Bhanumathi March 28th Episode: పార్ధు పెళ్లికి ముహూర్తం.. భానుమతిపై కోటికి అనుమానం, రంగంలోకి కుమారి
తండ్రి తనను చదువుకోనివ్వకుండా పెళ్లి చేస్తుండటంతో పార్ధుకి చెప్పి పెళ్లి ఆపించాలని అనుకుంటుంది భానుమతి. అర్ధరాత్రి పూట విశ్వనాథం ఇంటికి వెళ్లి పార్ధుని పిలుస్తుంది. పార్ధుకి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేలోపు అటుగా శాంభవి - భువన రావడం గమనిస్తుంది. నేను రేపు చెబుతానని పార్ధుకి చెప్పి వెళ్లిపోతుంది భానుమతి. బస్సు అమ్మాయి ఊహల్లో గడిపేస్తున్న పార్ధుని వెనుక నుంచి వచ్చి పట్టుకుంటుంది భువన. దీంతో షాకైన పార్ధు.. నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదని ఇలాంటి పనులు చేయొద్దని కొట్టబోతాడు.
ఏడుస్తూ బయటికొచ్చిన భువనని చూసి బాధపడుతుంది శాంభవి. ఆ పార్ధుకి నీ విలువ తెలిసేలా, నువ్వే జీవితం అయ్యేలా నేను చేస్తానని కూతురికి చెబుతుంది. ఇంతలో శక్తి అక్కడికొచ్చి ఏం జరిగింది? భువన ఎందుకు ఏడుస్తుందని అడుగుతుంది. శక్తికి భువన ఏదో చెప్పబోతుండగా శాంభవి అడ్డుకుని రూమ్‌లోకి తీసుకెళ్తుంది. శక్తి ఎప్పుడో పార్టీ మార్చేసిందని ఆమె ఇప్పుడు పార్ధు మనిషని కూతురికి చెబుతుంది శాంభవి. నా మీద శాంభవికి అనుమానం వచ్చిందని.. భువన- పార్ధులని ఒక్కటి చేసేలా ఆమె చేసే ప్రయత్నాలను అడ్డుకుంటానని శక్తి తన కూతురితో చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 28వ తేదీ ఎపిసోడ్ 17లో ఏం జరిగిందంటే?

పుస్తకాలు కాల్చేస్తోన్న తండ్రిని ఆపాలని చూస్తుంది భానుమతి. కానీ కోటిగాడు ఆమె చెప్పేది వినిపించుకోకుండా వాటిని మంటల్లో వేస్తాడు. నీకు పెళ్లి కుదిరిపోయింది.. ఇంకా పుస్తకాలు, పాఠాలు అన్నావంటే నా విశ్వరూపం చూస్తావని భానుమతిని హెచ్చరిస్తాడు కోటి. సింహాసనంపై మహారాణిలా కూర్చొనే అదృష్టం వస్తే ఇంకా సేవకురాలిగా చదువుకుంటాను, సాధిస్తాను అంటావా అని మండిపడతాడు. నాకు చదువుకోవడం అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా.. ఈ పెళ్లితో చదువుకోవాలనే నా కోరికను చంపొద్దని బతిమలాడుతుంది భానుమతి.
ప్రమీలను పిలిచి అదృష్టం తలుపు తడుతుంటే.. వద్దని వెళ్లిపోతుందని నువ్వయినా చెప్పమని అంటాడు కోటి. నువ్వు ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుకున్నావే అందుకే కోట్లకు పడగెత్తిన వాడు నీకు మొగుడు అవుతున్నాడని, ఒక్కసారి అదృష్ట లక్ష్మీని కాదని కాలదన్నుకుంటే ఆ తర్వాత దరిద్ర దేవత నీ నెత్తి మీదకెక్కి తాండవం ఆడుతుందని మండిపడుతుంది కుమారి. ఇప్పటి వరకు నీ తండ్రిని ఒక తాగుబోతుగానే చూశావ్.. అనవసరంగా హంతకుడిని చేయొద్దని చెప్పి ప్రమీల పీక పట్టుకుంటాడు కోటి. నేను గొప్ప చదువులు చదివి, గొప్ప స్థాయికి వెళ్లాలని నువ్వు కోరుకున్నావ్ కదా అని అంటుంది భానుమతి.
