానల్‌ను ప్రమోట్ చేస్తూ, క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించిన ప్రెడిక్షన్స్, జాక్‌పాట్ అవకాశాల గురించి చెప్పినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, ఇలాంటి ప్రమోషన్లు యువతను తప్పుదారి పట్టించే అవకాశముందని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో, ఇది పాత వీడియో అని గుర్తించిన కొందరు దీనిపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ పరిణామాల మధ్య యాంకర్ స్రవంతి స్వయంగా స్పందిస్తూ అసలు విషయాన్ని వెల్లడించారు. ఆమె వివరణ ఇస్తూ.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కొత్తది కాదని, చాలా కాలం క్రితం చేసిన పాత ప్రమోషన్ అని స్పష్టం చేశారు. ఆ సమయంలో ఇలాంటి యాప్‌ల గురించి సరైన అవగాహన లేకపోవడంతో తెలియకుండా ఆ ప్రమోషన్‌లో పాల్గొన్నానని తెలిపారు. తర్వాత పరిస్థితులు అర్థమైన వెంటనే తగిన చర్యలు తీసుకున్నట్లు ఆమె చెప్పారు.
ఇక ప్రస్తుతం ఆ పాత వీడియోను మళ్లీ కావాలనే వైరల్ చేస్తున్నారని స్రవంతి ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు ఫాలోయింగ్ కోసం లేదా ఉద్దేశపూర్వకంగా ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆ విషయానికి సంబంధించిన సమస్య చాలా కాలం క్రితమే సర్దుమణిగిందని, సంబంధిత అధికారులకు అవసరమైన వివరణలు, డాక్యుమెంట్లు అందజేసినట్లు వెల్లడించారు. చట్టపరమైన ప్రక్రియ అంతా పూర్తి చేశానని, ఇప్పుడు ఈ అంశంపై కొత్తగా చర్చించాల్సిన అవసరం లేదని ఆమె తేల్చిచెప్పారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పరోక్షంగా సూచించారు.
అయితే ఈ వివాదం మళ్లీ సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తుండటంతో, ఆమె మరోసారి స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఇక అభిమానులు, ప్రజలకు స్రవంతి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పాత వీడియోలను నమ్మవద్దని, అవి తప్పుదారి పట్టించేలా ఉన్నాయని హెచ్చరించారు. అలాంటి వీడియోలు ఎక్కడ కనిపించినా వెంటనే రిపోర్ట్ చేయాలని కోరారు. చివరగా, ఏదైనా తన వల్ల తప్పు జరిగి ఉంటే క్షమించమని వినయపూర్వకంగా చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications


















