Bhanumathi April 19th Episode : భానుమతి సంచలన నిర్ణయం .. వసు కంటతడి, పార్ధు పెళ్లికి బలరామ్ సన్నాహాలు
పిల్లలతో నవ్వుతూ మాట్లాడుతున్న బలరామ్‌ని చూసి సంతోషిస్తాడు పార్ధు. మీరెప్పుడూ ఇలాగే ఉండాలని, నలుగురికి ఆదర్శంగా ఉండాలని అంటాడు. ఇంతలో దొంగ ఏడుపులు ఏడుస్తూ కోటి లోపలికి వస్తాడు. మళ్లీ ఎందుకొచ్చావ్? నీకు మాకు సంబంధం లేదని అంటుంది బలరామ్ తల్లి. పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో నా కూతురు కన్నీరు మున్నీరుగా ఏడుస్తోందని చెబుతాడు. నాలాంటి తాగుబోతు వాడికి కూతురి పెళ్లి చేయడం చాలా కష్టమని అంటూ బలరామ్ కాళ్లపై పడతాడు కోటి.
కోటిని ఊరుకోమని చెప్పిన బలరామ్.. ఎవరెన్నీ ఆటంకాలు సృష్టించినా భానుమతి - పార్ధుల పెళ్లి జరిగి తీరుతుందని తేల్చి చెబుతాడు. ఆ మాటలతో భువన, శాంభవిలు షాక్ అవుతారు. తండ్రి నిర్ణయంతో పార్ధు ముఖం వెలిగిపోతుంది. పెళ్లి ఆగిపోయిందని మీరిచ్చిన బట్టలు, నగలు వెనక్కి తీసుకున్నారని కోటి చెప్పడంతో బలరామ్ రగిలిపోతాడు. అవన్నీ వెంటనే ఇచ్చి పంపించాలని చెప్పడంతో శక్తి లోపలికి వెళ్లి బట్టలు, నగలు తీసుకొచ్చి ఇస్తుంది. ఇంటికెళ్లి ప్రమీల, కుమారిలకు వాటిని చూపించి బలరామ్ గారు పెళ్లికి ఒప్పుకున్నారని చెప్పడంతో భాను, వసులు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 19వ తేదీ ఎపిసోడ్‌లో 36లో ఏం జరిగిందంటే?

పార్ధుతో పెళ్లికి బలరామ్ మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భానుమతి- వసులు షాక్ అవుతారు. ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. నీ జీవితంలో నుంచి దురదృష్ట దేవత వెళ్లిపోయింది అనుకుంటే మళ్లీ వస్తుందని అంటుంది వసు. ఇక నువ్వు ఈ పెళ్లి చేసుకోవాల్సిందేనా అని ప్రశ్నిస్తుంది. కాలానికి తలవంచడం, విధి రాతకి బలవ్వడం అంటే ఏమో అనుకున్నానని.. అది ఇప్పుడే అర్ధమవుతుందని చెబుతుంది భానుమతి. అందరి కోసం మన ఇష్టాల్ని చంపేసుకోవాల్సిందేనా అని ప్రశ్నిస్తుంది వసు. ఇష్టాలకు తగ్గట్లుగా నడుచుకోవడం అనేది మనం ఈ ఇంట్లో పుట్టినప్పుడే కోల్పోయామని అంటుంది. నా ఆశయాల్ని బతికించుకోవడం కోసం అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉన్నానని చెబుతుంది.
భానుమతితో మాట్లాడాలని అనిపించి పార్ధు ఫోన్ చేస్తాడు. కోటి ఫోన్ ఎత్తి దీనికి ఫోన్ ఇస్తే ఏం మాట్లాడుతుందోనని భయపడి, పక్కనే ఉండి ఫోన్ మాట్లాడించాలని అనుకుంటాడు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడమని వార్నింగ్ ఇస్తాడు కోటి. మన పెళ్లి ఆగిపోయిందని బాధపడుతున్నావా? అని ప్రశ్నిస్తాడు పార్ధు. నిన్ను పెళ్లి చేసుకుంటానిన మాటిచ్చాను, నీతోనే జీవితాంతం కలిసి బతుకుతానని ఆశ పడుతున్నానని అంటాడు పార్ధు. నీకు ఇచ్చిన మాట తప్పను, నా ఆశను నేను వదులుకోను.. ఖచ్చితంగా మనం పెళ్లి చేసుకోబోతున్నామని చెబుతాడు పార్ధు. నీ బతుకు, భవిష్యత్ ఏమైపోతుందోనని కంగారుపడకు అని అంటాడు. త్వరలోనే ముహూర్తం పెడతారని చెబుతాడు పార్ధు.
పార్ధు ఫోన్ పెట్టేసిన తర్వాత నాకు సహనం, ఓర్పు చాలా తక్కువన్న సంగతి నీక్కూడా తెలుసని.. ఒకసారి నేను సహనం కోల్పోయానే అనుకో మనిషిననే విషయం మరిచిపోతానని అంటాడు. అవసరమైతే ప్రాణం తీయడానికైనా, ప్రాణం తీసుకోవడానికైనా వెనుకాడనని మండిపడతాడు. నువ్వు పెళ్లి ఆపడానికి మళ్లీ ప్రయత్నించినా? మళ్లీ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసినా నాలో నిజమైన మృగాన్ని చూస్తావని వార్నింగ్ ఇస్తాడు కోటి.
