Bhanumathi April 7th Episode: పీటలపై పార్ధు .. భువన కంటతడి, పోలీసుల కోసం భానుమతి ఎదురుచూపులు
పార్ధు, భానుమతిలకు స్నానం చేయించి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుగా చేస్తారు ఇరు కుటుంబాల వాళ్లు. పెద్దింటికి కోడలిగా వెళ్లబోతున్నావని బాధ్యతగా ఉండాలని భానుమతికి చెబుతుంది ప్రమీల. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపేయాలని వసుతో అంటుంది భానుమతి. పెళ్లికొడుకుని చేసిన తర్వాత అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న పార్ధు.. శారద వైపు మాత్రం కోపంగా చూస్తాడు. దీంతో శారద, బలరామ్‌లు బాధపడతారు.
పెద్దింటి సంబంధం రావడంతో ఊళ్లో మీ పరపతి పెరిగిందని కుమారితో ఆమె ఫ్రెండ్స్ చెబుతారు. ఇంతలో కోటి వచ్చి త్వరలో నువ్వు రాజమాతవి కాబోతున్నావని మునగ చెట్టు ఎక్కిస్తాడు. నా లాంటి జీవితం మీకు రాకూడదని భానుమతి, వసులకు చెబుతుంది ప్రమీల. పుస్తకాలు చూసుకుంటూ ఏడుస్తున్న భానుమతికి వసు వచ్చి పెళ్లి ఆపడానికి ఐడియా ఇస్తుంది. నువ్వు చట్ట ప్రకారం మేజర్ కాలేదని అప్పుడు ఈ పెళ్లి చేయడం నేరమని చెబుతుంది. చెల్లెలు చెప్పిన వెంటనే పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి కంప్లయంట్ చేస్తుంది భానుమతి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 7వ తేదీ ఎపిసోడ్ 25లో ఏం జరిగిందంటే?

పెళ్లి పెట్టుకుని కూటికి లేనట్లు నీ అవతారం ఏంటి అని కోటిపై మండిపడుతుంది కుమారి. లోపలికి వెళ్లి 100 ఎకరాల ఆసామీలా హుందాగా తయారై రమ్మని చెబుతుంది కోటి. నత్తగుల్లలా ఇక్కడిక్కడే తిరగకుండా వెళ్లి భానుమతిని రెడీ చేయమని ప్రమీలపై రంకెలు వేస్తుంది కుమారి. ఒంటరిగా బాధపడుతున్న భానుమతికి దగ్గరికి ప్రమీల వచ్చి చీర కట్టుకుని రెడీ అవ్వమని అంటుంది ప్రమీల. మనం వెళ్లే దారి ఏంటో తెలియనప్పుడు బతుకు మీద భయం కలుగుతుందని.. కానీ వెళ్లే తీరు ఏంటో తెలిస్తే ప్రయాణం ప్రశాంతంగా సాగిపోతుందని చెబుతుంది ప్రమీల.
నువ్వు డాక్టర్‌వి కావాలన్న ఆశలో న్యాయం ఉందని, కానీ డాక్టర్ అయ్యేరాత నీ నుదిటి మీద ఉందో లేదో తెలియదని అంటుంది ప్రమీల. ఈ పెళ్లి జరిగితే నీ బతుకు బంగారంలా ఉంటుందని చెబుతుంది. నువ్వు కాదనుకుండా తల్లిగా ఈ పెళ్లికి ఒప్పిస్తున్నానని చెబుతుంది . నీకు అంతా మంచే జరుగుతుందని, నీ జీవితమంతా సంతోషంగానే ఉంటుందని అంటుంది. త్వరగా పెళ్లికి రెడీ అవ్వమని కూతురికి చెబుతుంది ప్రమీల. తల్లి తీసుకొచ్చిన చీర చూస్తూ ఉండిపోతుంది భానుమతి.
ఇంతలో పెద్ద మనిషి గెటప్‌లో తయారై వస్తాడు కోటి. నువ్వు ఇలా హుందాగా ఉంటే ఆ బలరామ్ గారి కంటే ఉన్నవాడిలా కనిపిస్తున్నావని అంటుంది కుమారి. వాళ్లిద్దరి మాటలను భానుమతి విని విసుక్కుంటుంది. ఇంతలో పెళ్లి కూతురిలా అందంగా రెడీ అయి బయటికి వస్తుంది భానుమతి. ఆమెను చూడగానే కుమారి, కోటి పొంగిపోతారు. నా కూతురిని లక్ష్మీదేవి పూనినట్లుగా ఉందని తల్లితో అంటాడు కోటి. కుబేరుల ఇంటికి కోడలిగా వెళ్తుండటంతో ఆ లక్ష్మీదేవి కూడా ఆగలేక భాను దగ్గరికి వచ్చేసిందని అంటుంది కుమారి.
పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేయిస్తాడు బలరామ్. పార్ధును దగ్గరుండి రెడీ చేస్తుంది శక్తి. అది చూసి భువన ఏడుస్తుండగా కూతురిని చూసి శాంభవి కూడా బాధపడుతుంది. మన స్థాయికి అన్ని రకాలుగా సరితూగేవాడి కూతురు నీ పక్కన నిలబడితే బాగుండేదని అంటుందని నానమ్మ. సరితూగడం అంటే ఆస్తి అంతస్తులోనే కాదని, సంస్కారం విషయంలో కూడా ఉంటుందని చెబుతాడు పార్ధు. ఆ విషయంలో ఆ అమ్మాయి మనల్ని మించిపోయేలా ఉంటుందని అంటాడు.
పెళ్లికాకముందే పెళ్లాన్ని ఏం అననివ్వడం లేదని సూరి ఆటపట్టిస్తాడు. ఆ మాటలు విని భువన ఏడుస్తూ పక్కకి వచ్చేస్తుంది. తల్లి ఉండి కూడా బిడ్డ అనాథగా బ్రతికినట్లు , మీ అన్నయ్య ఉండి కూడా మనం ఈ ఇంట్లో పరాయి మనుషుల్లాగే ఉన్నామని అంటుంది భువన. అందరిలోనూ ఉన్న సంతోషం మనలో లేదని తల్లితో చెప్పి బాధపడుతుంది. మనకి అనుకూలంగా లేని సమయంలో మనం ఏం చేసినా అది మనకే తిప్పికొడుతుందని కూతురికి నచ్చచెబుతుంది శాంభవి. అవకాశం కోసం ఎదురుచూడటం తప్పించి మనం ఏం చేయలేని పరిస్ధితుల్లో ఉన్నామని అంటుంది.
పెళ్లి వేదిక దగ్గరికి కోటి తన కుటుంబాన్ని తీసుకుని వస్తాడు. పెళ్లికి చేసిన ఏర్పాట్లు చూసి మురిసిపోతాడు. అందరూ వారికి ఆహ్వానం పలుకుతారు. కిటికీలోంచి పెళ్లికూతురి గెటప్‌లో భానుమతిని చూసి పార్ధు చాలా సంతోషిస్తాడు. ఈ పెళ్లి తర్వాత భానుమతి నీ జీవితంలోకి వస్తుందని చెబుతాడు సూరి. ఆ క్షణం కోసమే నేను ఎదురుచూస్తున్నానని అంటాడు పార్ధు. విశ్వనాథం ఇంట్లో వస్తువులు చూసి ఎంత ఖరీదైనవోనని అంటుంది కుమారి. మనం వచ్చింది కళ్యాణానికి , కొట్టేయడానికి కాదని చురకలు అంటిస్తుంది వసు. నేను చేసిన ఫోన్ కాల్ పోలీసులకు వెళ్లిందా? నిజంగానే పెళ్లి ఆపుతారా? అని వసుతో అంటుంది భానుమతి.
ఇంతలో పెళ్లి కొడుకు, పెళ్లికూతురిని పూజారి గారు పిలవడంతో భానుమతి మరింత టెన్షన్ పడుతుంది. పార్ధుని పెళ్లి కొడుకుగా చూస్తూ బలరామ్ సంతోషంతో మురిసిపోతాడు. ఆ కాసేపటికే పెళ్లికుమార్తెను తీసుకురమ్మని పిలుస్తారు పంతులుగారు. ఆ మాటతో భానుమతి, వసులు టెన్షన్ పడతారు. నన్ను కూడా పిలిచేశారు.. ఈ పోలీసులు ఇంకా రాలేదని వసుని అడుగుతుంది ప్రమీల. కూతురిని తీసుకెళ్లడానికి ప్రమీల వెళ్తుంది. నువ్వు మరొక ఇంటికి సొంతం కావడానికి సర్వం సిద్ధమైందని చెబుతుంది. భానుమతి ఏడుస్తూనే పెళ్లిపీటల మీదకి వస్తుంది.
భానుమతి - పార్ధులు పీటలపై పూజ చేస్తుండగా బలరామ్‌కి తాను చేసిన శపథం గుర్తొస్తుంది. పార్ధుకి పెళ్లి అవుతుందని మీ ముఖంలో ఆనందం అంతలా తాండవిస్తుందని బలరామ్‌ని అడుగుతాడు పెద్ద కొడుకు ధర్మ. జీవితంలో మనల్ని తక్కువగా చూసినవాళ్ల కంటే ఒక మెట్టు ఎక్కువగా ఉండాలని చెబుతాడు బలరామ్. మనల్ని చూసి ఎగతాళి చేసినవాళ్లకి మన పనులతోనే సమాధానం చెప్పాలని అంటాడు. ఈ పెళ్లితో మనల్ని వెక్కిరించినవారికి సరైన సమాధానం దొరుకుతుందని అంటాడు. సరిగ్గా పార్ధుకి తాళి ఇచ్చి కట్టమంటాడు పంతులుగారు. ఆ మాటలతో భానుమతి, వసులు షాక్ అవుతారు. ఇంతలో పోలీసులు వచ్చి పెళ్లిని ఆపమంటారు . ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











