Bhanumathi May 1st Episode : బలరామ్ ఉగ్రరూపం .. భానుమతికి అమ్మలా శారద, స్వాతిని ట్రాప్ చేస్తోన్న చరణ్
భానుమతికి తన తల్లిని పరిచయం చేసిన పార్ధు ఈ ఇంట్లో ఈవిడ మాత్రమే నీకు అత్తగారని చెబుతాడు. ఆ మాటలు విన్న బలరామ్, శారదలు బాధపడతారు. అత్తయ్యని పార్ధుగారు అమ్మగా అంగీకరించడం లేదని భానుమతి అర్ధం చేసుకుంటుంది. ఇంటికి తాగొచ్చిన భర్తను చూసి ప్రమీల మండిపడుతుండగా ఇరుగుపొరుగు వచ్చి రేపో మాపో మీరు కూడా కోటీశ్వరులు అయిపోతారని అనడంతో ప్రమీల రగిలిపోతుంది. నీ అత్యాశతో భానుమతి కాపురాన్ని నాశనం చేయొద్దని కోటికి వార్నింగ్ ఇస్తుంది ప్రమీల.
పార్ధుతో పెళ్లి కాకపోవడంతో భువన బాధపడుతుండటాన్ని చూసిన శారద.. అందరూ పూలు గుచ్చుతున్నారు, నువ్వు కూడా రా అని చెప్పి తీసుకెళ్తుంది. భువనకి పూలు గుచ్చడం రాకపోవడంతో భానుమతి చూపిస్తుంది. దాంతో భువన మరింత రగిలిపోతుంది. ఇంతలో సూది గుచ్చుకుని భానుమతి బాధపడుతుండగా పార్ధు కంగారు పడతాడు. పెళ్లి ఆపిన అమ్మాయి ఎవరో తెలిసిందా అని నాయనమ్మ అడగటంతో ఆ ప్రయత్నంలోనే ఉన్నానని చెబుతాడు పార్ధు. ఆ మాటలతో భానుమతి, భువనలు వణికిపోతారు.

ఉదయాన్నే తులసి కోట వద్ద ప్రదక్షిణలు చేస్తుంది శారద. ఇంతలో భానుమతి నిద్ర లేచి వచ్చి గుమ్మం దగ్గరే కూర్చొని పడుకుంటుంది. సత్యనారాయణ వ్రతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా చూడమని దండం పెట్టుకుంటుంది శారద. కొత్త జంట పదికాలాల పాటు చల్లగా ఉండేలా చూడమని కోరుకుంటుంది. మెట్ల మీద పడుకున్న భానుమతిని చూసి షాకైన శారద.. ఇక్కడ పడుకున్నావేంటీ? అని ప్రశ్నిస్తుంది. రాత్రి సరిగా నిద్రపట్టలేదని, అమ్మమ్మ గారి గురక దెబ్బకి నిద్రపట్టలేదని అంటుంది. వ్రతానికి టైం అవుతోందని త్వరగా రెడీ అవ్వమని భానుమతితో చెబుతుంది శారద.
బలరాం దగ్గర సంతకం తీసుకోవడానికి కానిస్టేబుల్ వస్తున్నట్లు పార్ధు చెప్పడంతో బలరాం రగిలిపోతాడు. దీంతో ఏం జరిగిందోనని కుటుంబ సభ్యులంతా కిందకి పరిగెత్తుకొస్తారు. ఏం జరిగిందని దుర్గ అడగ్గా సంతకం చేయించుకోవడానికి కానిస్టేబుల్ వస్తున్నట్లు పార్ధు చెబుతాడు. ఇంతలో కానిస్టేబుల్ వచ్చి మీ సంతకం కావాలని అడుగుతాడు. బలరాం కోపంగా ఫైల్ మీద సంతకం చేస్తాడు. నేను బెయిల్ మీద పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రాగలిగానని, కానీ నా మీద పడిన మచ్చ మాత్రం పోలేదని , నేను చట్టం ముందు దోషినే అని ఈ పేపర్ మీద పెట్టే సంతకం నాకు గుర్తు చేస్తూనే ఉందని రగిలిపోతాడు బలరామ్.
