Bhanumathi May 7th Episode : పార్ధు ఉగ్రరూపం.. వణికిపోయిన భానుమతి, శారదలో అనుమానం
భానుమతి కవితలు చెబుతుండగా పార్ధు నిద్రొచ్చి పడుకుంటాడు. ఆ కాసేపటికీ భానుమతి కూడా చాప వేసుకుని నేలపై పడుకుంటుంది. అర్ధరాత్రి నేలపై పడుకున్న భార్యను చూసిన పార్ధు షాక్ అవుతాడు. ఆమెను మంచం పడుకోమని చెప్పగా.. నా మీద కాళ్లు వేయకుంటేనే పడుకుంటానని భానుమతి చెప్పడంతో పార్ధు సరేనని అంటాడు. ఉదయాన్నే భానుమతి నిద్రలేవక పోవడంతో బలరామ్ తల్లి మండిపడుతుంది. శక్తి, శాంభవిలను పంపి భానుమతిని తీసుకురమ్మని చెబుతుంది.
డోర్ కొట్టిన అలికిడి వినిపించడంతో పార్ధు ఉలిక్కిపడి లేస్తుండగా అతని లాకెట్‌కు భానుమతి తాళి ఇరుక్కుంటుంది. భార్య నిద్ర డిస్ట్రబ్ కాకుండా దానిని తీస్తాడు పార్ధు. బాత్‌రూమ్‌లో భానుమతి షవర్ తిప్పడంతో నీళ్లు ఆమెపై పడతాయి. అది ఎలా ఆపాలో తెలియక గట్టిగా అరవడంతో పార్ధు కంగారుగా వెళ్లి ఆమెను పట్టుకుంటాడు. మనకి ఫస్ట్ నైట్ జరగలేదని తెలిస్తే ఇంట్లో వాళ్లు కోప్పడతారని .. భానుమతికి ఏం చేయాలో చెబుతాడు పార్ధు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 7వ తేదీ ఎపిసోడ్ 51లో ఏం జరిగిందంటే?

శోభనం జరగకపోయినా జరిగిందని ఇంట్లో వాళ్లని నమ్మించేలా భానుమతికి ట్రైనింగ్ ఇస్తాడు పార్ధు. భానుమతి తాను చెప్పినట్లు చేయడంతో పార్ధు సంతోషిస్తాడు. నెయిల్ పాలిష్ వేసుకుంటున్న భువన దగ్గరికి వచ్చి శాంభవి కూర్చొంటుంది. ప్రపంచం రేపే ఆగిపోతుంది అన్నట్లు అంతలా ఆలోచిస్తున్నావేంటీ? అని తల్లిని అడుగుతుంది భువన. ప్రపంచం ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు కానీ మన ప్రయాణం మాత్రం ఇక్కడే ఆగిపోకూడదని అంటుంది శాంభవి. ప్రతి ప్రయాణం ఏదో ఒక చోట ఆగిపోవాలని, అలాగే మన పంతం, పట్టుదల అనేవి కూడా ఈరోజుతో ఆగిపోవాలేమో అంటుంది.
ఎందుకు ఆగిపోవాలని భువన అడగ్గా.. పార్ధుకి, భానుమతికి మొదటి రాత్రి కూడా ముగిసిపోయిందని.. ఇక పార్ధుతో బతకాలని ఆరాటపడటంలో అర్ధం లేదని అంటుంది శాంభవి. ప్రయాణం ఆగాలంటే ఆ ప్రయాణం ఒక సరైన గమ్యాన్ని చేరుకోవాలని, గమ్యం చేరుకోకుండా అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రయాణానికి అర్ధం ఉండదని చెబుతుంది. మన పంతం, పట్టుదల అనే ప్రయాణానికి అర్ధం పార్ధు బావ.. ఆయనతో నా పెళ్లి అంటుంది భువన. మన ప్రయాణం గమ్యం చేరేదాకా మనం ఆగకూడదని చెబుతుంది.
ఇంకా ఏ నమ్మకంతో ఇలా ఆలోచిస్తున్నావని భువనని ప్రశ్నిస్తుంది శాంభవి. నీకు, పార్ధుకి పెళ్లి జరగాలని నేను కూడా ఆశపడ్డానని ఇక ఆ అవకాశమే లేనప్పుడు ఏ నమ్మకంతో ఎదురుచూడనని ప్రశ్నిస్తుంది శాంభవి. పెద్దత్తయ్య చనిపోగానే మీ అన్నయ్య సన్యాసం తీసుకోలేదుగా.. చిన్నత్తయ్యని పెళ్లి చేసుకున్నాడు కదా అని అంటుంది భువన. ఆ మాటలతో శాంభవి షాక్ అవుతుంది. ప్రతి బంధం ఎల్లకాలం ఉండిపోదు.. ఎప్పుడు తెగిపోతుందో ఎవ్వరూ చెప్పలేరని చెబుతుంది భువన. పెళ్లి నుంచి రాగానే పార్ధు భావ.. పెద్దత్తయ్యకి నమస్కారం చేశాడు, భవిష్యత్తులో భానుమతి కొడుకు కూడా భానుమతికి అలాగే దండం పెడతాడని అంటుంది. శారద అత్తలాగే.. భానుమతి భార్య స్థానంలో నేను నిలబడి భానుమతి కొడుకు చేత భానుమతి ఫోటోకి దండం పెట్టిస్తానని అంటుంది.
నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావని మండిపడుతుంది శాంభవి. నేను పార్ధు బావని పెళ్లి చేసుకోవాలనే సంకల్పం అంత బలమైనదని, పార్ధు బావతో నేను కలిసి బతకాలనే ఆశే నన్ను నడిపిస్తుందని చెబుతుంది. ఏనాటికైనా పార్ధు బావని నేను సొంతం చేసుకుంటానని తేల్చిచెబుతుంది భువన. గదిలో నుంచి బయటికి వస్తున్న కొత్త జంటను ఇంట్లో వాళ్లంతా చూస్తారు. రాత్రి అంతా సవ్యంగానే జరిగిందా? అని శారద అడగ్గా పార్ధు వంక చూస్తుంది భానుమతి. నువ్వు పక్కకి వెళ్లు నీ ముందు చెప్పడానికి తను ఇబ్బంది పడుతోందని అంటుంది శక్తి.
ఫస్ట్ నైట్ ఎలా జరిగిందో చెప్పమని అంతా రౌండప్ చేయడంతో భానుమతి టెన్షన్ పడుతుంది. ఆమె ఏం చెబుతోందోనని పార్ధు కూడా కంగారుగా ఉంటాడు. ఇంతలో పార్ధు చెప్పిన విషయాలు గుర్తొచ్చి అలాగే చెబుతుంది భానుమతి. దాంతో అందరూ నవ్వేస్తారు. కోడికూత వినిపించగానే లేవాలని, పొద్దుపొడవక ముందే లేచి పనులు చేయాలని మీ ఇంట్లో వాళ్లు మీకు నేర్పించలేదా?అని మండిపడుతుంది బలరామ్ తల్లి. కోడలంటే ఎలా ఉండాలి? అడగకుండానే అన్ని పనులు చేసుకుంటూ రావాలని చెబుతుంది. పెద్దావిడను కిందకీ పైకి చూసిన భానుమతి ఒక్కసారిగా నవ్వేస్తుంది. దాంతో అంతా షాక్ అవుతారు. పెద్దావిడ అన్న మాటలకు బాధపడొద్దని, నేర్చుకుంటూ ఉంటే ఆవిడ కూడా నిన్ను ఏమీ అనరని భానుమతికి చెబుతుంది శారద.
పనిపిల్ల స్వాతి నడుముని పట్టుకుంటాడు చరణ్. దాంతో ఆమె షాక్ అవుతుంది. స్వాతి చేతులు పట్టుకుని నాతో కలిసి రావొచ్చు కదా అని అడుగుతాడు చరణ్. మీతో కలిసి వస్తే మీరు సరసం వరకు వెళ్తారని అంటుంది స్వాతి. మీ మగాళ్లు ఏం చేసినా లోకం తప్పుపట్టదని, కానీ మా ఆడవాళ్లు ఏం చేసినా లోకం తప్పుపడుతుందని చెబుతుంది. మీరు ఆవేశంలో ఉన్నా నేను మాత్రం హద్దుల్లోనే ఉంటానని చెప్పి వెళ్లిపోతుంది. బలరామ్ - దుర్గా మాట్లాడుకుంటూ ఉండగా కోటయ్య అనే వ్యక్తి వస్తాడు. మీకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ తెచ్చి ఇచ్చేశానని మీ చేత మళ్లీ మళ్లీ అడిగించుకోవాల్సిన ఖర్మ మాకు పట్టలేదని అంటాడు కోటయ్య.
అతను ఇచ్చిన డబ్బును చూసిన పార్ధు.. అప్పు తీరిపోయిందా? అని అడుగుతాడు. గతేడాది నీ కూతురికి ఒంట్లో బాలేదని మూడు వాయిదాలు కట్టలేదని, దాని గురించి మరిచిపోయావా? అని నిలదీస్తాడు. సంక్రాంతి పండక్కి అల్లుడు వచ్చాడని, బైక్ కొనాలని ఇంకో రెండు వాయిదాలు ఎగ్గొట్టావని చెబుతాడు పార్ధు. రెండేళ్ల క్రితం వ్యాపారంలో లాభాలు రాలేదని ఐదు నెలలు వాయిదాలు కట్టలేదని చెబుతాడు. నిలబెట్టి ఇన్ని లెక్కలు వేసేశాడంటే పార్థుగారు చాలా చదువుకుని ఉంటాడని అనుకుంటుంది భానుమతి. అందువల్ల నా చదువు గురించి కూడా ఈయన ఆలోచిస్తాడని అనుకుంటుంది.
కష్టంగా ఉందని వాయిదాలు కట్టలేదంటే వదిలేసేవాళ్లమని, కానీ నువ్వు అబద్ధం చెప్పడానికి, మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించావని మండిపడతాడు పార్ధు. నేను, మా నాన్న దేన్నైనా క్షమిస్తాం కానీ మోసాన్ని క్షమించలేమని చెప్పడంతో భానుమతి, శక్తిలు వణికిపోతారు. మేం మంచివాళ్లకి మంచివాళ్లమని తేడా వస్తే మా అంత చెడ్డవాళ్లు ఉండరని వార్నింగ్ ఇస్తాడు పార్దు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











