15 ఏళ్ల కెరీర్‌కు బ్రేక్... సీరియల్స్ మానేయడానికి కారణం ఇదే!
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్మిత కర్నాని (Ashmita Karnani)పేరు కొత్తది కాదు. దాదాపు ఒకటిన్నర దశాబ్దాల పాటు వరుస సీరియల్స్, సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ నటి... తాజాగా పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని యూట్యూబ్ వైపు అడుగులు వేసింది. ఒకప్పుడు రోజూ షూటింగ్ సెట్స్‌లో బిజీగా కనిపించిన అస్మిత, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో తన జీవిత అనుభవాలను, ఆలోచనలను పంచుకుంటూ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.అయితే, తన 15 ఏళ్ల కెరీర్‌కు బ్రేక్ ఇచ్చింది. సడెన్ గా సీరియల్స్ కి దూరం అయ్యి ప్రస్తుతం సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించడం, బుల్లి తెరకు దూరంగా కావడానికి కారణమేంటీ? ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణాలను ఆమె ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాలా నిజాయితీగా బయటపెట్టింది.
1980 సెప్టెంబర్ 29న రాజస్థాన్‌లో జన్మించిన అస్మిత... డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలిసారి ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది 'పద్మవ్యూహం' సీరియల్. ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో బుల్లితెరపై నిలకడగా కెరీర్‌ను కొనసాగించింది. ముఖ్యంగా 'అగ్నిసాక్షి' సీరియల్‌లో భైరవి పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. సీరియల్స్‌తో పాటు 'మురారి', 'అపుడప్పుడు', 'మధుమాసం', 'అతిథి', 'కలెక్టర్ గారి భార్య' వంటి సినిమాల్లోనూ నటించి వెండితెరపై కూడా తన ముద్ర వేసింది. కెరీర్ పీక్‌లో ఉన్న రోజుల్లో రోజుకు గంటల కొద్దీ షూటింగ్, ఎండాకాలం-వర్షాకాలం అన్న తేడా లేకుండా సెట్స్‌లో గడిపిన రోజులు ఆమె జీవితంలో భాగమే.

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అస్మిత తన కెరీర్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. 'మొదట్లో ప్రతి రోజు ఒక కొత్త లెసన్‌లా ఉండేది. కెమెరా ముందు నిలబడితే అది నా భావోద్వేగ వ్యక్తీకరణ అనిపించేది. కానీ కాలక్రమేణా సీరియల్ ఇండస్ట్రీ పూర్తిగా మెకానికల్ అయిపోయింది' అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. ఒక రోజులో ఎక్కువ ఎపిసోడ్లు పూర్తి చేయాలనే ఒత్తిడి పెరిగిపోయిందని, నటన కంటే అవుట్‌పుట్‌కే ప్రాధాన్యం ఇవ్వడం మొదలైందని ఆమె తెలిపింది. 'కొన్ని సార్లు నేను ఇంకా బెటర్ చేయగలననిపించినా... డైరెక్టర్లు 'ఓకే, ఓకే... నెక్స్ట్' అని ముందుకు వెళ్లిపోయేవాళ్లు. అప్పుడు నాకు నిజంగా బాధ కలిగేది' అని గుర్తు చేసుకుంది.
స్క్రిప్ట్ లేకుండా నటన? అదే పెద్ద స్ట్రెస్!
సీరియల్స్ వదిలేయడానికి మరో ప్రధాన కారణం - సీన్ పేపర్లు సరిగా ఇవ్వకపోవడం. ఒక సన్నివేశంలో తర్వాత ఏమవుతుందో తెలియకుండానే భావోద్వేగాన్ని కొనసాగించాల్సి రావడం తనకు మానసికంగా చాలా ఇబ్బందిగా అనిపించేదని అస్మిత చెప్పింది. 'ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఏడవాలి, నవ్వాలి అంటే అది నిజంగా నటన కాదు... ఒక స్ట్రెస్. అలా చేస్తూ చేస్తూ నేను సాచురేషన్ పాయింట్‌కు వచ్చేశాను' అంటూ తన మనస్థితిని వివరించింది. నాలుగు సంవత్సరాల ముందే సీరియల్స్‌కు గుడ్‌బై చెప్పాలన్న ఆలోచన తనలో మొదలైందని కూడా వెల్లడించింది.
భర్త సుధీర్ సపోర్ట్...
ఈ కీలక దశలో ఆమె భర్త సుధీర్ అస్మితకు అండగా నిలిచారు. మహిళలకు అవగాహన కల్పించడం, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలపై మాట్లాడాలన్న ఆమె ఆసక్తిని గుర్తించిన సుధీర్... యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయమని ప్రోత్సహించారు. టెక్నికల్ సపోర్ట్ మొత్తం తానే చూసుకుంటానని భరోసా ఇచ్చారట. దీంతో అస్మిత తన పేరుతో కాకుండా 'ఆష్ట్రిక్స్' అనే యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించింది. మొదట 'Asmitha's Tips & Tricks' అనే ఆలోచనతో మొదలైన ఈ ఛానెల్... తర్వాత 'Astrix'గా మారింది. ఇందులో కేవలం బ్యూటీ టిప్స్ మాత్రమే కాదు... సాధారణ జీవితం, మహిళల మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం వంటి అంశాలపై వీడియోలు చేస్తోంది.
సీరియల్ సెట్స్‌లో పనిచేసే రోజుల్లోనే చాలామంది మహిళలకు తాను సలహాలు ఇచ్చేదాన్నని అస్మిత చెబుతోంది. 'వాళ్ల సమస్యలు వింటూ, వాళ్లను ఎంకరేజ్ చేయడం నాకు ఇష్టం. ఇప్పుడు అదే పని పెద్ద స్థాయిలో చేయాలనిపించింది' అంటోంది. యూట్యూబ్ ద్వారా తన అనుభవాలను పంచుకుంటూ... 'అందం మాత్రమే కాదు, జీవితం ఎలా ఉండాలి అనే విషయాలపై మాట్లాడాలి' అన్నదే తన లక్ష్యమని స్పష్టం చేసింది.
పెళ్లి తర్వాత తెరపై కనిపించడం తగ్గించిన అస్మిత.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్. ట్రావెల్ వీడియోలు, డైలీ లైఫ్ వ్లాగ్స్, మోటివేషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులకు దగ్గరవుతోంది. ఒకప్పుడు రోజుకు 10-12 గంటలు షూటింగ్ చేసిన నటి... ఇప్పుడు తన టైమ్‌ను తానే డిజైన్ చేసుకుంటూ జీవిస్తోంది. 'ఇప్పుడు నేను చేస్తున్నది నాకు సంతృప్తినిస్తోంది. ఇది నా జీవితంలో కొత్త ఛాప్టర్' అంటూ అస్మిత భావోద్వేగంగా చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











