Bhanumathi March 21st Episode: భానుమతితో పెళ్లికి బలరామ్ నో.. పార్ధు గుండె ముక్కలు
నీ ప్రేమ విషయం వెంటనే నాన్నకి చెప్పమని పార్ధుతో అంటాడు సూరి. అది నా వల్ల కాదని చెబుతాడు పార్ధు. అయితే దీనికి మా పిన్నే కరెక్ట్ అని చెప్పిన పార్ధు వెంటనే శక్తి దగ్గరికి వెళ్లి భానుమతితో ప్రేమలో పడినట్లు, ఆమె తండ్రి ఎలాంటి వాడో చెబుతాడు పార్ధు. ఏదో ఒకటి చేసి నిన్ను ఆ అమ్మాయిని కలుపుతానని శక్తి మాట ఇస్తుంది. బస్సు అమ్మాయి జ్ఞాపకాలు పార్ధుని వెంటాడుతుండగా భానుమతి సడెన్‌గా అక్కడికి రావడంతో పార్ధు షాక్ అవుతాడు.
మీ దగ్గర ఊరికే డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదని జీవితంలో ఏదో ఒక రోజు మీ రుణం తీర్చుకుంటానని చెబుతుంది. అలాగే కొన్ని పేపర్స్ తీసుకొచ్చి సాక్ష్యంగా ఇవి మీ దగ్గర ఉంచుకోమని పార్ధుతో అంటుంది భానుమతి. ఇదే మంచి సమయమని భానుమతికి ఐ లవ్ యూ చెప్పబోతుండగా పిల్లలు అడ్డొస్తారు. పార్ధు అన్నయ్య ప్రేమకి అండగా నిలబడతావా అని శక్తిని ఆమె కొడుకు, కూతురు అడగ్గా.. పల్లెటూరి వాళ్లు, లేనివాళ్లు అయితేనే చెప్పిన మాట వింటారని చెబుతుంది శక్తి. భానుమతి- పార్ధుల మధ్య చిచ్చు పెట్టాలని భువనతో అంటుంది శాంభవి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 21వ తేదీ ఎపిసోడ్ 11లో ఏం జరిగిందంటే?

ఉదయాన్నే విశ్వనాథం- బలరామ్‌లు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత తమ్ముడిని పిలిచి పార్ధు ఈ ఊళ్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడని చెబుతాడు బలరామ్. దాంతో అందరూ సంతోషిస్తారు. పార్ధు ఈ ఊరి అమ్మాయిని ఇష్టపడ్డ విషయం మాకు చెప్పలేదే అని విశ్వనాథం అడగ్గా.. నాక్కూడా నిన్న రాత్రే తెలిసిందని అంటాడు బలరామ్. ఆ విషయం కూడా శారదే నాకు చెప్పిందని అంటాడు. చాలా మంచి విషయం చెప్పావని, పార్ధుకి పెళ్లి చేసేసి వెళ్తూ వెళ్తూ కోడలిని కూడా తీసుకెళ్దామని అంటాడు దుర్గ.
ఆ అమ్మాయి ఎవరు కనుక్కోవాల్సిన బాధ్యత నీదేనని అంటాడు బలరామ్. ఎలా కనుక్కోవాలని దుర్గ అడగ్గా.. నిన్న సీతారాముల కళ్యాణంలో నా పక్కనే కూర్చొంది అని చెబుతాడు. దాంతో అది భానుమతి అని విశ్వనాథం దంపతులకు గుర్తొచ్చి షాక్ అవుతారు. ఈ మాటలు విన్న పార్ధు ఎంతో సంతోషిస్తాడు. పార్ధు ఇష్టపడేది ఆ అమ్మాయినేనా అని విశ్వనాథం అడగ్గా.. ఆ అమ్మాయి మీకు తెలుసా? అని ప్రశ్నిస్తాడు బలరామ్. తెలిస్తే వాళ్ల తల్లిదండ్రుల్ని పిలిపించండి , పెళ్లి విషయం మాట్లాడదామని అంటాడు.
ఆ అమ్మాయి తల్లిదండ్రుల గురించి చెప్పబోతూ విశ్వనాథం తడబడతాడు. చిన్న మావయ్య గారు ఎందుకు సందేహ పడుతున్నారో నాకు తెలుసు అంటూ శక్తి కలగజేసుకుంటుంది. వివరాలు చెప్పాక ఎక్కడ వద్దు అంటారోనని అంటుంది. వివరాలు తెలిస్తే నిర్ణయాలు మారిపోతాయా అని బలరామ్ ప్రశ్నిస్తాడు. మారిపోతాయ్.. అసలు ఆ మనుషుల జోలికి వెళ్లొద్దు అనే ప్రమాదం కూడా ఉంది అని అంటుంది శక్తి. పార్ధు ఇష్టపడిన అమ్మాయితో పార్ధు పెళ్లి చేయడం నా బాధ్యత అని చెబుతాడు బలరామ్. ఇది జరిగితే పార్ధు కూడా ఎంతో సంతోషిస్తాడు.. ఆ అమ్మాయిని పార్ధు కూడా ఎంతో ఇష్టపడుతున్నాడని చెబుతుంది శక్తి.
