పురిటి నొప్పులతో నా భార్య హాస్పిటల్‌లో.. నేను ఫుల్లుగా తాగి వైన్ షాపులో.. బాబా భాస్కర్
బిగ్‌బాస్ రియాలిటీ షోలో 12వ రోజు చాలా భావోద్వేగాల మధ్య సాగింది. సెలబ్రిటీలు తాము తీసుకొన్న నిర్ణయాల వల్ల కోల్పోయిన వ్యక్తులను తలచుకొని కుమిలిపోయారు. జీవితంలో మళ్లీ రాబట్టుకొలేని విషయాలను చెప్పి విషాదంలో మునిగిపోయారు. శ్రీముఖి, శివజ్యోతి, పునర్నవి, మహేష్ విట్ట తదితరులు చెప్పిన తమ ఫ్లాష్ బ్యాక్ విషయాలు ప్రేక్షకులను సైతం ఎమోషనల్‌గా మార్చే విధంగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..
కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ అందరికి తల్లిదండ్రులపై గౌరవం పెరిగేలా స్పూర్తిని పెంచేలా మాట్లాడారు. తండ్రి మాటను పట్టించుకొనే వాడిని కాదు. అయినా నా తండ్రి నా కోసం కష్టపడ్డాడు. చదువు చెప్పించాలని ప్రయత్నాలు చేశాడు. అయినా నేను చదువుకోలేకపోయాను. ఆ తర్వాత నాకు పెళ్లి చేశారు. నేను భార్యను కూడా పట్టించుకోకుండా మద్యానికి అలవాటు పడ్డాను.

ఓ దశలో నా భార్య పురిటి నొప్పులతో హాస్పిటల్‌లో ఉంటే.. నేను మాత్రం మద్యం తాగుతూ వైన్ షాపులో ఉన్నాను. ఆ తర్వాత తాగిన మత్తులోనే పుట్టిన కొడుకును ఎత్తుకొని ముద్దాడాను. అలాంటి దారుణమైన పరిస్థితి నుంచి క్రమంగా మారాను. నా కొడుకు, బిడ్డను, భార్యను బాగా చూసుకోవాలని నిర్ణయం తీసుకొన్నాను. ఉదయాన్ని లేచి పిల్లల కోసం వంట చేసేవాడిని. భార్యను కష్టపెట్ట వద్దని నేను పనులు చేసే వాడిని. అలా మారిన సమయంలో నా తండ్రి హఠాత్తుగా మరణించాడు.
నా తండ్రి బతికి ఉన్నప్పుడు ఆయన విలువ తెలుసుకోలేకపోయాను. అతడు దూరమైన తర్వాత ఆయన విలువ తెలుసుకొన్నాను. మనం ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు. కానీ బతికి ఉన్నప్పుడే అందరిని బాగా చూసుకోవాలి అని బాబా భాస్కర్ అన్నారు. నా తండ్రికి ఈ విషయంలో క్షమాపణలు చెప్పుకోవాల్సిందే అని అన్నారు.


Click it and Unblock the Notifications