నేను దోషిని కాదని నిరూపణ అవ్వాలని.. నేను తప్పు చేయలేదని చట్టం నన్ను నమ్మాలని చెబుతాడు బలరామ్. చట్టానికి ఆ నమ్మకం రావాలంటే, ఆ రోజు పెళ్లి ఆపడానికి పోలీసులకు ఫోన్ చేసిన అమ్మాయెవరో నాకు తెలియాలని పార్ధుతో అంటాడు. ఆ మాటలతో భువన, భానుమతి, శాంభవిలు టెన్షన్ పడతారు. నాకు అవసరం వచ్చినప్పుడు ఆ నిజాన్ని నేనే బయటపెడతానని భానుమతిని చూసి అనుకుంటుంది శక్తి. అప్పటి వరకు నువ్విలా భయపడుతూనే ఉండాలని అనుకుంటుంది. ఆ రోజు పెళ్లి ఆపడానికి పోలీసులకు ఫోన్ చేసింది భానుమతేనని తెలిస్తే .. భానుమతిని వీళ్లు ఖచ్చితంగా బతకనివ్వరని కానిస్టేబుల్ కూడా భయపడతాడు.
మీకు తలవంపులు తెచ్చిన మనిషిని, మీకు జనాల్లో తల ఎత్తుకోకుండా చేసిన మనిషిని నేను ఎట్టి పరిస్ధితుల్లోనూ వదిలిపెట్టనని ఆ అమ్మాయి ఏ మూలన ఉన్నా తెచ్చి మీ కాళ్ల దగ్గర పడేస్తానని కోపంగా చెబుతాడు పార్ధు. అప్పుడు తనకు బుద్ధే చెబుతారో, బతుకే లేకుండా చేస్తారో మీ ఇష్టమని అంటాడు పార్ధు. ఆ మాటలతో భువన, భానుమతి, శాంభవిలు వణికిపోతారు. వెన్నుపోటు పొడిచిన దానిని కళ్ల ముందు పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నారని అనుకుంటుంది శక్తి. భానుమతి అదృష్టం బాగుంది కాబట్టి దాని బాగోతం భయపడలేదని , ఇంకెంత కాలం దీని గుట్టు దాగుతుందో చూద్దామని అనుకుంటుంది.
నేను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినప్పటి నుంచి నన్ను ఈ నింద వెంటాడుతూనే ఉందని, దాని నుంచి బయటపడితే కానీ నాకు మన: సాక్షి లభించదని పార్ధుతో అంటాడు బలరామ్. ముప్పు తప్పిపోయిందని అనుకున్నానని.. కానీ బుస కొట్టే పాములా పక్కనే ఉందని వణికిపోతుంది భువన. ఆ రోజు నా వల్లే పెళ్లి ఆగిందని తెలిస్తే పార్ధు బావ నన్ను నరికి పోగులు పెట్టేస్తాడని అనుకుంటుంది. నేను నిర్దోషినని చట్టం నమ్మే వరకు ఈ ఇంట్లో నాకు ప్రశాంతత దొరకదని రగిలిపోతాడు బలరామ్. వీలైనంత త్వరగా ఆ అమ్మాయెవరో తెలుసుకోమని పార్ధుకి చెబుతాడు.
ఆ అమ్మాయి ఎంత కాలం మన కళ్లు కప్పి తిరుగుతుంది? ఎంతకాలం మనకి దొరక్కుండా తప్పించుకుంటుంది? అతి త్వరలోనే మన చేతికి చిక్కుతుందని అంటాడు పార్ధు. నిప్పులాంటి నిజాన్ని నా అరచేతుల్లో ఎంతకాలం దాచగలను, దీనికి ఏదో ఒక పరిష్కారం వెతకాలని అనుకుంటుంది భానుమతి. కానిస్టేబుల్ వెళ్లగానే భానుపై రగిలిపోతుంది బలరామ్ తల్లి. ఏనాడైతే నీతో పెళ్లి పెట్టుకున్నామో, ఆనాడే నా కొడుకు పరువు పోయిందని , అప్పటి నుంచి ఈ ఇంటికి దరిద్ర్యం చుట్టుకుందని అంటుంది.
