Bhanumathi March 25th Episode: తండ్రి సర్‌ప్రైజ్‌తో పార్ధులో సంతోషం.. పెళ్లికి నో చెప్పిన భానుమతి
జీవితం నచ్చినట్లు లేకుంటే జీవితాంతం బాధపడాల్సి ఉంటుందని బలరామ్‌కి చెబుతుంది శారద. పార్ధు ఇలా బాధపడుతూ ఉంటే మనం ఆనందంగా ఉండలేమని బలరామ్‌కి నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో బయటికి వెళ్లిన బలరామ్ అక్కడ పార్ధు - సూరి మాట్లాడుకుంటున్న మాటలను వింటాడు. మీ నాన్నకి ఇంకోసారి చెప్పి చూడమని పార్ధుకి సూరి చెబుతాడు. అర్ధం చేసుకోని వాళ్లకి, అన్నింటికి అడ్డుపడని వాళ్లకి చెప్పొచ్చు.. కానీ మా నాన్న మాకు ఏం కావాలో ఇస్తారు, అడిగింది తెస్తారు అని అంటాడు పార్ధు.
మా నాన్న గర్వపడే పని చేయకపోయినా.. ఆయన బాధపడే పని మాత్రం చేయనని అంటాడు పార్ధు. ప్రేమది ఏముంది నాలుగు రోజులు ఆగితే మరిచిపోతానని అంటాడు. ఉదయాన్ని పార్ధు మాటలు గుర్తొచ్చి బాగా ఆలోచించిన బలరామ్ .. తన కుటుంబ సభ్యులందరినీ పిలిచి మనం పెళ్లి చూపులకు వెళ్తున్నామని అంటాడు. శాంభవి - భువనలు రామని చెబుతారు. కారులో పెళ్లి కూతురు ఇంటికి బయల్దేరి ఓ ఇంటికి పార్ధుని తీసుకొస్తాడు బలరామ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 25వ తేదీ ఎపిసోడ్ 14లో ఏం జరిగిందంటే?

పెళ్లి కూతురు ఇంటికి తీసుకొచ్చిన బలరామ్.. పార్ధుని పిలిచి పెళ్లి కూతురి ఇల్లు ఇదేనని ఒకసారి చూడమని చెబుతాడు. అది భానుమతి ఇళ్లు కావడంతో పార్ధు చాలా సంతోషిస్తాడు. నువ్వు పెళ్లి చూపులకి వచ్చింది ఈ ఇంటికేనని, నువ్వు సరేనంటే లోపలికి వెళ్దాం లేదంటే వెళ్లిపోదామని కొడుకుతో అంటాడు బలరామ్. ఆ మాటలతో తండ్రిని హత్తుకుంటాడు పార్ధు. నా కొడుకు కళ్లలో కనిపించే సంతోషం ముందు నా పంతం , పట్టింపులు ఎంత అని అడుగుతాడు బలరామ్. ఏదైనా నాకు నీ తర్వాతేనని , కొడుక్కి కోట్లు సంపాదించి ఇవ్వడం గొప్పకాదని .. కోట్లు కూడా ఇవ్వలేని సంతోషం ఇవ్వడమే తండ్రిగా నా బాధ్యత అంటాడు బలరామ్.
నువ్వు ఇష్టపడ్డ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చానని అంటాడు బలరామ్. నా కొడుకు నా కోసం వాడి ప్రేమనే వదులుకోవడానికి సిద్ధపడ్డాడని శారదతో అంటాడు బలరామ్. భానుమతిని పెళ్లికూతురిలా అలంకరించి పక్కన కూర్చోబెడతారు. సడెన్‌గా ఈ పెళ్లి చూపులేంటో, అసలు నా పెళ్లి కొడుకు ఎవరో అని అంటుంది భానుమతి. ఇంట్లో కోటిగాడు నానా హడావుడి చేస్తుంటాడు. రాజా లాంటి సంబంధం తీసుకొచ్చానని, అది ఎంత చదువు చదివినా ఇంత గొప్ప సంబంధం వస్తుందా అని ప్రమీలతో అంటాడు. నిన్ను చూసి కూడా పిల్లని అడగటానికి వస్తున్నాడంటే నాకు అనుమానంగానే ఉందని అంటుంది.
