BB Jodi Winner ఆర్జే సూర్యా-ఫైమా.. ఆ జోడీకి అన్యాయం? రన్నరప్ కూడా ఇవ్వలేదా అంటూ!
బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. అలా తెలుగులో వచ్చిన ఈ షో అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. ఇక వరుస పెట్టి సీజన్లతో ఈ షోను నడిపిస్తున్నారు. అయితే గతేడాది మాత్రం బీబీ జోడీ అనే రియాలిటీ డ్యాన్స్ షోను ప్రారంభించారు మేకర్స్.
ఇందులో గత బిగ్ బాస్ సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్లను జంటలుగా చేసి ఈ పోగ్రామ్ నడిపించారు. అయితే ఈ షో కూడా చివరి అంకాన్ని పూర్తి చేసుకుంది. తాజాగా బీబీ జోడీ టైటిల్ విన్నర్ ను ప్రకటించింది స్టార్ మా. ఆ వివరాల్లోకి వెళితే..

వివిధ రంగాలకు చెందిన..
బిగ్ బాస్ రియాలిటీ షో ఎన్నో అంచనాల మధ్య 2017లో మొదటగా ప్రారంభమైంది. తర్వాత వరుస పెట్టి ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. అయితే సెలబ్రిటీలకు అడ్డాగా ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో తొలుత పాపులర్ నటీనటులు కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు. తర్వాతి కాలంలో సీరియల్ నటినటులు, సోషల్ మీడియా స్టార్స్, రివ్యూవర్స్, యాంకర్స్, జర్నలిస్ట్స్ ఇలా వివిధ రంగాల్లో రాణించే వారిని ఇంటి సభ్యులుగా తీసుకొచ్చారు.

న్యాయ నిర్ణేతలుగా వారు..
బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్లందరూ ఉదయం పూట డ్యాన్స్ చేస్తూ అలరించేవారు. ఈ కంటెస్టెంట్ల లోపల మంచి డ్యాన్సర్స్ దాగి ఉండటంతో వారందరిచేత గతేడాది బీబీ జోడీ అనే డ్యాన్స్ షో ద్వారా స్టెప్పులేయించారు. ఈ షోకి న్యాయ నిర్ణేతలుగా అలనాటి స్టార్ హీరోయిన్ రాధతోపాటు గ్లామరస్ హీరోయిన్ సదా, ప్రముఖ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ వ్యవహరించారు. ఇక బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ రన్నరప్, బుల్లితెర రాములమ్మగా పేరొందిన బొద్దుగుమ్మ శ్రీముఖి హోస్ట్ గా చేసింది.

జడ్జస్ ఔరా అనిపించేలా..
బీబీ జోడీ అనే డ్యాన్స్ రియాలిటీ షోలో మొత్తం 9 జంటలు పాల్గొన్నాయి. వారిలో కమెడియన్ అవినాష్-యాంకర్ అరియానా గ్లోరి, అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్, అఖిల్ సార్థక్-తేజస్వి మదివాడ, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, ఆర్జే చైతూ-ఆర్జే కాజల్, మెహబూబ్-శ్రీ సత్య, కౌశల్-అభినయ శ్రీ, రోల్ రైడా-ఇనయా సుల్తానా ఉన్నారు.
ఈ 9 జోడీలు ప్రతివారం అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చాయి. అంతేకాకుండా ఘాటు రొమాంటిక్ సాంగ్స్ తో అంతకుమించిన రొమాన్స్ పండించి ఇటు ప్రేక్షకులు, అటు న్యాయ నిర్ణేతలను సైతం ఔరా అనిపించారు.

ట్రోఫీతోపాటు ప్రైజ్ మనీ..
బిగ్ బాస్ షోకి గ్రాండ్ ఫినాలే జరిగినట్లే బీబీ జోడీ డ్యాన్స్ షోకి గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. అయితే ఈ ఫినాలేకు మొత్తంగా 5 జోడీలు మాత్రమే వెళ్లాయి. వారిలో మెహబూబ్-శ్రీసత్య, అవినాష్-అరియానా గ్లోరీ, ఆర్జే సూర్య-ఫైమా, ఆర్జే కాజల్-ఆర్జే చైతూ, అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్ ఉన్నారు. ఈ గ్రాండ్ ఫినాలేలో గెలిచిన జోడీకి టైటిల్ విన్నర్ ట్రోఫీతో పాటు రూ. 25 లక్షల ప్రైజ్ మనీ అందించారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ మార్చి 25, 26న జరిగింది.

టైటిల్ విన్నర్ గా..
ఇక బీబీ జోడీ టైటిల్ విన్నర్ గా ఆర్జే సూర్య-ఫైమా నిలిచారు. ఈ విషయాన్ని స్టార్ మా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ ఫినాలేలో ఆర్జే సూర్య, ఫైమా తమ డ్యాన్సుతో ఉర్రూతలూగించారు. వారి ఫైరింగ్ పర్ఫామెన్స్ తో చప్పట్లు మోగేలా చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సైతం స్టేజీపైకి వెళ్లి వారిని అభినందించారు. ఇలా ఫైనల్ గా ఆర్జే సూర్య-ఫైమా జోడీ టైటిల్ ను గెలుచుకుంది. అలాగే రన్నరప్ గా అవినాష్-అరియానా జోడీ నిలిచింది.
అన్యాయం అంటూ..
అయితే ఈ షోలో ఎక్కువగా వాసంతి, అర్జున్ కల్యాణ్ జోడీ ఎక్కువగా అట్రాక్ట్ చేసిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రతివారం తమ డ్యాన్స్ తో వాళ్లు అదరగొట్టారని, అరియానా-అవినాష్ కంటే బాగా పర్ఫామెన్స్ ఇచ్చారని పలువురు అంటున్నారు. గ్రాండ్ ఫినాలేలో కూడా అవినాష్-అరియానా కంటే వాసంతి-అర్జున్ జోడీ బాగా చేసిందని.. కనీసం వారిని రన్నరప్ గా ప్రకటిస్తే బాగుండేదని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అలా రన్నరప్ గా ఉండాల్సిన అర్జున్-వాసంతి పెయిర్ కు సెకండ్ రన్నరప్ ఇవ్వడం అన్యాయమని విమర్శలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