తనకు జరిగిన అవమానం గురించి, ఎస్ఐ తనతో అన్న మాటలు గుర్తొచ్చి రగిలిపోతాడు బలరామ్. ఇంతలో శారద వచ్చి ట్యాబ్లెట్స్ ఇస్తుంది . మీరు ఇంట్లో లేని రోజు దినదిన గండంలా బతికానని అంటుంది . కాలం పరీక్షలు పెడుతూ భయపెడుతోందని చెబుతుంది శారద. ఎవరికీ తలవంచని తత్వం మీది.. అందరికీ ఆదర్శంగా నిలబడే గుణం మీది అని అంటుంది. మీకు ఎదురైన పరిస్ధితి మిమ్మల్ని ఎంత కృంగదీస్తుందో నాకు తెలుసని అంటుంది. ప్రశాంతంగా ఉన్న పూల తోట మీద గాలివాన దాడి చేసినట్లుగా నా పరిస్థితి తయారైందని చెబుతాడు బలరామ్ . ఈ పరిస్ధితి నుంచి ఆ అవమానం నుంచి కోలుకోవడానికి కొంచెం సమయం పడుతుందని అంటాడు.
నా మీద ఫిర్యాదు చేసిన ఆ అమ్మాయి ఎవరో తెలిసే వరకు నా మనసు కుదటపడదు, నా కంటికి కునుకు పట్టదని రగిలిపోతాడు బలరామ్. ఆ మాటలు విన్న శాంభవి, భువనలు షాక్ అవుతారు. ఇంతలో పార్ధు రావడంతో ఈ టైం వరకు ఎక్కడికి వెళ్లారని అడుగుతాడు. మీ మీద ఫిర్యాదు చేసిన అమ్మాయి ఫోన్ నెంబర్ కనుక్కోవడానికి వెళ్లానని చెబుతాడు పార్ధు. త్వరలోనే ఆ అమ్మాయి ఎవరో తెలిసిపోతుందని, పదిమందికి మంచి చేయడం తెలిసిన నా తండ్రికి చెడు చేయడానికి ప్రయత్నించిన అమ్మాయిని వదిలిపెట్టనని అంటాడు.
ఈ విషయంలో మరీ ఎక్కువ పంతానికీ, ఆవేశానికీ పోతున్నారని అంటుంది శారద. కొన్ని పట్టింపులు పరువు, ప్రతిష్టల్ని కాపాడతాయని చెబుతాడు బలరామ్. మన పెట్టే బేడా సర్దుకునే టైం వచ్చిందని భువనతో అంటుంది శాంభవీ. అంత భయపడుతున్నావేంటని అడుగుతుంది భువన.. కంప్లయంట్ చేసిన అమ్మాయి ఫోన్ నెంబర్ కనుక్కుంటానని పార్ధు చెబుతున్నాడని భయపడుతుంది. నీకూతురు అంత అమాయకురాలు కాదని.. ఆరోజు ఎస్ఐకి ఫోన్ చేసింది నా నెంబర్‌తో కాదని అంటుంది.
పెళ్లి ఆపడానికి ఏమైనా ప్రయత్నించావా అని భానుమతిని వసు అడుగుతుంది. ఈ పెళ్లిని ఆపే బలం నా దగ్గర లేదని, ధైర్యం అంతకన్నా లేదని అందుకే ఈ పెళ్లి నుంచి నేను దూరంగా వెళ్లిపోతానని చెబుతుంది. ఆ మాటలతో వసు షాక్ అవుతుంది. నేను ఇక్కడే ఉంటే నాకు పెళ్లి చేసి నన్ను అత్తారింటికి పంపుతారని.. అదే నేను ఎవ్వరికీ కనిపించకుండా వెళ్లిపోతే ఏం చేయలేరని అంటుంది భానుమతి. ఎక్కడికి వెళ్లినా తెలిసిపోతుందని, అందుకే మా ప్రిన్సిపాల్ గారింటికి వెళ్తానని చెబుతుంది. గతంలో ప్రిన్సిపల్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. నువ్వు గడప దాటితే ఊళ్లో పెద్ద గొడవ జరుగుతుందని వసు చెబుతుంది.
నిలిచిపోయిన ఆనందం మళ్లీ నట్టింట్లో జరగాలంటే పార్ధు పెళ్లికి మళ్లీ సన్నాహాలు జరగాలని కుటుంబం మొత్తానికి చెబుతాడు బలరామ్. ఆ మాటలతో శాంభవి, భువనలు షాక్ అవుతారు. ఇంకో నాలుగు రోజుల్లో మంచి ముహుర్తం ఉందని అప్పుడే పార్ధు- భానుమతిల పెళ్లి అని అంటాడు బలరామ్. ఈ పెళ్లి మీదే పార్ధు సంతోషం ఆధారపడి ఉందని.. వాడి జీవితం బాగుండాలంటే ఈ పెళ్లి జరిగి తీరాలని చెబుతాడు. నువ్వు కోరుకున్న అమ్మాయితోనే నీ పెళ్లి జరగబోతోందని నీకు సంతోషమేనా అని పార్ధుని శారద అడుగుతుంది. నాకేం కావాలో చూడటానికి నాకు నా తండ్రి ఉన్నాడని , అవకాశం దొరకగానే ఇలా అనవసరం మాట్లాడొద్దని వార్నింగ్ ఇస్తాడు పార్ధు. ఆ మాటలలతో శారద బాధపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











