Bhanumathi April 18th Episode : పార్ధు - భానుమతిల పెళ్లికి బలరామ్ గ్రీన్ సిగ్నల్.. ఫలించిన కోటి స్కెచ్
లాయర్ బెయిల్ పేపర్స్ తీసుకురావడంతో పార్ధు చాలా సంతోషిస్తాడు. వెంటనే స్టేషన్‌లోకి వెళ్లి ఎస్ఐకి బెయిల్ పేపర్స్ ఇచ్చి బలరామ్‌ని విడిపించుకుని ఇంటికి తీసుకెళ్తాడు పార్ధు. నా పగ ఇంకా చల్లారలేదని, ఇంకా చాలా నడుస్తుందని ఎస్ఐ వార్నింగ్ ఇస్తాడు. మా నాన్నగారి మంచితనం గురించి తెలిసిన తర్వాత ఏదో ఒక రోజున మీరే చల్లబడతారని అంటాడు పార్ధు. ఇంటికి వచ్చిన బలరామ్‌ను చూసి అతని కుటుంబం సంతోషిస్తుంది.
కానీ బలరామ్ మాత్రం పగతో రగిలిపోతుంటాడు. నాకు జరిగిన అవమానానికి కారణమైన ఆ అమ్మాయిని వెతికి పెట్టుకోమని పార్ధుకి చెబుతాడు బలరామ్. అన్నయ్య కోపాన్ని చూసిన శాంభవి వణికిపోతుంది. భువనని పక్కకి తీసుకెళ్లి నువ్వు చేసిన తప్పు వల్ల మన జీవితాలు తలక్రిందులయ్యే పరిస్ధితి వచ్చిందని అంటుంది. బలరామ్ కాళ్ల మీద పడైనా సరే ఆగిపోయిన పెళ్లిని తిరిగి జరిపిస్తానని కోటి ప్లాన్ చేయడంతో భానుమతి షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 18వ తేదీ ఎపిసోడ్‌లో 35లో ఏం జరిగిందంటే?

బలరామ్ పిల్లలతో మాట్లాడుతూ ఉండగా మీరెప్పుడూ నవ్వుతూ ఉండాలని అంటాడు పార్ధు. నువ్వెప్పుడూ నలుగురికి ఆదర్శంగా కనిపించాలి కానీ, ఏదో కోల్పోయినట్లు కాదని చెబుతుంది తల్లి. పోయిన గౌరవం మళ్లీ తిరిగొస్తుందని అంటుంది. ఇంతలో కోటి దొంగ ఏడుపు ఏడుస్తూ బలరామ్ దగ్గరికి వస్తాడు. కోటిని చూడగానే మళ్లీ ఎందుకొచ్చావ్ రా.. ఈ పెళ్లి చేయాలన్న ఆశ, నీ కూతురిని ఈ ఇంటికి పంపించాలన్న ఆలోచన వదులుకోమని చెప్పాను కదా అని మండిపడుతుంది బలరామ్ తల్లి. ఎవరి మీదో ఉన్న కోపాన్ని ఇంకెవరి మీదో చూపిస్తే ఎలా? అని అంటాడు పార్ధు.
బురదకి బట్టలికి ఏ సంబంధం ఉండదని, కానీ బురదలో రాయేస్తే మన బట్టలే పాడవుతాయని అంటుంది బలరామ్ తల్లి. జాతకం బాలేని దానిని తీసుకొచ్చి మన జీవితాలకి అంటగట్టాలని అనుకుంటున్నారని మండిపడుతుంది. అందుకే మనకి ఈరోజు ఇలాంటి పరిస్ధితి వచ్చిందని, నా కొడుకు అందరి ముందు తలదించుకునే పరిస్ధితి ఏర్పడిందని అంటుంది. పీటల మీద పెళ్లి ఆగిపోయిందని నా కూతురు ఎంత కుమిలిపోతుందో తెలుసా? అంటూ కోటి నటిస్తాడు. ఈ జన్మలో తనకు పెళ్లి అవుతుందోనని ఎంత ఏడుస్తుందా తెలుసా అని అంటాడు.
నాలాంటి వాడికి కూతురిని పెళ్లి చేయడమే ఒక కష్టమైన పని అని, పీటల వరకు వెళ్లి తిరిగొచ్చిన నా కూతురికి మళ్లీ పెళ్లి చేయడం అంటే అది జరిగే పనేనా అంటాడు కోటి. మీరు కాదు కూడదు అంటే ఇంటిల్లి పాది గంగలో దూకడం తప్ప మరో గత్యంతరం ఉండదని బలరామ్ కాళ్ల మీద పడతాడు. బాధపడొద్దని , ఒక ఆడపిల్లని కన్నీరు పెట్టించేంత దుస్థితికి ఈ కుటుంబం ఇంకా దిగజారలేదని ఒక్కసారి మాటిచ్చాక , ఆ మాట తప్పే మనుషులు మా కుటుంబంలో ఉండరని అంటాడు బలరామ్. నీ కూతురే మా ఇంటి కోడలని తేల్చిచెప్పడంతో శాంభవి, భువనలు షాక్ అవుతారు.
