BB Jodi లో మానస్, ప్రియాంక బిగ్‌ఫైట్.. ముఖం చాటేసుకొన్న బిగ్‌బాస్ కంటెస్టెంట్
Priyanka Singh: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రియాంక సింగ్ (పింకీ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ తెలుగు 5 ద్వారా ఎనలేని క్రేజ్ సంపాదించిన పింకీ, తన స్పష్టమైన అభిప్రాయాలు, ధైర్యమైన మాటలతో అప్పట్లో హౌస్‌లో ప్రత్యేకంగా నిలిచింది. అదే సీజన్‌లో పింకీ - మానస్ నాగులపల్లి మధ్య నడిచిన లవ్ ట్రాక్ అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే.. ఈ విషయంలో మానస్ మొదటి నుంచి క్లియర్ గానే ఉన్నారు. తనకు పింకీ మీద ఆ ఫీలింగ్ లేదని, ప్రేమ లేదని మానస్ పలుమార్లు స్పష్టంగా చెప్పాడు, కానీ, పింకీ తన భావాలను ఓపెన్‌గా వ్యక్తపరచడం వల్ల ఈ వ్యవహారం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ లవ్ ట్రాక్ ఆమె గేమ్‌పై కొంత నెగటివ్ ఇంపాక్ట్ చూపించిందన్న విమర్శలు కూడా అప్పట్లో వినిపించాయి. అయితే.. తాజాగా ఓ డ్యాన్స్ షోలో పింకీ -మానస్ మధ్య జరిగిన డైలాగ్ వార్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది?

బిగ్‌బాస్ సీజన్-9 ముగిసిన తర్వాత అదే టైమ్‌స్లాట్‌లో బీబీ జోడీ 2 ప్రారంభమైంది. శేఖర్ మాస్టర్, శ్రీదేవి విజయ్‌కుమార్, సదా జడ్జీలుగా వ్యవహరిస్తున్న ఈ షోలో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు జోడీలుగా పాల్గొంటున్నారు. రోజురోజుకీ ఈ షోకు ఆదరణ పెరుగుతుండగా, తాజా ఎపిసోడ్‌లో చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం నెట్టింట పెద్ద చర్చకు దారి తీశాయి.
ఈ వారం 'జడ్జెస్ ఛాయిస్' రౌండ్‌లో భాగంగా అన్ని జోడీలు తమ సత్తా చూపించేందుకు రంగంలోకి దిగాయి. ఈ రౌండ్‌లో మానస్ తన జోడీ శ్రేష్టి వర్మతో కలిసి అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. జడ్జీలు సహా ప్రేక్షకులు కూడా ఈ పర్ఫామెన్స్‌ను మెచ్చుకున్నా, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన పింకీ మాత్రం భిన్నంగా స్పందించింది. డాన్స్‌లో కొన్ని లోసులు ఉన్నాయని, ముఖ్యంగా మానస్ తన జోడీతో సరైన సింక్‌లో లేడని చెబుతూ స్టేజ్‌పైనే నిలదీసింది.
ఈ సమయంలో మానస్ తన పర్ఫామెన్స్‌పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే పింకీ మాత్రం అతను చెప్పిన సమాధానాలతో సంతృప్తి చెందలేకపోయింది. దీనితో వాతావరణం ఒక్కసారిగా టెన్షన్‌గా మారింది. పింకీ ప్రశ్నలకు ఎదురుగా, మానస్ కూడా పింకీ- మణికంఠ జోడీ డాన్స్‌లో ఉన్న లోపాలను ప్రస్తావిస్తూ మాటల యుద్ధానికి దిగాడు. ఒకరి పర్ఫామెన్స్‌పై మరొకరు వ్యాఖ్యలు చేయడంతో షోలో హీట్ మరింత పెరిగింది.
ఈ పరిస్థితిని కూల్ చేయడానికి మణికంఠ ప్రయత్నించినా, ఆ ప్రయత్నం ఫలించలేదని తెలుస్తోంది. చివరకు పింకీ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక మానస్ ముఖం చాటేసినట్టుగా కనిపించడంతో ఈ సీన్ మరింత వైరల్ అయింది. ఈ మొత్తం ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.
ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ లో పింకీ -మానస్ లవ్ ట్రాక్‌కు సంబంధించిన అంశాలు ఇప్పటికీ చర్చనీయాంశంగా మారాయి. బుల్లితెరపై మరోసారి వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరగడం, ప్రేక్షకుల ఆసక్తిని మళ్లీ పీక్స్‌కు తీసుకెళ్లిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications











