Bhanumathi April 10th Episode: బలరామ్‌ను వదలని ఎస్ఐ, తల్లడిల్లుతోన్న పార్ధు.. నీట్ ఎగ్జామ్ రాసిన భానుమతి
బలరామ్‌ని పోలీస్ స్టేషన్‌లో ఉంచి వార్నింగ్ ఇస్తాడు ఎస్ఐ. నువ్వు ఈ బలరామ్ బలాన్ని, బలగాన్ని తక్కువ అంచనా వేశావ్.. నేనంటే ఏంటో చూస్తావని అంటాడు బలరామ్. తండ్రి కోసం పార్ధు.. సూరి, దుర్గలతో కలిసి పోలీస్ స్టేషన్ దగ్గరికి రాగా వారిని కానిస్టేబుల్స్ అడ్డుకుంటారు. ఇలా చేస్తే అన్నయ్య ఇంకా సమస్యల్లో ఇరుక్కుంటాడని లాయర్‌ని పిలుద్దామని పార్ధుతో అంటాడు దుర్గ. పెళ్లి ఆగిపోవడానికి ఏడుస్తూ భార్యాబిడ్డలతో కలిసి ఇంటికొస్తాడు కోటి. ఇంతలో ఇరుగుపొరుగు వాళ్లు వచ్చి సూటిపోటి మాటలతో వాళ్లని బాధపెడతారు.
కొడుకుని పోలీసులు అరెస్ట్ చేసేసరికి బలరామ్ తల్లి అల్లాడిపోతుంది. అన్నయ్యపై మచ్చ పడిందని, ఇదంతా ఆ భానుమతి వల్లే జరిగిందని శాంభవి మండిపడుతుంది. ఇంతలో శక్తిని ఆమె కొడుకు పక్కకి పిలిచి పెళ్లి జరిగిన గొడవని వీడియో తీసినట్లు చూపిస్తాడు. ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేసి బలరామ్ పరువు తీయాలని కొడుక్కి చెబుతుంది శక్తి. బలరామ్ కోసం పోలీస్ స్టేషన్‌కు బయల్దేరతాడు కోటి. కుమారికి మస్కా కొట్టించి భానుమతిని పరీక్ష రాయడానికి పంపుతుంది వసు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 10వ తేదీ ఎపిసోడ్ 28లో ఏం జరిగిందంటే?

బస్సెక్కిన భానుమతి.. నేను ఇంత కష్టపడింది, ఇంత సాహసం చేసింది ఎగ్జామ్ రాయడానికేనని మనసులో అనుకుంటుంది. టైంకి ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్లకపోతే నేను పడిన కష్టమంతా వృథా అయిపోతుందని అనుకుంటుంది. నేను ఎగ్జామ్ రాసి డాక్టర్ కావాలని దేవుడిని కోరుకుంటుంది భానుమతి. బలరామ్ కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన కోటికి పార్ధు అతని మనుషులు టెన్షన్ పడుతూ కనిపిస్తారు. దొంగ ఏడుపులు రావాలంటే ఎలా అని ఆలోచిస్తున్న కోటికి పైన సూర్యుడు కనిపిస్తాడు. ఆయనని అలాగే చూస్తుండగా కళ్లు మంటలెక్కిపోతాయి. అయ్యగారు త్వరగా బయటికి రావాలని విబూది తీసుకొచ్చానని పార్ధుతో చెబుతాడు కోటి. ఇంతలో లాయర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తాడు.
లాయర్ నేరుగా లోపలికి వెళ్లి ఎస్ఐతో మాట్లాడతాడు. ఆ అమ్మాయి మైనర్ అని తెలియక ఈ పెళ్లికి ఏర్పాట్లు చేశారని , ఇలాంటి వాటిని చూసీ చూడనట్లు వదిలేయ్యాలని అంటాడు లాయర్. ఆ వెంటనే బలరామ్ బెయిల్ పేపర్లను ఎస్ఐకి ఇస్తాడు లాయర్. అయితే ఈ వీడియో చూడాలంటూ లాయర్‌కు తన ఫోన్ ఇస్తాడు ఎస్ఐ. అందులో ఎస్ఐని బలరామ్ కొట్టినట్లు ఉండటంతో లాయర్ షాక్ అవుతాడు. మీరు తీసుకొచ్చిన బెయిల్‌కి, నేను ఫైల్ చేసిన కేసుకి సంబంధమే లేదని.. ఈ బెయిల్ చెల్లదని అంటాడు ఎస్ఐ. ఆ మాటలు విన్న బలరామ్ షాక్ అవుతాడు.
