Bhanumathi March 27th Episode: బరితెగించిన భువన, పార్ధుపైనే భానుమతి ఆశలు .. శక్తి డ్రామా పసిగట్టిన శాంభవి
పార్ధు నచ్చాడో లేదో చెప్పమని భానుమతిని అడుగుతారు బలరామ్ కుటుంబ సభ్యులు. ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, నీకు నచ్చితేనే పెళ్లి చేస్తానని అంటాడు బలరామ్. తల్లిదండ్రుల వంక చూసి పెళ్లికి ఒప్పుకుంటుంది భానుమతి. ఇప్పటిదాకా వీళ్లద్దరి పేర్లు ఒకరికొకరు తెలుసుకోలేదని సూరి చెప్పడంతో పార్ధు - భానుమతిలు తమ పేర్లు చెప్పుకుంటారు. ఇంటికి వెళ్లేముందు కోటిని బలరామ్ పక్కకి పిలిచి అమ్మాయి ఎంత వరకు చదువుకుందని అడుగుతాడు. ఇంటర్ పూర్తి చేసి డాక్టర్ చదవడానికి ఏదో పరీక్ష కోసం ప్రిపేర్ అవుతోందని చెబుతాడు కోటి. చదివినంత వరకు చాలని అక్కడితో ఆపించాలని చెబుతాడు బలరామ్.
ఇంటికి వెళ్లేసరికి శాంభవి - భువనలు బలరామ్‌పై మండిపడతారు. ఆ తాగుబోతు కూతురి కంటే నా కూతురికి ఏం తక్కువ అని నిలదీస్తుంది . నాకు పరువు ప్రతిష్టలు ముఖ్యమేనని కానీ నా కొడుకు సంతోషం అంతకంటే ఎక్కువని చెబుతాడు బలరామ్. నాకు పెళ్లొద్దని నేను చదువుకుంటానని కోటి దగ్గరికి వెళ్లి అడుగుతుంది .. దానికి మండిపడ్డ కోటి చెప్పిన మాట వినకుంటే మీ అమ్మను చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. పార్ధుకి చెప్పి పెళ్లి ఆపించాలని అనుకుంటుంది భానుమతి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 27వ తేదీ ఎపిసోడ్ 16లో ఏం జరిగిందంటే?

నాన్నని బతిమలాడినా ఒప్పుకోడని.. పెళ్లి కొడుకు దగ్గరికే వెళ్లి విషయం చెప్పమని భానుమతికి సలహా ఇస్తుంది వసు. జీపబ్బాయి చాలా మంచోడని, నేను చెబితే సరేనంటాడని ఎలాగైనా జీపబ్బాయిని కాలవాలని చెబుతుంది భానుమతి. తను ఇష్టపడిన భానుతో పెళ్లి కుదరడంతో పార్ధు కలలు కంటూ ఉంటాడు. భానుమతి అందాన్ని , ఆమె కళ్లను గుర్తుచేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు పార్ధు. ఇంతలో పార్ధుని వెతుక్కుంటూ రాత్రిపూట విశ్వనాథం ఇంటికి వస్తుంది భానుమతి. పార్ధు కోసం ఇళ్లంతా వెతుకుతూ ఉంటుంది. పార్ధు రూమ్ దగ్గరికి వచ్చి అతనిని పిలుస్తుంది.
అంత రాత్రిపూట తనను వెతుక్కుంటూ వచ్చిన భానుమతిని చూసి పార్ధు సంబరపడిపోతాడు. నా కోసం ఏమైనా చెప్పాలని వచ్చావా అని అడుగుతాడు. దానికి ఆమె అవును అంటుంది. నాకు కూడా నీ నోటి నుంచి ఆ మాటలు వినాలని చాలా ఆతృతగా ఉందని చెబుతాడు పార్ధు. నేనేం చెబుతానని ఈయన ఊహిస్తున్నారని భానుమతి అనుకుంటుంది. ఇంతలో శాంభవి, భువనలు మాట్లాడుకుంటూ అటుగా వస్తారు. మనం కనుక తొందరపడకుంటే పార్ధు భావకి భానుమతితో పెళ్లి జరిగిపోతుందని శాంభవితో అంటుంది భువన. ఈసారి నేను వేసే ప్లాన్‌తో పార్ధుని నీకే ఇచ్చి పెళ్లి చేయాలని మా అన్నయ్య నిర్ణయం తీసుకునేలా ఉండాలని చెబుతుంది శాంభవి.
పార్ధుకి ఏదో చెప్పబోతుండగా భువన- శాంభవిలను చూసి ఆగిపోతుంది భానుమతి. వాళ్లని చూసి భయపడ్డ భాను రేపు చెబుతానని వెళ్లిపోతుంది. అసలు భానుమతి ఎందుకొచ్చింది? నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి వచ్చిందా? అని అనుకుంటూ ఉంటాడు పార్ధు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఇంగ్లీష్‌లో చెబితే.. నేను తిరిగి ఏం చెప్పాలని ఆలోచిస్తాడు. సూరిని అడిగితే మంచి ఐడియా ఇస్తాడని అనుకుంటాడు. భానుమతి కోసం ఉదయాన్నే రెడీ అవుతాడు పార్ధు. నిన్ను చూస్తే భానుమతి ఐ లవ్ యూ అని చెప్పడం కాదు ముద్దు పెట్టేస్తుందని మురిసిపోతాడు .
