Bhanumathi April 29th Episode : బలరామ్ ఇంట్లో అడుగుపెట్టిన భానుమతి.. కష్టాలు మొదలు
ఆ రోజు ఎస్ఐకి ఫోన్ చేయించింది భానుమతేనని ధర్మకి కానిస్టేబుల్ చెప్పడాన్ని విన్న కోటి కంగారు పడతాడు. మందులో ఉన్న ఆ కానిస్టేబుల్‌ను అక్కడి నుంచి పంపేస్తాడు. ప్రమీలను పంతులుగారు పిలవడంతో ఇదే అదనుగా పార్ధుని కలవాలని అనుకుంటుంది భానుమతి. వెంటనే పార్ధును వెతుక్కుంటూ వెళ్తుంది. ఇంతలో ఆమెను చూసిన శక్తి.. ఎక్కడికి వెళ్తున్నావ్? పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పారిపోతున్నావా? అని అడుగుతుంది. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని , తనకు చదువుకోవాలని ఉందని చెబుతుంది భానుమతి.
పెళ్లయ్యాక కూడా చదువుకోవడానికి వీలైతే నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? అని అడుగుతుంది శక్తి. కానీ దానికి బలరామ్ గారు ఒప్పుకుంటారా అని అడుగుతుంది భానుమతి. బావగారిని నేను ఒప్పిస్తానని చెప్పి బలరామ్‌తో మాట్లాడినట్లుగా నటిస్తుంది. బలరామ్ పెళ్లికి ఒప్పుకున్నారని చెప్పడంతో పార్ధుతో తాళి కట్టించుకుంటుంది భానుమతి. పార్ధుతో తన పెళ్లి జరగకపోవడంతో భువన కుమిలిపోతుంటుంది. కూతురిని శారద చేతుల్లో పెడుతూ ప్రమీల కంటతడి పెడుతుంది. ఇదంతా గల ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 29వ తేదీ ఎపిసోడ్ 44లో ఏం జరిగిందంటే?

తల్లిదండ్రులు, వసుకి వీడ్కోలు చెప్పి అత్తారింటికి బయల్దేరుతుంది భానుమతి. కూతురు వెళ్లిపోవడంతో ప్రమీల వెక్కివెక్కి ఏడుస్తుంది. కొత్త జంట రాకకోసం ఇంట్లో అంతా ఎదురుచూస్తుంటారు. పార్ధుని తాను కనకపోయినా వాడిని నా సొంత కొడుకుగానే భావించానని, కానీ వాడిలో నా మీద ఏమాత్రం ప్రేమ లేదని దేవుడికి చెప్పుకుని బాధపడుతుంది శారద. పార్ధులో మార్పు వస్తుందో? రాదో? తెలియదని కనీసం వచ్చే అమ్మాయైనా తనను అత్తగారిలా స్వీకరించేలా చూడమని అడుగుతుంది. ఇదంతా విన్న బలరామ్ చాలా బాధపడతాడు.
నీ మనసులో ఎంత బలమైనా గాయం అయ్యిందో నాకు అర్ధమవుతోంది? అతి తొందరలోనే ఆ గాయం మానే రోజులు వస్తాయని కోరుకుంటున్నానని చెబుతాడు బలరామ్. కొత్త దంపతుల రాక కోసం శక్తి ఎదురుచూస్తుంటుంది. ఇంతలో చరణ్ భయం భయంగా ఆమె పక్క నుంచి వెళ్లడంతో ఆమెకు అనుమానం వచ్చి ఏదో తప్పు చేశావని నిలదీస్తుంది. నువ్వు పద్ధతిగా ఉండకపోయినా పర్లేదు కానీ .. ఉన్నట్లు నటించమని అంటుంది. రేపు మీ పెదనాన్న స్థానాన్ని మీ నాన్న ఆక్రమించినప్పుడు మా వారసుడిగా ఈ ఇంటిని ఏలాల్సింది నువ్వేనని మండిపడుతుంది శక్తి.
ఇంతలో దుర్గ వచ్చి ఏం జరిగిందని వాళ్లని అడుగుతాడు. ఆకాశానికి నిచ్చెనలు వేస్తావ్ .. వద్దంటే వినవని చెప్పి వెళ్లిపోతాడు. మీ నాన్న మాటలు విన్నావు కదా? కనీసం నువ్వయినా నేను చెప్పినట్లు వింటావా అని చరణ్‌పై మండిపడుతుంది శక్తి. వీడు ఇప్పుడే ఇలా తయారవుతున్నాడు.. రేపు వీడికొచ్చే పెళ్లాం ఎలా ఉంటుందో? అంటూ అనుకుంటూ ఉండగా ఆ మాటలు విన్న స్వాతి నవ్వుకుంటూ శక్తి దగ్గరికి వెళ్తుంది. ఇంతలో భానుమతిని తీసుకుని పార్ధు ఇంటికి వస్తాడు. కారు దిగగానే బలరామ్ కుటుంబాన్ని చూసిన భానుమతి బాధపడుతుంది.