ఓ పోలీస్ మీద ఈ పెద్దమనిషి చేయి చేసుకున్నాడని, ఆ పోలీస్ వాడు అదుపు తప్పితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఇక్కడ కొంతమందికి తెలియాలని లాయర్‌తో ఎస్ఐ అంటాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో రేసుగుర్రంలా పరిగెడుతోందని , అంటే నా అవమానించిన స్థాయి పెరిగిందని చెబుతాడు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను, ఎట్టి పరిస్ధితుల్లోనూ బెయిల్ రాదని కుండబద్ధలు కొడతాడు ఎస్ఐ. చేసేదేం లేక లాయర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
పరీక్షా కేంద్రానికి పరుగు పరుగున వస్తుంది భానుమతి. పెళ్లికూతురు డ్రెస్‌లో ఉన్న ఆమెను చూసి తోటి విద్యార్ధులంతా షాక్ అవుతారు. బలరామ్ కుటుంబ సభ్యులు ఇంట్లో బాధపడుతుండగా శక్తి కొడుకు వచ్చి.. అంతా అయిపోయింది పెదనాన్న పరువు మొత్తం గంగలో కలిసిపోయిందని అంటాడు. ఇంతలో ధర్మ వచ్చి ఏం మాట్లాడుతున్నావ్ అంటూ మండిపడతాడు. నిన్నటి వరకు పెళ్లికొచ్చిన బంధువుల వరకే పెదనాన్న పరువు పోయిందని అనుకున్నానని.. కానీ ఇప్పుడు ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కడి కాళ్ల దగ్గరికి పెదనాన్న పరువు దిగజారిపోయిందని చెబుతాడు.
ఏం జరిగిందని బలరామ్ పెద్ద కోడలు అడగటంతో .. పెళ్లిలో జరిగిన గొడవని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారని అంటాడు చరణ్. ఆ మాటలతో బలరామ్ కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోందని.. కావాలంటే ఆ వీడియో చూడమని అందరికీ చూపిస్తాడు . నా కొడుకు పరువుని ఇలా బజారుకి ఇడుస్తున్నారని బాధపడుతుంది బలరామ్ తల్లి. మంచి అన్న పదానికి అర్ధంలా బలరామ్ బతికాడని .. కానీ వాడిని ఒక చీడపురుగు అనుకునేలా జనం అనుకునేలా చేశారని అంటాడు విశ్వనాథం. ఈ పరిణామం ఇంకా ఎక్కడి దాకా వెళ్తుందో, ఇంకా ఎలాంటి పరిస్ధితులకు దారి తీస్తుందోనని బాధపడతాడు .
ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం లేదని, అడుగు వేసే ముందే అక్కడ రాయి ఉందో.. రత్నం ఉందో తెలుసుకోవాలని అంటుంది శాంభవి. ఏమీ తెలుసుకోకుండా అడుగులు వేస్తే అవి తప్పటడుగులు అయ్యే ప్రమాదం ఉందని అంటుంది. అంతా తాను అనుకున్నట్లే జరగడంతో శక్తి సంతోషిస్తుంది. ఎగ్జామ్ చాలా బాగా రాయడంతో భానుమతి సంతోషంగా బయటికి వస్తుంది. మరోవైపు పార్ధుకి ధర్మ ఫోన్ చేసి నాన్నని వదిలేశారా? లేదా? అని అడుగుతాడు. పెళ్లిలో జరిగినదంతా ఎవరో వీడియో తీశారని , అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని చెప్పడంతో పార్ధు షాక్ అవుతాడు.
ఇంతలో లాయర్ బయటికొచ్చి.. పెళ్లిలో జరిగిన గొడవని, మీ నాన్నగారు ఎస్ఐని కొట్టడాన్ని ఎవరో వీడియో తీశారని పార్ధుకి చెబుతాడు లాయర్. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని అంటాడు. మీ నాన్న ఎస్ఐని కొట్టడంతో ఆ ఆఫీసర్ కేసు బలంగా పెట్టాడని, బెయిల్ రావడం చాలా కష్టమని చెప్పడంతో పార్ధు బాధపడతాడు. నేను నాన్నతో మాట్లాడొచ్చా అని లాయర్‌ని అడుగుతాడు పార్ధు. లోపలో బలరామ్‌తో మాట్లాడుతూ కంటతడి పెడతాడు.
నా పరువు ప్రతిష్టలని అవమానం అనే కార్చిచ్చు దహించి వేస్తోందని బాధపడతాడు బలరామ్. నాకు ఇంతటి అవమానం జరగడానికి కారణమై, నా పరువు ప్రతిష్టల్ని ఇంత దారుణంగా దహించి వేస్తున్న ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియాలని కొడుకుతో చెబుతాడు . నా కుటుంబ గౌరవాన్ని ఇంత అథ: పాతాళానికి తొక్కిన ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియాలని అంటాడు. నా తండ్రి గౌరవ మర్యాదల్ని దెబ్బకొట్టిన ఆ అమ్మాయి ఎవరో ఖచ్చితంగా తెలుసుకుంటానని చెబుతాడు పార్ధు. మీ నాన్న ఎంత అవమానం భరించారో ఆ అమ్మాయి కూడా అంతకు అంత అనుభవించాలని అంటాడు కోటి.
మీ మనవరాలి పెళ్లి ఆగిపోయిందని మీకు కొంచెం కూడా బాధలేదా? అని కుమారిపై మండిపడుతుంది ప్రమీల. ఇంతలో భానుమతిని ప్రమీల పిలవడంతో వసు కంగారుపడుతుంది. అక్క లేదని తేలిస్తే భానుమతి ఎగ్జామ్ రాసిందని తేలిపోతుందని భయపడుతుంది. భానుమతి ఏమైనా చేసుకుంటుందోనని ప్రమీల టెన్షన్ పడుతుంది. ఇంతలో భానుమతి రావడంతో వసు ఊపిరి పీల్చుకుంటుంది. దాంతో భానుమతి తలుపు తీసి నేను పిరికి దానిని కాదని అంటుంది . ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