ఇళ్లంతా ఎక్కడ చూసినా పార్ధుకి భానుమతే కనిపిస్తుంది. కనిపించకుండా నాతో ఆటలాడుతోంది? అటు తిరిగితే వెళ్లిపోతుందని అంటాడు. వెనుక నుంచి ఎవరో తనను వాటేసుకున్నట్లుగా కనిపించడంతో సంబరపడిపోతుంటాడు పార్ధు. ఇంతలో ఐ లవ్ యూ బావా అంటూ భువన వాయిస్ వినిపించడంతో పార్ధు షాక్ అవుతాడు. మనసులో రోజు రోజుకి నీమీద పెరుగుతున్న ప్రేమ బరువుని మోస్తూ తిరగలేకపోతున్నానని.. పంచుకుంటే కాస్తయినా ఆ భారం తీరుతుందని చెప్పానని అంటుంది భువన.
నీ మనసులో ప్రేమ పంచుకోవడానికి నేను నీకు కరెక్ట్ కాదని తేల్చిచెబుతాడు పార్ధు. ఆ మాటలు నిన్ను ప్రేమించిన అమ్మాయి గుండెని ఎంత బాధపెడతాయో నీకు అర్ధం కావడం లేదని అంటుంది భువన. లేని ప్రేమను ఉన్నట్లుగా నటించడం నా వల్ల కాదని అంటాడు పార్ధు. నిన్ను మరిచిపోవడం నా వల్ల కాదని , వద్దు అనగానే వదిలేస్తే ఆ ప్రేమకు విలువ ఏముంటుందని చెబుతుంది భువన. ప్రేమ అనేది ఒకరి మనసులోనే ఉంటే సరిపోదు.. ఇద్దరి మనసుల్లో ఉంటేనే ఆ ప్రేమకు అర్ధమని చెబుతాడు పార్ధు. నువ్వు చిన్నప్పటి నుంచి నాకు అత్త కూతురివి మాత్రమేనని అంతకుమించి ఏం లేదని అంటాడు.
నేను కూడా అందరి లాంటి ఆడపిల్లనేనని.. నా మనసు కూడా అందరి ఆడపిల్లల్లాగే ఉంటుందని, మరి నా మీద నీకు ఎందుకు మనసు కలగడం లేదని ప్రశ్నిస్తుంది భువన. చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూ పెరిగానని, నిన్ను ఒక స్నేహితురాలి లాగానే చూశానని.. అంతేకానీ నీతో సంసారం చేసి పిల్లలని కనాలని నాకు లేదని అంటాడు పార్ధు. నా ప్రేమ గురించి తెలియక నువ్విలా మాట్లాడుతున్నావ్ కానీ , నా ప్రేమ గురించి తెలిసిన రోజున నువ్వలా మాట్లాడవని పార్ధుని హగ్ చేసుకుంటుంది. దాంతో మండిపడ్డ పార్ధు ఆమె మీదకి చేయ్యెత్తుతాడు.
ఆడపిల్లవని గౌరవం ఉంది కాబట్టి ఆ చేయి అక్కడే ఆగిందని హెచ్చరిస్తాడు పార్ధు. ఇంతలో సూరి వచ్చి ఏమైందని అడుగుతాడు. భువన చిన్నప్పటి నుంచి నీతో ప్రేమలో పడిపోయిందని దాంట్లో నుంచి బయటికి రావడానికి టైం పడుతుందని అంటాడు సూరి. పార్ధు తనని పెళ్లి చేసుకోనని చెప్పడంతో భువన ఏడుస్తుంటుంది. అది చూసి శాంభవి కూడా బాధపడుతుంది. నీ విలువ పార్ధుకి తెలిసేలా చేయాలని, అలాంటి పరిస్ధితి నేను కల్పిస్తానని కూతురికి నచ్చజెబుతుంది. వాళ్ల మాటలు విన్న శక్తి.. ఏం జరిగిందని అడుగుతుంది. భువన ఏదో చెప్పబోతుండగా శాంభవి ఆపి లోపలికి తీసుకొస్తుంది.
శక్తి అత్తకి ఏం జరిగిందో చెబితే ఏమవుతుందని అడుగుతుంది భువన. శక్తిలో మార్పు వచ్చిందని, మనకు అండగా ఉన్నట్లు నటిస్తూనే పార్ధుకి సాయం చేస్తోందని చెబుతుంది శాంభవి. ఇంతలో శక్తి కూతురు వచ్చి ఏం జరిగిందని అడగ్గా.. శాంభవికి నా మీద నమ్మకం తగ్గుతున్నట్లు అనిపిస్తోందని చెబుతుంది. శాంభవి కొన్ని విషయాలు దాయడానికి ప్రయత్నిస్తోందని.. అయినా మనకి పోయేదేం లేదని అంటుంది. పార్ధుని , భువనని కలపడానికి శాంభవి చేసే ప్రయత్నాలను మనం అడ్డుకోవాలని చెబుతుంది శక్తి. పార్ధు ఖచ్చితంగా ఆ భానుమతిని పెళ్లి చేసుకోవాలని.. వాళ్లు మన కాళ్ల కింద చెప్పుల్లా బతకాలని అంటుంది.
పుస్తకాలు కనిపించక కంగారుపడి ఇళ్లంతా వెతుకుతుంది భానుమతి. మళ్లీ నాన్న నా పుస్తకాలు అమ్మేసి తాగడానికి వెళ్లాడా అని డౌట్ పడుతుంది . బయటికి వెళ్లి చూసేసరికి కోటి పుస్తకాలు తగలబెడుతూ కనిపిస్తాడు. నా పుస్తకాలు కాల్చొద్దని కోటిని బతిమలాడుతుంది భానుమతి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