వాళ్లు వచ్చాక చూస్తే నువ్వే నాకు దండం పెడతావని, ఇన్నాళ్లు దెయ్యంగా చూశావ్.. ఇప్పుడు నన్ను దేవుడిలా చూస్తావని ప్రమీలతో చెబుతాడు. విశ్వనాథం గారి ఇంటికొచ్చిన బలరామ్ గారి కొడుకే పెళ్లికొడుకని చెబుతాడు కోటి. ఆ మాటలు విన్న ప్రమీల షాక్ అవుతుంది. ఆయనే స్వయంగా కారు పంపించి మరి నన్ను పిలిపించాడని జరిగింది చెబుతాడు. నా కొడుకు నీ కూతురిని ఇష్టపడ్డాడని కాబట్టి మీ అమ్మాయిని మా ఇంటి కోడలిగా చేసుకోవాలని అనుకుంటున్నానని కోటితో చెబుతాడు బలరామ్. నీకు ఇష్టమేనా అని కోటిని అడగ్గా.. కోటి సంబరపడిపోతాడు. ఇంత గొప్ప వరం ఇస్తానంటే ఎందుకు కాదంటాను , మీ కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు జల్లుకుంటానని అంటాడు.
నిజంగా నా కూతురికి అంత గొప్ప అదృష్టమా అని ప్రమీల కూడా సంతోషిస్తుంది. భానుమతి దగ్గరికి వెళ్లి సంతోషంతో మురిసిపోతుంది. నేను చదువుకోవాలని అనుకుంటున్నానని, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిసి కూడా నువ్వు సంతోషిస్తున్నావా అని అడుగుతుంది భాను. ఈ నరకం నుంచి నీకైనా విముక్తి దొరుకుతుందని నాకు సంతోషంగా ఉందని అంటుంది ప్రమీల. ఇంత గొప్ప సంబంధాన్ని వదులుకుంటే నీ అదృష్టాన్ని నువ్వు కాలదన్నుకున్నట్లు అవుతుందని అంటుంది. అసలు ఆ పెళ్లి కొడుకు ఎవరని వసు అడగ్గా.. మీరే చూస్తారుగా అని అంటుంది ప్రమీల. దేవుడి లాంటి మనిషని చెబుతుంది .
అంటే మనం వచ్చింది పార్ధు ఇష్టపడిన అమ్మాయితో పెళ్లి చేయడానికేనా అని అడుగుతుంది శక్తి. నీ ప్రేమే గెలిచిందని నాకు చాలా సంతోషంగా ఉందని పార్ధుతో అంటుంది. అన్ని ఆలోచించే ఈ సంబంధం చేసుకోవాలని అనుకుంటున్నావా బలరామ్‌ని విశ్వనాథం ప్రశ్నిస్తాడు. నా కొడుకు సంతోషం కన్నా నాకేది ఎక్కువ కాదని అంటాడు బలరామ్. జీవితాంతం కలిసి కాపురం చేయాల్సింది వాడు కాబట్టి.. పార్ధుకి నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయడమే మంచిందని అంటుంది పిన్నిగారు.
బలరామ్ కుటుంబం లోపలికి వెళ్లగా ప్రమీల అందరికీ ఫలహారం తీసుకొచ్చి ఇస్తుంది. నీ మంచితనం, మీ అమ్మాయి అదృష్టం మా వంశంలోకి నీ కూతురు రాబోతోందని చెబుతుంది పిన్నిగారు. బలరామ్ కుటుంబ సభ్యుల ఒంటిపై ఉన్న బంగారం చూసి కుమారి సంతోషించి, ఇవన్నీ కొట్టేస్తే ఎన్ని డబ్బులు వస్తాయోనని అనుకుంటుంది. పెళ్లి ఇష్టం లేక భానుమతి మెట్లపై కూర్చొని బాధపడుతుంది. నీ జీవితం మారిపోబోతోందని.. నీకో గొప్ప సంబంధం వచ్చిందని చెబుతాడు కోటి. నేను చదువుకోవాలి.. నా పెళ్లి చేస్తే నా చదువు ఆగిపోతుందని, నేను డాక్టర్ అయ్యాక మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్లని చేసుకుంటానని చెబుతుంది భాను.