ఇప్పుడు నా కలలన్నీ ఆ కట్టెల పొయ్యిలో కాలిపోతుంటే .. చూస్తూ ఎందుకు ఊరుకున్నావని తల్లిని అడుగుతుంది భానుమతి. నా జీవితం ఈ కట్టెల పొయ్యికే అంకితమైపోయిందని, మీ నాన్న పెట్టే బాధలు భరించడానికే సరిపోయిందని.. నీ జీవితం కూడా అలా కాకూడదనే నీకు గొప్ప జీవితం రావాలని కోరుకున్నానని అంటుంది ప్రమీల. కానీ నువ్వు పెద్ద పెద్ద చదువులు చదవకుండానే , గొప్ప ఉద్యోగాలు తెచ్చుకోకుండానే , నీకొక అద్భుతమైన జీవితం రాబోతుందని అంటుంది.
ఆ పెద్దింటికి నువ్వు కోడలిగా వెళితే.. నాలాగా ఇన్ని బాధలు పడే పరిస్ధితి ఉండదని చెబుతుంది ప్రమీల. మీ నాన్న చెప్పినట్లు ఆ చదువుల సంగతి వదిలేయమని తేల్చిచెబుతుంది, నా బాధను అర్ధం చేసుకోమని భానుమతితో చెబుతుంది ప్రమీల. పుస్తకాలు కాలిపోవడంతో పాటు ప్రిన్సిపాల్ ఇచ్చిన పెన్ను కాలిపోవడంతో భానుమతి బాధపడుతుంది. దేవుడి పాదాల దగ్గర ఈ పెన్నును ఉంచిన రోజును తలచుకుంటూ ఏడుస్తుంది.
పెళ్లికి సంబంధించిన పనుల గురించి పంతులు గారితో మాట్లాడుతుంటాడు బలరామ్. పార్ధు బయటికి వెళ్తుండగా శారద వచ్చి నాన్నగారు పిలుస్తున్నారని చెబుతుంది. ఆ విషయం నాన్నగారే చెబితే సరిపోయేదని, ఇంట్లో అనవసరమైన వాళ్ల చేత ఈ రాయబారాలు ఎందుకు అంటాడు. ఆ మాటలతో శారద బాధపడుతుంది. పార్ధు బయటికొచ్చి చూసేసరికి కుటుంబమంతా మాట్లాడుకుంటూ ఉండటంతో షాక్ అవుతాడు. శారద కళ్లలో కన్నీరు కనిపించడంతో బలరామ్‌కి అనుమానం వస్తుంది.
నీ పెళ్లి ఈ ఊరిలో చేయాలా? మన ఊరిలో చేయాలా? అనే దాని గురించి మాట్లాడుకుంటున్నామని.. నువ్వేం అంటావని పార్ధుని అడుగుతాడు బలరామ్. మీ నిర్ణయం ఏదైనా నాకిష్టమని అంటాడు పార్ధు. నీ పెళ్లి జరగాలనే ఉద్దేశంతో రాములవారి కళ్యాణం జరిపించానని.. ఆయన ఆశీస్సులతోనే పెళ్లి కుదిరింది కాబట్టి, ఆయన సమక్షంలోనే ఈ ఊళ్లోనే నీ పెళ్లి జరిపిస్తేనే బాగుంటుందని అంటాడు బలరామ్. అమ్మాయివాళ్లది కూడా ఈ ఊరే కాబట్టి వాళ్ల రాకపోకలకు ఏ ఇబ్బంది ఉండదని చెబుతాడు.
నీ నిర్ణయం మా అందరికీ బాగా నచ్చిందని, ఇంకేమీ ఆలోచించకుండా పెళ్లికి ముహూర్తం పెట్టించమని అంటాడు విశ్వనాథం. వచ్చే నెల 6వ తేదీన బ్రహ్మాండమైన ముహూర్తం ఉందని పంతులుగారు చెబుతాడు. చాలా రోజుల తర్వాత మన ఇంట్లో జరుగుతున్న శుభకార్యమని , మన స్థాయికి తగ్గట్లు ఘనంగా చెయ్యాలని చెబుతాడు దుర్గ. ఆవన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలని అంటాడు బలరామ్. బాబాయ్‌కి తోడుగా నువ్వుండమని ధర్మకి చెబుతాడు . ఇంట్లో వాళ్లంతా ఆనందంగా ఉండటం చూసి శాంభవి, భువనలు రగిలిపోతుంటారు. 6వ తేదీ వరకు టైముంది ఆ లోపు ఏమైనా జరగొచ్చని కూతురితో అంటుంది శాంభవి.
