Bhanumathi March 15th Episode: భానుమతి ప్రేమలో పార్ధు .. పసిగట్టేసిన శాంభవి, చిక్కుల్లో భానుమతి
నిన్ను ఇప్పటికైనా పార్ధు అమ్మ అని పిలుస్తున్నాడా అని శారదని అడుగుతుండి పిన్నిగారు. ఆ మాటలతో బలరామ్ - శారదలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. పార్ధులో శారద మీద చిన్న వయసులోనే ఎవరో విష బీజాలు నాటారని, వాళ్లు బాగుపడరని శాపనార్ధాలు పెడుతుంది పిన్నిగారు. ఆ మాటలతో శక్తి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆమె వెనుకే వెళ్లిన శాంభవి.. పార్ధుతో భువన పెళ్లి జరగడానికి సాయం చేయమని అడుగుతుంది శాంభవి. సాయం చేస్తానని మాట ఇచ్చిన శక్తి.. తన కొడుకు, కూతురికి మాత్రం శాంభవి ఎలాంటిదో చెబుతుంది. పార్ధుకి నెల తిరిగేసరికి మంచి సంబంధం కుదురుతుందని చెబుతాడు విశ్వనాథం. ఇంతలో ఆ ఇంటికి భోజనం తీసుకుని వస్తారు ప్రమీల, భానుమతి, వసు. లోపలికి వెళ్లబోతున్న వీరిని శక్తి, ఆమె కూతురు అవమానిస్తారు.
ఇంట్లో అందరి ముందు పాము అంటే నాకు భయం లేదని బిల్డప్ ఇస్తున్న పార్ధుని భానుమతి, వసలు ఆట పట్టిస్తారు. ఆ తర్వాత పొలం దగ్గర కూడా మరోసారి పాము పాము అని భయపెట్టేసరికి పార్ధు, సూరిలు బురదలో పడిపోతూ భానుమతిని చూస్తారు. ప్రమీల ఇంటికి వచ్చేసరికి తాగుతూ కనిపిస్తాడు కోటిగాడు. దీంతో అతనిపై కోప్పడుతుంది ప్రమీల. విశ్వనాథం గారి ఇంటికి వచ్చిన అబ్బాయి బురదలో పడ్డాడని జలుబు చేసిందని బాగా ఇబ్బంది పడుతున్నాడని కూతురికి చెబుతుంది ప్రమీల . దీంతో కాషాయం తీసుకుని పార్ధు దగ్గరికి వెళ్లిన భానుమతి అతనిని చూసి బాధపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 15వ తేదీ ఎపిసోడ్ 6లో ఏం జరిగిందంటే?

తన కోసం భానుమతి తీసుకొచ్చిన కాషాయం తాగుతాడు పార్థు. ఇంతలో పిల్లలు పొట్లకాయ తీసుకొచ్చి పార్ధు మెడలో వేసి పాము పాము అంటూ భయపెడతారు. దాంతో భయపడి భానుమతిని పట్టుకుంటాడు పార్ధు. తర్వాత అది పొట్లకాయ అని తెలుసుకుని ఇద్దరూ మెలికలు తిరుగుతారు. ఇదంతా చూసిన సూరి.. ఏంటి పార్ధు ఏంటీ కథ అంటూ ఎగతాళి చేస్తాడు. నాకు జలుబు చేసిందని కాషాయం తీసుకొచ్చిందని చెబుతాడు పార్ధు. వీరిద్దరి మాటలను దూరం నుంచి భువన చూసి రగిలిపోతుంది. వెంటనే ఈ విషయాన్ని శాంభవికి చెబుతుంది. ఈ వూళ్లో పార్ధు కోసం ఒక అమ్మాయి వచ్చిందా అని శాంభవి ఆశ్చర్యపోతుంది.
పార్ధు పెళ్లి గురించి బాధపడుతున్న బలరామ్ దగ్గరికి విశ్వనాథం దంపతులు వచ్చి ఓ అమ్మాయి ఫోటో చూపిస్తారు. ఈ ఊళ్లో మన తర్వాత అంత ఆస్తి, అంతస్తు ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయని చెబుతారు. ఏం చదువుకుందని బలరామ్ అడగ్గా ఎంఏ వరకు చదువుకుందని విశ్వనాథం చెప్పడంతో బలరామ్ కోపంతో ఆ ఫోటోని చించేస్తాడు. ఎక్కువగా చదువుకున్న అమ్మాయిలు నా కొడుకుని తక్కువగా చూస్తున్నారని బలరామ్ చెప్పడంతో ఈ కాలంలో చదువుకోని అమ్మాయిలు ఎక్కడున్నారని ప్రశ్నిస్తారు విశ్వనాథం. అసలు మన స్థాయికి తగ్గ ఆడపిల్లల్లో చదుకోని వారే లేరని చెబుతారు. అయినప్పటికీ రేపు సీతారాముల కళ్యాణానికి ఊళ్లో అందరూ ఆడపిల్లలు వస్తారు కదా? అప్పుడు మంచి పిల్లని చూద్దామని అంటారు.