బలరామ్ తల్లి వద్దు అంటున్నా వినిపించుకోకుండా.. కాలం మన మీద పగ పడితే , మనం వేరే వాళ్ల మీద పంతం పట్టడం మంచిది కాదని అంటాడు. భానుమతిని, పార్ధుకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చానని ఆ మాట నిలబెట్టుకుంటానని చెబుతాడు. మీరు గొప్పవారు కాబట్టే మిమ్మల్ని అంతా ఆదర్శంగా తీసుకుంటారని పొగుడుతాడు కోటి. కానీ మీ అమ్మాయి మైనర్‌గా ఉన్నంత కాలం ఈ పెళ్లి చేయలేమని, తనకి 18 నెలలు నిండాక మాత్రమే మా ఇంటి కోడలిగా చేసుకోగలమని చెబుతాడు బలరామ్.
ఇంకొద్ది రోజుల్లోనే భానుమతి మైనారిటీ తీరిపోతుందని, ఇంకొన్ని రోజుల్లో దాని పుట్టినరోజు ఉందని అంటాడు కోటి. పార్ధుకి, నీ కూతురికి పెళ్లి చేయడానికి ఇక ఎలాంటి ఆటంకాలు లేవని చెబుతుంది శక్తి. త్వరలోనే మళ్లీ ముహూర్తాలు పెట్టించి నీకు కబురు చేస్తానని అంటాడు విశ్వనాథం. పెళ్లి జరగదనే ఉద్దేశంతో మా అమ్మాయికిచ్చిన బట్టలు, నగలు వెనక్కి తీసేసుకున్నారని కోటి చెప్పడంతో బలరామ్ షాక్ అవుతాడు. ఈ ఇంటి కానుకలుగా పెళ్లి కూతురికి పంపించిన బట్టలు, నగలు వెనక్కి తీసుకున్నారా? అని ప్రశ్నిస్తాడు బలరామ్.
నా సలహా తీసుకోకుండా, నన్ను సంప్రదించకుండా ఇలాంటి పని మీరెందుకు తీసుకున్నారని రగిలిపోతాడు . ఇకపై ఎలాంటి పరిస్ధితులు వచ్చినా , ఏం జరిగినా భానుమతే పార్ధుకి భార్య అంటాడు బలరామ్. ఇక ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉంఅదని చెబుతాడు. ఆ బట్టలు , నగలు కోటికిచ్చి పంపించమని చెబుతాడు. దాంతో అవన్నీ వెంటనే తిరిగి ఇచ్చేస్తానని శక్తి అంటుంది. అవన్నీ తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్తాడు కోటి. ఆ వెంటనే పార్ధుని చూసి నీకు సంతోషమే కదా అని అడుగుతాడు బలరామ్. నాకు ఇంతకన్నా సంతోషమైనది ఏముందని అంటాడు పార్ధు.
బలరామ్ నిర్ణయంతో రగిలిపోయిన భువన.. తల్లిని పక్కకి పిలిచి పెళ్లి చెడిపోయింది, ఇక పార్ధు బావ జీవితంలోకి ఆ భానుమతి రాదు అనుకున్నానని చెబుతుంది. ఈ పెళ్లి చెడిపోయిందని సంబరపడేలోపు పిడుగులాంటి వార్త మన నెత్తిన పడేశారని మండిపడుతుంది శాంభవి. పార్ధు బావతో కలిసి బతికే అదృష్టం ఇక నాకు లేదని బాధపడుతుంది భువన. బలరామ్ ఇంటికి వెళ్లిన కోటి కోసం ప్రమీల, కుమారిలు ఎదురుచూస్తుంటారు. ఇంతలో ఇంటి బయట టపాసులు కాలుస్తున్న శబ్ధం రావడంతో ఇద్దరూ ఉలిక్కిపడతారు.
ఇంతలో డ్యాన్స్ వేసుకుంటూ కోటి లోపలికి వస్తాడు. ఆ టపాసులు కాల్చింది నేనేనని చెప్పిన కోటి.. బలరామ్ కుటుంబం తీసుకున్న డబ్బులు, నగలు, బట్టలు తీసి చూపిస్తాడు. బలరామ్ గారు పెళ్లికి ఒప్పుకున్నారని చెప్పడంతో కుమారి, ప్రమీల సంతోషిస్తారు. మళ్లీ ముహూర్తం పెట్టి త్వరలోనే భానుమతికి, పార్ధుకి పెళ్లి చేస్తామని చెప్పారని అంటాడు. ఆ మాటలతో భాను షాక్ అవుతుంది. ఆ డబ్బు, నగలు, బట్టలను ప్రమీలకి ఇచ్చి మందు తాగడానికి వెళ్లిపోతాడు కోటి. పెళ్లి ఆపడానికి ఎంతో సాహసం చేశానని ఇక ఏం చేసి ఈ పెళ్లి ఆపాలో తెలియడం లేదని బాధపడుతుంది భానుమతి. తండ్రి తన పెళ్లి చేస్తానని మాట ఇవ్వడంతో పార్ధు మురిసిపోతుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