కాలిపోయిన పెన్నుని చూస్తూ బాధపడుతుంది భానుమతి. నా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని అధిగమించి నా ఆశయాన్ని నేను సాధించాలని అంటుంది. జీపు అబ్బాయిని గుడిలో కలిసి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పమని భానుమతితో అంటుంది వసు. ఈరోజు ఎలాగైనా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఆ జీపు అబ్బాయికి చెప్పేస్తానని వెళ్తుంది. కుమారి తమలపాకుకు సున్నం రాసుకుంటూ ఉండగా కోటి వచ్చి ఇలాంటి ఆకులు వద్దని అంటాడు. మనం కోటీశ్వరుల ఇంటికి వియ్యంకులం అవుతున్నామని అంటాడు. మనకి కూడా 100 ఎకరాలు రాస్తానన్నారా? ఏంటీ అంటుంది కుమారి. ఆశకి హద్దుండాలని.. మన అమ్మాయిని వాళ్ల కోడలిగా చేసుకోవడమే గొప్ప, అంతకంటే ఎక్కువగా ఆశించొద్దని అంటుంది ప్రమీల.
భానుమతి- వసులు బయటికి వెళ్తుండటంతో కోటి అడిగి ఎంక్వైరీ చేస్తాడు. దాని చదువుని, కలల్ని లాగేసుకున్నావ్.. ఇప్పుడు స్వేచ్ఛని కూడా లాక్కుంటావా అంటూ మండిపడుతుంది ప్రమీల. తల్లి చెప్పడంతో ఆనందంతో భానుమతి, వసులు గుడికి వెళ్తారు. కోటికి, కుమారికి డౌట్ వచ్చి నేను కూడా మీతో పాటు గుడికి వస్తానని అంటుంది కుమారి. నీకు అసలే మోకాళ్ల నొప్పి అని అనడంతో నీ కూతురికి మొదటిసారి నా మోకాళ్ల నొప్పులు గుర్తొచ్చాయంటే నాకు ఎక్కడో తేడా కొడుతోందని అంటుంది కుమారి.
పార్ధు ఇష్టపడుతున్న అమ్మాయితో పెళ్లి ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగేలా చూడామని దేవుడికి దండం పెట్టుకుంటుంది శారద. ఇంతలో బలరామ్ వచ్చి నీకేం కావాలో చెప్పలేదని అంటుంది. నన్ను, నా నిర్ణయాలని ఎన్నోసార్లు సరిదిద్దావని చెబుతాడు బలరామ్. పార్ధు, భానుమతిని ఇష్టపడ్డాడని తెలియగానే నేను నా పరువు గురించి మాత్రమే ఆలోచించావని.. కానీ నువ్వు పార్ధు ప్రేమ గురించి ఆలోచించావని అంటాడు. ఆ మనుషుల ముందు నా పెద్దరికం ఓడిపోకూడదని నేను అనుకున్నానని.. పార్ధు ప్రేమను గెలిపించాలని నువ్వు అనుకున్నావని అంటాడు. పార్ధు జీవితం గురించి ఇంతగా ఆలోచిస్తున్నావ్.. వాడు కూడా నీ గురించి ఆలోచిస్తే బాగుండేదని చెబుతాడు బలరామ్.
నేను పార్ధుని కనకపోయినా.. కన్నతల్లిలాగే నా కడుపులో పెట్టుకుని చూసుకున్నానని అంటుంది శారద. కానీ పార్ధు అభిమానం, వాడు ఇష్టపడే మనుషుల్లో నాకు స్థానం దక్కలేదని బాధపడుతుంది. పార్ధు అందరి గురించి ఆలోచిస్తాడని, మరి నిన్నేందుకు దూరం పెడుతున్నాడో అర్ధం కావడం లేదని అంటాడు బలరామ్. ఏదో ఒక రోజు వాడికి తను చేసిన తప్పు అర్ధమవుతుందని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