ఉదయాన్నే సీతారాముల పెళ్లి బట్టలు, తలంబ్రాలు తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి వస్తారు బలరామ్ దంపతులు. జీవితాంతం మీ అన్నయ్య అడుగుజాడల్లోనే నడుస్తుంటే అందరి దృష్టిలో ఎంత చులకనగా ఉంటుందో తెలుసా అని భర్తపై కోప్పడుతుంది శక్తి. ఇంతలో కోటిగాడు వచ్చి ఇవాళ ఆడే పేకాటలో గెలిచి అప్పులు తీర్చేయాలని దేవుడికి దండం పెట్టుకుంటాడు. పీకలదాకా మందు తాగి బలరామ్‌ను గుద్దుతాడు కోటిగాడు. దీంతో సీతారాముల పెళ్లి బట్టలు , తలంబ్రాలు కింద పడిపోతుండగా పార్ధు పట్టుకుంటాడు. మా నాన్నకే అడ్డు తగులుతావా అంటూ కోటిగాడిని కొట్టబోతుండగా బలరామ్ ఆపుతాడు. కళ్యాణం ప్రశాంతంగా జరగాలని గొడవలు వద్దు అని పార్ధుకి నచ్చజెబుతాడు.
ఆలయంలో బలరామ్ కుటుంబ సభ్యులు మనసుల్లో ఉన్న కోరికలను దేవుడికి చెప్పుకుంటారు. నా కొడుక్కి మంచి సంబంధం దొరకాలని బలరామ్ కోరుకుంటాడు. నేను కోరుకున్న బస్సు అమ్మాయితో నా పెళ్లి జరిపించాలని పార్ధు కోరుకుంటాడు. పెత్తనం నా చేతికి, పెద్దరికం నా భర్త చేతికి రావాలని.. పార్ధుకి పెళ్లి కాకూడదని , నా కొడుకు ఆ ఇంటికి వారసుడు కావాలని కోరుకుంటుంది శక్తి. పార్ధుతో భువన పెళ్లి జరిగేలా చూడమని కోరుకుంటుంది శాంభవి.
ఇదే అదనుగా బలరామ్ పెద్ద కొడుకు మందు తాగడానికి బయటికి వెళ్లగా పిల్లలు పట్టుకుంటారు. మర్యాదగా గుడిలోకి వస్తావా లేదంటే తాతయ్యకు చెప్పనా అని బెదిరిస్తారు. నీకు కాబోయే భార్య ఈ ఊళ్లోనే ఎదురుపడుతుందేమోనని పార్ధుతో అంటుంది విశ్వనాథం భార్య. ఆ మాటలతో భానుమతిని తలచుకుంటాడు పార్ధు. సీతారాముల కళ్యాణానికి ఎవరెవరిని పిలిచానో బలరామ్‌కి చెబుతుంటాడు విశ్వనాథం. కళ్యాణానికి వచ్చిన ఆడపిల్లల గురించి తెలుసుకుంటాడు విశ్వనాథం.
సూరితో మాట్లాడుతుండగా పార్ధుకి భానుమతి హృదయానికి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇంతలో భానుమతిని వెతుక్కుంటూ కుమారి, వసులు గుడికి వస్తారు. ఏదో ఒకటి కొట్టేసే వరకు చేతులు లాగుతున్నాయని.. గుడిలో దొంగతనం చేస్తే బాగోదని భయపడుతుంది కుమారి. చీర కొంగు చాచి నేను దొంగతనం చేయనని, నాకు కావాల్సింది ఇందులో పడాలని అనగా రెండు చెప్పులు ఎగురుకుంటూ వచ్చి పడతాయి . దాంతో ఎవడ్రా నా మీదకు చెప్పులు విసిరింది అని మండిపడుతుంది కుమారి.
ఎంతమంది అమ్మాయిలను చూసినా ఒక్క అమ్మాయి కూడా పార్ధుకి ఈడు జోడులా అనిపించడం లేదని బలరామ్ బాధపడతాడు. కళ్యాణానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒక అమ్మాయి దొరుకుతుందని బలరామ్‌తో చెబుతాడు విశ్వనాథం. ప్రిన్సిపల్ ఇచ్చిన పెన్నుతో దేవుడి దగ్గర పెట్టి ఇవ్వమని పూజారి దగ్గరికి వస్తుంది భానుమతి. ఇంతలో పార్ధు కూడా వచ్చి ఆమె పక్కనే నిలబడతాడు. నా మనసుకు నచ్చిన బస్సు అమ్మాయి ఈ గుడికి రావాలని, తన మనసులో మాట చెప్పాలని దేవుడికి మొక్కుకుంటాడు పార్ధు.
ఇంతలో స్వామి వారికి తీసుకొస్తున్న పూల దండను వెనుక నుంచి తన్నడంతో అది భానుమతి - పార్ధుల మెడలో పడుతుంది. దాంతో ఇద్దరూ ఒకొరినొకరు చూసుకుంటారు. ఇది దేవుడికి వెయ్యాల్సిన దండ అని.. ఆ స్వామి మిమ్మల్ని కలపాలని అనుకుంటున్నాడని భక్తులు అంటారు. ఇదంతా శారద, శాంభవి, భువనలు చూస్తారు. గుడి నుంచి వెళ్లిపోతుండగా భానుమతిని పిలుస్తాడు పార్ధు. వాళ్లిద్దరూ బయట మాట్లాడుకోవడాన్ని శాంభవి - భువనలు చూస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











