Bhanumathi April 4th Episode: కోటికి శక్తి వార్నింగ్.. తండ్రి కోసం పెళ్లికి తలవంచిన భాను, పార్ధులో అనుమానం
భానుమతిని ఎలాగైనా చూడాలని పార్ధు బయల్దేరుతుండగా శారద అడ్డుపడి ఈ టైంలో వెళ్లకూడదని చెబుతుంది. ఆ మాటలతో రగిలిపోయిన పార్ధు ఎవరి హద్దుల్లో వాళ్లుంటే మంచిదని అంటాడు. ఇది విన్న బలరామ్.. మీ అమ్మ చెప్పినట్లు ఈ సమయంలో వెళ్లకూడదని చెప్పడంతో తండ్రి మాట ప్రకారం ఆగిపోతాడు. విశ్వనాథం ఇంట్లో పెళ్లి పనులు మొదలు కావడంతో బలరామ్ కుటుంబ సభ్యులు పసుపు కొడతారు. దాంతో బలరామ్, పార్ధులు ఎంతో సంతోషిస్తుండగా భువన, శాంభవిలు రగిలిపోతారు.
పెళ్లి ఎలా ఆపాలో తెలియక వసు, భానుమతిలు ఆలోచిస్తుంటారు. పార్ధు గారికి ఫోన్ చేసి పెళ్లి ఇష్టం లేదని చెప్పమని వసు సలహా ఇవ్వడంతో తండ్రి ఫోన్ కొట్టేసి విశ్వనాథం ఇంటికి ఫోన్ చేస్తుంది భానుమతి. ఆ ఫోన్ శక్తి లిఫ్ట్ చేయగా తనకు పెళ్లి ఇష్టం లేదని చదువుకోవాలని అనుకుంటున్నానని దయచేసి పెళ్లి ఆపమని బతిమలాడుతుంది. పార్ధుకి మేకప్ వేయించి హీరోలో తయారు చేయిస్తాడు సూరి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 4వ తేదీ ఎపిసోడ్ 23లో ఏం జరిగిందంటే?

సూరి పంపించిన మేకప్‌మెన్‌తో తన ఫేస్‌కి మేకప్ వేయించుకుంటుంది కుమారి. మేకప్‌మెన్‌కి ఆ దెబ్బతో మెంటల్ ఎక్కుతుంది. ఒకసారి పెళ్లికూతురిని పిలిస్తే ఆవిడకి కూడా మేకప్ వేసి వెళ్లిపోతానని చెబుతుంది ఆ అమ్మాయి. దాంతో భానుమతిని కుమారి పిలుస్తుంది. బయటికొచ్చిన భానుమతి, వసులకు కుమారి మేకప్ వేసుకుని కనిపిస్తుంది. నీకు ఎంత మంచి మొగుడు దొరికాడో చూడు అని అంటుంది కుమారి. పెళ్లి కాలేదు, నాకు తాళి కట్టలేదు అప్పుడే ఆయన నాకు మొగుడు అయిపోయాడా? అంటూ మండిపడుతుంది భానుమతి.
అతనితోనే నీ బతుకు , అతనితోనే నీ భవిష్యత్తు అని అంటుంది కుమారి. పార్ధుకి నీ మీద ఎంత ప్రేమో , నా పెళ్లాం అందంగా ఉండాలి, చందమామలా ఉండాలని మేకప్ అమ్మాయిని కూడా పంపించాడని చెబుతుంది కుమారి. ఇన్నాళ్లు మేకప్‌తోనే బతికానా? మేకప్ లేకుండా బయటికి వెళ్లానా? అని ప్రశ్నిస్తుంది భానుమతి. ఈ రంగుల చాటున నా ముఖాన్ని దాచుకోవడం ఇష్టం లేదని మీరు వెళ్లిపోవచ్చని మేకప్ అమ్మాయికి చెబుతుంది భానుమతి. ఆమె వెళ్లిపోతుండగా మేకప్ సామాను కొట్టేస్తుంది కుమారి. తన సామాన్లు కనిపించకపోవడంతో మేకప్ అమ్మాయి కంగారుపడుతుంది. అది ఎక్కడుందో నాకు తెలుసని వసు వచ్చి కుమారిని పైకి లేపడంతో అక్కడ మేకప్ బాటిల్ కనిపిస్తుంది. ఇక్కడ జరిగిందేది అక్కడ చెప్పొద్దని మేకప్ అమ్మాయికి వార్నింగ్ ఇస్తుంది కుమారి.
భానుమతి తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో ఆ విషయం మాట్లాడటానికి కోటిని పిలిపిస్తుంది శక్తి. ఈ పెళ్లి వద్దని, మా ఇంటి కోడలు కావడం ఇష్టం లేదని అల్లరి చేస్తోందని మండిపడుతుంది. నేరుగా ఈ విషయం పార్ధుకి చెప్పడానికి మా ఇంటికి ఫోన్ చేసిందని చెప్పడంతో కోటి షాక్ అవుతాడు. అనుకోకుండా ఆ ఫోన్ నేను లిఫ్ట్ చేశాను కాబట్టి సరిపోయిందని.. లేకపోతే ఈ పెళ్లి ఆగిపోయేదని చెబుతుంది శక్తి. నీక్కూడా ఇష్టం లేకపోతే చెప్పు నీ తరపున నేనే చెప్పి ఈ పెళ్లి ఆపేస్తానని అంటుంది.