ఏ కుటుంబమైతే నా వల్ల అవమానాలు ఎదుర్కోందో? ఆ ఇంటికే నేను కోడలిగా వచ్చానని.. పెళ్లి ఆగిపోవడానికి కారణం నేనే అని తెలిస్తే అని భయపడుతుంది. గుమ్మంలో కొత్త జంటకి హారతి ఇస్తుంది చిత్ర. ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు చెప్పి లోపలికి రావాలని అంటుంది. నేను నా పెళ్లాం బస్సు అమ్మాయితో కలిసి వచ్చానని పార్ధు .. నేను మా ఆయన జీపు అబ్బాయితో కలిసి వచ్చానని భానుమతి చెప్పడంతో అంతా నవ్వేస్తారు. ఆ మాటలతో భువన, శాంభవిలు రగిలిపోతారు. మీరు పెట్టుకున్న పేర్లు కాదు.. మీ అమ్మానాన్నలు పెట్టిన పేర్లు చెప్పి లోపలికి రావాలని శక్తి అంటుంది. బలరామ్ తల్లి కూడా ఆట పట్టించడంతో భానుమతి కంగారు పడుతుంది. దాంతో భానుమతికి శారద ధైర్యం చెబుతుంది. తర్వాత పార్ధు, భానుమతిలు కరెక్ట్‌గా చెప్పి లోపలికి వస్తారు.
గుమ్మం దగ్గర బియ్యంతో నిండిన కలశాన్ని కాలితో తన్ని లోపలికి రావాలని బలరామ్ తల్లి చెప్పడంతో భానుమతి షాక్ అవుతుంది. భానుకి ఆ కలశం బంతిలా కనిపించడంతో ఎగిరి తంతుంది. ఆ దెబ్బతో కలశం ఎగిరిపడుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. అదేంటి బస్సు అమ్మాయి కలశాన్ని అలా తన్నావని పార్ధు ప్రశ్నించగా.. మీ నాయనమ్మ గారే దానిని తన్నమని చెప్పారు కదా అని అంటుంది భానుమతి. లోక జ్ఞానం లేని పిల్లని కోడలిగా తీసుకొచ్చారని బలరామ్ తల్లి మండిపడుతుంది. చిన్నపిల్ల ఏదో తెలియక చేసుంటుంది, నెమ్మదిగా అన్ని తెలుసుకుంటుందని బలరామ్ చెప్పడంతో భానుమతికి మామగారిపై గౌరవం కలుగుతుంది.
తర్వత భానుమతిని దేవుడి గదిలోకి తీసుకెళ్లి దీపం పెట్టి భగవంతుడి ఆశీర్వాదం తీసుకోమని చెబుతుంది బలరామ్ తల్లి. ఆవిడ దెబ్బకి భానుమతిని వణికిపోతుంది. ఈవిడ నన్నే టార్గెట్ చేస్తూ, ప్రతి పనిలో ఆటంకం కలిగిస్తోందని అనుకుంటుంది భానుమతి. తర్వాత భానుమతి దేవుడికి దీపం వెలిగిస్తుండగా .. పదిసార్లు అగ్గిపుల్ల వెలిగించడం కాదు, ఒకేసారి దీపం వెలిగించాలని బలరామ్ తల్లి చెప్పడంతో భానుమతి కంగారు పడుతుంది.
ఇంతలో ఇంట్లోకి బాగా గాలి రావడంతో ఆమె ఇంకా టెన్షన్ పడుతుంది. కిటికీ తలుపులు ఎవ్వరూ మూయకూడదని కానీ దీపం వెలిగించాలని.. దైవానుగ్రహం ఎలా ఉందో తెలియాలంటే ఇలా చేయాల్సిందేనని అంటుంది బలరామ్ తల్లి. భానుమతి కంగారు పడుతుండగా పార్ధు దీపానికి, గాలికి అడ్డుగా నిలబడతాడు . అది చూసి భానుమతి సంతోషిస్తుంది. తర్వాత దేవుడికి హారతి ఇస్తుంది.
శారద కాళ్లకి నేను నమస్కరించనని, నువ్వు ఆశీర్వాదం తీసుకోమని చెబుతాడు పార్ధు. దాంతో భానుమతి షాక్ అవుతుంది. భానుమతి మాత్రం అత్తగారి కాళ్లకి నమస్కారించి ఆశీర్వాదం తీసుకుంటుంది. శక్తి - దుర్గల ఆశీర్వాదం తీసుకుంటుండగా ఈ జీపు అబ్బాయి తల్లి స్థానంలో ఉన్న వ్యక్తిని కాదని పిన్నితో బాగుంటున్నాడని భానుమతికి డౌట్ వస్తుంది. నీ పెళ్లితో ఈ ఇంట్లో పండుగ వాతావరణం వచ్చిందని, అది మీ ఇద్దరి జీవితాల్లో శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నానని అంటుంది శక్తి. తర్వాత బలరామ్ దగ్గర భానుమతి, పార్ధులు ఆశీర్వాదం తీసుకుంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











