Suma Kanakala : స్టార్ హీరోలకే సాధ్యం కానీ ఘనత .. రేర్ ఫీట్ కొట్టిన యాంకర్ సుమ
తెలుగు నాట దాదాపు పాతికేళ్లుగా స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్నారు సుమ కనకాల . ఇండస్ట్రీకి ఎంతో మంది వచ్చారు, వెళ్లారు కానీ సుమ మాత్రం ఎవర్ గ్రీన్. తెలుగమ్మాయి కాకపోయినా తెలుగువారి కంటే అద్భుతంగా తెలుగును మాట్లాడుతూ భాషాభిమానుల మన్ననలు పొందారు సుమ . ఆవిడతో పాటు కెరీర్ ప్రారంభించిన వాళ్లు ఇప్పటికే ఫేడ్ ఔట్ అయిపోగా సుమ మాత్రం ఇంకా యాంకరింగ్ చేస్తూనే ఉన్నారు. అది కూడా నెంబర్‌వన్‌గా కావడం విశేషం. కొత్తగా ఎంతమంది యాంకరింగ్‌లోకి వచ్చినా సుమ దరిదాపుల్లోకి వచ్చేవాళ్లు మాత్రం లేరు. తాజాగా ఆమె రేర్ ఫీట్ కొట్టారు. ఈ వివరాల్లోకి వెళితే :
1975 మార్చి 22న కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించారు సుమ. ఆమె పూర్తి పేరు పల్లాస్సన పాచువెట్టిల్ సుమ. తల్లిదండ్రులు ప్రణవి నారాయణన్ కుట్టి నాయర్, పల్లాస్సన పాచువెట్టిల్ విమల. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆయన ఉద్యోగరీత్యా సుమ కుటుంబం సికింద్రాబాద్‌లోని మెట్టుగూడలో స్థిరపడింది. స్థానిక సెయింట్ ఆన్స్ హైస్కూల్, రైల్వే డిగ్రీ కాలేజీలో చదువుకున్నారు సుమ. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న ఆమె స్టేజ్‌పై పలు ప్రదర్శనలు ఇచ్చారు.

చదువు తర్వాత అప్పట్లో సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాలకు యాంకరింగ్ చేశారు. 16 ఏళ్ల వయసులోనే వ్యాఖ్యాతగా ఎంట్రీ ఇచ్చి శెభాష్ అనిపించుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో పలు తెలుగు ఛానెల్స్‌లలో సీరియల్స్‌లో నటించారు. స్వయంవరం, అన్వేషిత, గీతాంజలి, రావోయి చందమామ వీటిలో కొన్ని. అలా కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో ఆమెకు అవకాశం దక్కింది. పవిత్ర ప్రేమలో మూవీలో ఏకంగా నటసింహం నందమూరి బాలకృష్ణ చెల్లెలిగా కనిపించారు సుమ. అయితే తక్కువ సమయంలో తన పర్సనాలిటికీ సినిమాలు సెట్ కావని అర్ధం చేసుకున్న సుమ బుల్లితెరపైనే తన ప్రస్థానాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.
నాటి నుంచి బుల్లితెరపై షోలు, సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలను చేస్తూ స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. జీటీవీ, ఈటీవీ, మాటీవీ, జెమినీ టీవీలలో సుమ యాంకరింగ్ చేసిన ఎన్నో కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. ఈటీవీలో ప్రసారమైన స్టార్ మహిళ ఏకంగా వేలాది ఎపిసోడ్‌లు రన్ అయ్యింది. నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్నారు సుమ. ఈ దంపతులకు కుమారుడు రోషన్ కార్తీక్, కుమార్తె మనస్విని కనకాల ఉన్నారు. మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సుమ దంచికొడతారు.
సుమ విసిరే పంచ్‌లు, ప్రాసలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. సక్సెస్‌ఫుల్‌గా ఈవెంట్స్ నిర్వహించడంతో పాటు సమయస్పూర్తితో వ్యవహరించి మోస్ట్ టాలెంటెడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సుమ కనకాల. సినిమాలను దాదాపు వదిలేసిన తర్వాత చాలా ఏళ్లకు సుమ లీడ్ రోల్‌లో నటించిన జయమ్మ పంచాయతీ 2022లో ప్రేక్షకుల ముందుకొచ్చి బాగానే వసూళ్లను సాధించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సుమ.. తన ఈవెంట్లు, షోలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు.
ఈ క్రమంలోనే సుమ అరుదైన ఘనత సాధించారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఫాలో అయ్యే వారి సంఖ్య 30 లక్షలకు ( 3 మిలియన్ల మంది)కి చేరుకుంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమె స్వయంగా పంచుకున్నారు. నాకు మిలియనీర్ మూవ్‌మెంట్ అని .. తనను ఇంతగా అభిమానిస్తున్న వారికి సుమ ధన్యవాదాలు తెలిపారు. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