ఆ మాటలతో షాకైన కోటి అంత పని చేయొద్దని, నేను తలకిందులుగా తపస్సు చేసినా నా కూతురికి ఇంత గొప్ప సంబంధం దొరకదని అంటాడు కోటి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో, మీలాంటి వాళ్లతో సంబంధం కలుపుకునే అవకాశం దొరికిందని చెబుతాడు. అలాంటి అవకాశాన్ని చూస్తూ చూస్తూ ఎలా చేజార్చుకుంటానని అంటాడు కోటి. నా కూతురికి నేను సర్ది చెప్పుకుంటానని చెబుతాడు. తనకి ఎంతటి మహర్దశ పట్టిందో నీ కూతురికి కూడా అర్ధం కావాలని అంటుంది శక్తి. బంగారం లాంటి అవకాశం వస్తే దాన్ని బంకమన్ను పాలు చేసేలా ఉన్నావని కూతురిపై రగిలిపోతాడు కోటి.
మేకప్‌మెన్‌కి డబ్బులిచ్చిన పార్ధు.. అక్కడ భానుమతికి మేకప్ పూర్తయిన తర్వాత ఎలా ఉందో ఒక ఫోటో తీసి పంపమని అడుగుతాడు. మేకప్ అమ్మాయికి ఆ వ్యక్తి ఫోన్ చేసి భానుమతి గారికి మేకప్ అయిపోయిందా అని అడుగుతాడు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలి? మెడలో పడే తాళి కోసం ఎదురుచూస్తుండాలి? కానీ ఈ భానుమతికి పెళ్లి మీద అంత ఆశ, ఆత్రం ఏమీ లేనట్లుగా అనిపిస్తుందని ఆ మేకప్ అమ్మాయి చెబుతుంది. ఆ మాటలు విన్న పార్ధు, సూరిలు షాక్ అవుతారు. మాట్లాడితేనే విసుక్కుంటుంది.. మేకప్ అంటే కసురుకుంటుంది .. మేకప్ వేయకుండానే నేను వెళ్లిపోతున్నానని చెప్పడంతో పార్ధు బాధపడతాడు.
బస్సు అమ్మాయికి ఇష్టం లేకుండానే ఈ పెళ్లి జరుగుతుందా అని పార్ధు సూరిని అడుగుతాడు. ఈ మాత్రం దానికే ఇష్టం లేదు అనడం కరెక్ట్ కాదని అంటాడు సూరి. ఇంతలో పెట్రోల్ క్యాన్ తీసుకుని ఇంటికి కోపంగా వస్తూ భానుమతిని పిలుస్తాడు కోటి. అందరి ముందు పెట్రోల్ పోసుకుని .. ఈ ఇంట్లో ఒక ప్రాణం పోతే కానీ ఒక పెళ్లి జరగదని రుజువు అయ్యిందని అంటాడు. నేను చచ్చి భానుమతి పెళ్లి చేస్తానని మండుతున్న కట్టె తీసుకుని వస్తాడు. నా దగ్గర ఒకే ఒక్క ప్రశ్న ఉందని.. దానికి భానుమతి మాత్రమే సమాధానం చెప్పాలని అంటాడు కోటి.
నీ బతుకుని అందలం ఎక్కిద్దామని నేను అనుకుంటున్నానని.. అంధకారం చేసుకుందామని నువ్వు అనుకుంటున్నావ్ అని మండిపడతాడు కోటి. అసలు ఏం జరిగిందని ప్రమీల అడగ్గా .. మీ సంబంధం మాకు ఇష్టం లేదని నేరుగా విశ్వనాథం గారింటికే ఫోన్ చేసిందని చెబుతాడు కోటి. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. నువ్వు ఫోన్ చేసినప్పుడు నీ మాటలు అల్లుడు గారు వినలేదని లేదంటే ఈ పెళ్లి ఆగిపోయేదని చెబుతాడు. ఇంతలో పార్ధు నుంచి కోటికి ఫోన్ వస్తుంది. భానుమతి ఇష్టపడే ఈ పెళ్లి చేసుకుంటుందా? లేక ఇబ్బందిపడుతూ చేసుకుంటుందా అని అడుగుతాడు పార్ధు.
నువ్వు ఈ పెళ్లి ఇష్టం లేదని చెబితే నా శవం బయల్దేరుతుందని భానుమతిని బెదిరించి ఫోన్ ఇస్తాడు కోటి. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని పార్ధు అడగ్గా .. తండ్రికి భయపడి నేను ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకుంటున్నానని అంటుంది భానుమతి. బయటికొచ్చిన కోటి.. అవన్నీ కలర్ నీళ్లు కాబట్టి సరిపోయిందని లేకపోతే నాకు మందుకు రుణం తీరిపోయేదని అనుకుంటాడు. భాను, పార్ధులని పెళ్లికొడుకు, పెళ్లికూతర్లుగా చేస్తారు . ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