ఆ మాటలు విన్న బలరామ్ .. ఏ పాపం ఏరుని ఆ అమ్మాయి మీద ఎందుకు నిందలు వేస్తున్నావు, కోడలి కన్నీరు కుటుంబానికి మంచిది కాదని , భానుమతిని ఏమీ అనొద్దని చెప్పి వెళ్లిపోతాడు. నా చుట్టూ ఉన్నవాళ్లంతా మంచి మనుషులేనని, కానీ నాకు మాత్రం ముళ్ల పొదల మధ్య నిలబడినట్లు అనిపిస్తుందని అనుకుంటుంది భానుమతి. వ్రతానికి తనను రెడీ చేస్తుండగా నేను రెడీ అవుతానని శారదతో అంటుంది భానుమతి. నువ్వు నా కూతురి లాంటి దానివని చెప్పడంతో, కోడళ్లతో అత్తలు ఇలాగే ఉంటారా అని శారదని అడుగుతుంది భానుమతి.
సీరియల్స్‌లో, సినిమాల్లో ఉన్నట్లుగానే బయట కూడా అత్తలంతా ఉండరని శారద చెప్పడంతో ఇంత మంచి మనుషుల్ని నేను ఇబ్బంది పెట్టానని బాధపడుతుంది శారద. నా స్వార్ధం గురించి ఆలోచించాను కానీ, వీళ్లు ఏమైపోతారోనని ఆలోచించలేదని అనుకుంటుంది భానుమతి. తర్వాత భానుతో కలిసి శారద కిందకి వెళ్తుండగా కోటి, ప్రమీల, కుమారి, వసులు వస్తారు. కూతురిని చూసి వాళ్లు మురిసిపోతారు. అప్పుడే కూతురిపైన బెంగ పెట్టుకున్నావా? అని శారద అడగ్గా.. నా కూతురిని తల్లిలాగే చూసుకుంటున్నారని అంటుంది ప్రమీల.
అందరూ సంతోషంగా ఉంటే మనకెందుకు ఈ చాకిరి అంటూ తల్లితో చెబుతుంది భువన. మనం కూడా సంతోషపడే సమయం ఏదో ఒక రోజు వస్తుందని అంటుంది శాంభవి. ఇంతలో పనిపిల్ల స్వాతి అందంగా రెడీ అవ్వడంతో వాళ్లకి డౌట్ వస్తుంది. ఎందుకిలా రెడీ అయ్యావని భువన అడగ్గా.. పూజ ఉందని ఇలా రెడీ అయ్యానని స్వాతి చెప్పడంతో, పనిమనిషివి పనిమనిషిలా ఉండమని వార్నింగ్ ఇస్తుంది. త్వరలోనే నేను కూడా ఈ ఇంటికి కాబోయే కోడలినని మనసులో అనుకుంటుంది స్వాతి. ఫ్లోర్ క్లీన్ చేస్తున్న స్వాతి దగ్గరికి చరణ్ రావడంతో ఆమె కంగారు పడుతుంది.
ప్రపంచంలో ఉన్న పని అమ్మాయిల్లో నీ అంత అందమైన పని అమ్మాయిని ఎక్కడా చూడలేదని అంటాడు చరణ్. ఇంట్లో వాళ్లంతా నన్ను పని అమ్మాయిలా చూసినా పర్లేదు కానీ మీరు కూడా నన్ను అలాగే చూస్తున్నారా? ప్రేమించిన అమ్మాయిలాగా చూడటం లేదా? అని ప్రశ్నిస్తుంది స్వాతి. ఈ ఇంటి కోడలు అనే స్థానం మీరెప్పుడు ఇస్తారు అనుకుంటే నన్ను పనిపిల్లలాగే చూస్తున్నారని బాధపడుతుంది. నిజంగా మన పెళ్లి జరుగుతుందా? నేను ఈ ఇంటి కోడలిని అవుతానా? అని ప్రశ్నిస్తుంది స్వాతి. ఇంతలో వేదవతి ఆ ఇంటికి వస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