చదువు లేదు, ఏం లేదు.. ఇంత గొప్ప సంబంధం నీకు మళ్లీ జీవితంలో రాదని అంటాడు కోటి. నాకు పెళ్లొద్దు, నన్ను చదువుకోనివ్వు అని బ్రతిమలాడుతుంది భానుమతి. నువ్వు లక్ష కారణాలు చెప్పినా ఈ పెళ్లి జరిగి తీరాల్సిందేనని అంటుంది. మర్యాదగా వచ్చి కూర్చొంటావా లేకపోతే మీ అమ్మని చంపేయమంటావా అని ప్రమీల పీక పట్టుకుంటాడు కోటి. నువ్వొచ్చి కూర్చోవాలి, పెళ్లి ఇష్టమేనని చెప్పాలి, వాళ్లకి ఏమాత్రం అనుమానం వచ్చినా మీ అమ్మని బతకనివ్వనని వార్నింగ్ ఇస్తాడు కోటి.
కుమారి వచ్చి అందరూ వెయిట్ చేస్తున్నారని త్వరగా భానుని తీసుకుని రమ్మని చెబుతుంది. ఇదంతా నీ మంచి కోసమేనని, దీనిని కాదనుకుంటే జీవితాంతం ఇలాగే ఈ కొంపలోనే మగ్గిపోవాలని కూతురికి నచ్చచెబుతుంది ప్రమీల. దాంతో తల్లి కోసం పెళ్లికి ఒప్పుకుంటుంది భానుమతి. బాధపడుతూ అందరికీ టీ ఇస్తుంది భాను.. పెళ్లి కొడుకు ఇతనే కాస్త చూడు బస్సు అమ్మాయి అని సూరి చెప్పడంతో పార్ధుని చూసి భాను షాకై అలా చూస్తూ ఉండిపోతుంది. ఈ రోజు కాఫీ ఇస్తావా లేదా అంటూ శక్తి ఆమెను ఆటపట్టిస్తుంది.
మీ అబ్బాయి.. మా అమ్మాయిని ఇష్టపడినట్లు తనకు తెలియదు బాబు అని చెబుతుంది ప్రమీల. పెళ్లి చూపులకు వచ్చింది మీరే అని కూడా మాకు ఇప్పుడే తెలిసిందని అంటుంది. చూస్తే కలిగే ఆనందం ముందే చెబితే తగ్గుతుందని నేనే దాచానని కోటి కవర్ చేస్తాడు. మా జీప్పు అబ్బాయి ఎలా ఉన్నాడో? బస్సు అమ్మాయి చెప్పలేదని సూరి అడుగుతాడు. మరోవైపు పార్ధుకి పెళ్లి చూపులు జరుగుతుండటంతో భువన అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది. మనం కూడా పెళ్లి చూపులకు వెళ్లి ఉంటే బాగుండేదని శాంభవితో అంటుంది భువన.
వెళ్లుంటే ఆ పెళ్లిచూపుల్ని ఏదో ఒక అడ్డుపుల్ల వేసి ఆపేసేవాళ్లమని, ఇంతలో పనిమనిషి వచ్చి వాళ్లిద్దరికి కాఫీ ఇస్తాడు. ఇంట్లో వాళ్లంతా పెళ్లి చూపులకు ఎక్కడికి వెళ్లారని అతనిని శాంభవి అడుగుతుంది. తాగుబోతు కోటిగాడు ఉన్నాడు కదా వాళ్లమ్మాయి భానుమతిని చూడటానికి వెళ్లాడని అతను చెప్పేసరికి శాంభవి, భువనలు షాక్ అవుతారు. నా కాలి గోటికి కూడా సరిపోనిదాన్ని ఈ ఇంటి కోడలిగా చేయడానికి వెళ్లారని భువన రగిలిపోతుంది. ఇది నాకు ఘోర అవమానమని , మా అన్నతోనే తేల్చుకుంటానని కూతురితో చెబుతుంది శాంభవి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