పార్ధు అంతగా ఇష్టపడుతున్నప్పుడు వాడి ప్రేమను మనం కూడా గౌరవించాలని అంటాడు బలరామ్. అయితే ఆ అమ్మాయి తండ్రి గురించి కూడా తెలుసుకోవాలని చెబుతుంది. ఆ అమ్మాయి తండ్రి అంత పేరున్నవాడా అని బలరామ్ అడగ్గా.. అస్సలు పరువే లేనివాడని శక్తి చెప్పేసరికి అంతా షాక్ అవుతారు. గుడిలో మీకు ఎదురైన తాగుబోతే ఆ అమ్మాయి తండ్రి అని చెప్పేసరికి బలరామ్ - శారదలు షాక్ అవుతారు. ఆ తాగుబోతు కూతురినా నా పార్ధు ఇష్టపడింది అంటూ బలరామ్ మండిపడతాడు. తండ్రి తాగుబోతు అయితే ఏంటీ కూతురు కుందనపు బొమ్మ అని చెబుతుంది శక్తి.
మీరు పెద్ద మనసు చేసుకుంటే పార్ధు ఇష్టపడిన అమ్మాయితో పెళ్లి చేసేయొచ్చు అని శక్తి చెప్పగా బలరామ్ మండిపడతాడు. వాడి ఇష్టం కోసం నా కుటుంబ స్థాయిని తగ్గించలేనని అంటాడు. మనకు కావాల్సింది ఆ అమ్మాయి కానీ, ఆ అమ్మాయి తండ్రి కాదు కదా అని శక్తి నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తుంది. అలాంటి వాడి కూతురికి మన ఇంట్లో కూతురిగా అడుగుపెట్టే అర్హత లేదని తేల్చిచెబుతాడు బలరామ్. నేను ఎంక్వైరీ చేయించానని, చాలా మంచి పిల్ల అని తేలిందని శక్తి చెప్పినా బలరామ్ వినిపించుకోకుండా వెళ్లిపోతాడు.
బావ ఏదో ఆవేశంలో అన్నారని, నువ్వేం బాధపడొద్దని పార్ధుతో అంటాడు సూరి. నా ప్రేమను నేనే నిలబెట్టుకోవాలా? వదులుకోవాలా? అని నేనే నిర్ణయించుకుంటానని పార్ధు చెబుతాడు. ఇంతలో ప్రమీల భోజనం తీసుకుని విశ్వనాథం ఇంటికి వస్తుంది. ఆమెను శాంభవి, భువన చూస్తారు. కొందరికీ కూటికి గతి ఉండదు కానీ, కోట్లకు పడగలెత్తిన వాళ్లు కావాలని ప్రమీలకు వినిపించేలా అంటుంది శాంభవి. కూతుళ్లని కోటీశ్వరుల కొడుకులకి గాలం వేసేందుకు పంపిస్తారంటూ ప్రమీలతో అంటుంది.
మా దగ్గర ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చని, ఆత్మాభిమానం లేకపోలేదని చెబుతుంది ప్రమీల. మీరు చెప్పింది ఎక్కడైనా జరగొచ్చని, కానీ మా కుటుంబంలో ఎప్పటికీ అలా జరగదని అంటుంది. పరువు కోసం ప్రాణాలిచ్చే మనుషుల మీద ఎందుకు బురద జల్లుతున్నారని మండిపడుతుంది. నీ కూతురు నా మేనల్లుడిని బుట్టలో వేసుకోవాలని చూస్తోందని ప్రమీలతో చెబుతుంది శాంభవి. మీ కూతురు వల వేసి మా బావని పట్టుకుందని భువన కూడా నానా మాటలు అనడంతో ప్రమీల ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఇదంతా బలరామ్ పెద్ద కోడలు చూసి బాధపడుతుంది.
తన ప్రేమను నాన్న తిరస్కరించడంతో బలరామ్ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి బలరామ్ పెద్ద కోడలు వస్తుంది. ఇప్పుడున్న పరిస్ధితుల్లో మావయ్య గారు నీ ప్రేమను తప్పుపట్టలేం, మావయ్య గారి పెద్దరికాన్ని తప్పుపట్టలేం అంటుంది. భానుమతి వల్ల అమ్మని శాంభవి పిన్ని నానామాటలు అని అవమానించిందని పార్ధుతో చెబుతుంది. లేనివాళ్లను చూస్తే ఉన్నవాళ్లకు నోరు లేస్తుందని మండిపడతాడు పార్ధు. ప్రమీల గారి కన్నీళ్లు చూస్తే ఆవిడ గుండెకు కోలుకోలేని గాయమైందని , మనవాళ్ల తరపున నేనే క్షమాపణలు అడుగుతానని పార్ధు చెబుతాడు.
ఇంట్లో భానుమతి చదువుకుంటూ ఉండగా కోటిగాడు మందు తాగుతూ ఉండగా కుమారి భోజనం తీసుకొస్తుంది. ఇంతలో ప్రమీల ఇంటికి వస్తుంది. వెళ్లేటప్పుడు శాంతంగా వెళ్లావు.. ఇప్పుడు కోపంతో ఊగిపోతున్నావ్ ఏమైందని అడుగుతుంది ప్రమీల. నువ్వొక గొప్ప తల్లివి, నువ్వొక గొప్ప కొడుకు అంటూ మండిపడుతుంది ప్రమీల. మందు కొట్టే కొడుకు.. మంది సొమ్ము కొట్టేసే తల్లి అంటూ ఫైర్ అవుతుంది. ఆమె మాటల్ని విన్న భానుమతి బయటికొస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











