బిగ్ బాస్ జోడిలో షాకింగ్ సంఘటన.. స్టేజ్‌పైనే కుప్పకూలిన యంగ్ హీరో!
BB Jodi Season 2: తెలుగు టెలివిజన్ రంగంలో రియాలిటీ షోలు ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ముగిసిన తర్వాత అదే స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు స్టార్ మా ఛానల్‌లో బీబీ జోడీ సీజన్ 2ను ప్రసారం చేస్తున్నారు. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు, బుల్లితెర సెలబ్రిటీలను జోడీలుగా పెట్టి రూపొందించిన ఈ డ్యాన్స్ షోకు మంచి స్పందన వస్తోంది. అయితే తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో చోటు చేసుకున్న ఒక సంఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది.
ఈ షోకు శేఖర్ మాస్టర్, సదా, శ్రీదేవి విజయ్‌కుమార్ జడ్జీలుగా వ్యవహరిస్తుండగా, యాంకర్‌గా ప్రదీప్ మాచిరాజు ప్రేక్షకులను అలరిస్తున్నారు. అమర్‌దీప్, మానస్ నాగులపల్లి, మణికంఠ, ధన్‌రాజ్, విశ్వ, డీమన్ పవన్, ఆర్జే చైతూ, నైనిక, శ్రష్టి వర్మ, ప్రియాంక సింగ్, నేహా, రీతూ చౌదరి, కీర్తి భట్, వంటి పలువురు స్టార్లు ఈ సీజన్‌లో పోటీ పడుతున్నారు. తాజా బీబీ జోడీ 2 సీజన్‌లో రీతూ చౌదరి- డిమోన్ పవన్‌లు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. వీరిద్దరూ రొమాంటిక్‌గా చేసిన డ్యాన్స్ షో వైరల్ అవుతోంది.

Photo Courtesy: starmaa
లేటెస్ట్ ప్రోమోలో ఈ వారం థీమ్‌గా "డాన్స్ ఆఫ్ ఇండియా"ని పరిచయం చేశారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా డ్యాన్స్ పర్ఫామెన్సులు రూపొందించారు. ఈ కాన్సెప్ట్‌లో భాగంగా యంగ్ హీరో అమర్‌దీప్ - నైనిక జంట పశ్చిమ బెంగాల్‌కు చెందిన 'పురులియా చౌ' అనే జానపద నృత్యాన్ని ప్రదర్శించింది. రామాయణ ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ పెర్ఫామెన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
ముఖ్యంగా అమర్‌దీప్ భుజానికి గాయం ఉన్నప్పటికీ, హెవీ మాస్క్ ధరించి, రాముడు వేషంలో డ్యాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నైనిక కూడా తన ఎనర్జిటిక్ స్టెప్పులతో ఆకట్టుకుంది. ఈ ప్రదర్శన చూసిన జడ్జీలు మాత్రమే కాకుండా ఇతర కంటెస్టెంట్లు కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. జడ్జిగా ఉన్న సదా ఏకంగా స్టేజ్‌పైకి వచ్చి ఈ జంటను హగ్ చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి పర్ఫామెన్స్‌కు జడ్జిగా ఉండటం తన అదృష్టమని ఆమె పేర్కొన్నారు.
అయితే అంతా బాగానే అనిపించిన సమయంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. డ్యాన్స్ ముగిసిన వెంటనే రాముడు వేషంలో ఉన్న అమర్‌దీప్ ఒక్కసారిగా స్పృహ తప్పి స్టేజ్‌పైనే కుప్పకూలిపోయాడు. ఇది చూసిన ప్రేక్షకులు, జడ్జీలు, కంటెస్టెంట్లు అందరూ ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన టీమ్ మెంబర్స్ అమర్‌దీప్ ధరించిన హెవీ మాస్క్‌ను తొలగించి ఫస్ట్ ఎయిడ్ అందించారు. కొద్ది సేపటికి ఆయన స్పృహలోకి వచ్చినట్లు సమాచారం.
ఈ సందర్భంగా నైనిక మాట్లాడుతూ.. 'అమర్‌దీప్ చాలా పెయిన్‌లో ఉన్నా కూడా నా కోసం వచ్చి ఇంత గొప్ప పర్ఫామెన్స్ ఇచ్చారు. చివర్లో ఇలా జరగడం బాధగా ఉంది. ఆయన హార్డ్ వర్క్‌కు నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను' అంటూ భావోద్వేగంగా మాట్లాడింది. ఈ సంఘటనతో బీబీ జోడీ సీజన్ 2 ఎపిసోడ్ ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠను రేపుతోంది.


Click it and Unblock the Notifications











