నన్ను మోసం చేశారు.. అతని కోసం నడిరోడ్డు మీద ఏడ్చా.. బిగ్ బాస్ బ్యూటీ ఎమోషనల్..
Priyanka Singh: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రియాంక సింగ్ (పింకీ)గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 5 (Bigg Boss Telugu 5) ద్వారా ఎనలేని ఫేమ్‌ను సొంతం చేసుకుంది. ప్రియాంక తన అందం, ఆత్మవిశ్వాసం, స్పష్టమైన అభిప్రాయాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే షో ముగిసిన తర్వాత ఆమె ఎందుకు ఇండస్ట్రీకి దూరంగా ఉంటోందన్న ప్రశ్న చాలాకాలంగా వినిపిస్తోంది. ఈ ప్రశ్నలకు తాజాగా ఆమె స్వయంగా సమాధానం చెప్పారు. యాంకర్ వర్ష( Varsha)హోస్ట్ చేస్తున్న కిసిక్ టాక్ షోలో పాల్గొన్న ప్రియాంక, ఇప్పటివరకు ఎప్పుడూ బయటపెట్టని వ్యక్తిగత జీవితంలోని పలు షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఇంతకీ ఏమన్నారంటే.?
ఈ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ తర్వాత నటుడు మానస్ (Manas)తో ఉన్న అనుబంధంపై స్పష్టత ఇచ్చారు. "బిగ్ బాస్ తర్వాత మీరు మానస్‌తో మాట్లాడలేదన్న టాక్ నడుస్తోంది. కానీ మానస్ మాత్రం 'నేను ప్రియాంకతో టచ్‌లోనే ఉన్నాను' అంటున్నారు. ఇది నిజమేనా?" అని యాంకర్ వర్ష ప్రశ్నించగా.. ప్రియాంక స్పష్టంగా 'లేదు... అందులో ఏ మాత్రం నిజం లేదు. బిగ్ బాస్ తర్వాత మానస్ నాతో మాట్లాడలేదు'అని చెప్పింది.

'బిగ్ బాస్ హౌస్‌లో మానస్ మీ బెస్ట్ ఫ్రెండ్ కదా?'అని వర్ష ప్రశ్నించగా.. ప్రియాంక ఎమోషనల్ అయ్యింది. 'అవును... బిగ్ బాస్‌లో మానస్ నాకు చాలా క్లోజ్. కానీ ఒక విషయం క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. బిగ్ బాస్‌లో నేను చేసిన ప్రతి ఫీలింగ్ జెన్యూన్. స్క్రిప్టెడ్ కాదు, కంటెంట్ కోసం కాదు. నేను ప్రేమిస్తే హార్ట్ ఫుల్‌గా ప్రేమిస్తాను. ద్వేషించడమే నాకు తెలియదు. అలాంటిది ప్రేమించిన వ్యక్తిని ఎందుకు ద్వేషిస్తాను?'అంటూ కన్నీరు పెట్టుకుంది.
బిగ్ బాస్ తర్వాత ఇద్దరూ కలిసి రెండు షోలు చేసినా, అక్కడ మాటల పరిమితి కేవలం 'హాయ్- బాయ్' వరకే ఉండేదని, కొన్నిసార్లు అది కూడా లేకపోయేదని ప్రియాంక తెలిపింది. 'ఇప్పుడు మేము కనీసం కాంటాక్ట్‌లో కూడా లేం. ఆయన ఎక్కడో... నేను ఇక్కడో'అంటూ ప్రియాంక ఎమోషనల్ అయ్యింది.
ఇక తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ ప్రియాంక మరింత భావోద్వేగానికి లోనైంది. ' నా బాయ్ ఫ్రెండ్ కోసం నా జీవితాన్ని అంకితం చేశాను. పెళ్లి చేస్తానని నన్ను నమ్మించి, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేలా చేశాడు. చివరకు నన్ను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. బిగ్ బాస్ తర్వాత మళ్లీ వచ్చి 'నీతోనే ఉండాలి' అంటూ మాయ మాటలు చెప్పాడు. కానీ నేను అప్పటికే చాలా బాధలు చూసాను. నా కష్టాల్లో ఉన్నప్పుడు కన్నెత్తి కూడా చూడని వ్యక్తి ఇప్పుడు ఎందుకు వచ్చి డ్రామాలు చేస్తాడు?'అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
' నా బాయ్ ఫ్రెండ్ కోసం ఏడ్చా... రోడ్ల మీద పిచ్చికుక్కలా తిరిగా... ఎన్నో త్యాగాలు చేశా. కానీ అవసరమైనప్పుడు లేని తోడు, ఇప్పుడు ఎందుకు?'అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇంటర్వ్యూలో హైలైట్‌గా నిలిచాయి. బిగ్ బాస్‌లో తగిలిన దెబ్బలకన్నా, వ్యక్తిగత జీవితంలో ఎదురైన గాయాలు తనను రాయిలా మార్చేశాయని ప్రియాంక చెప్పింది. ఇక తన జీవితంలో ఎదుర్కొన్న ఆవేదన గురించి చెబుతూ..'నేను ట్రాన్స్ ఉమెన్‌ని. నా బాయ్‌ఫ్రెండ్‌తో రిలేషన్ నాలుగు గోడల మధ్య ఓకే. కానీ బయటకు వస్తే నాతో మాట్లాడడానికి కూడా భయపడేవాడు. సమాజంలో పరువు పోతుందనే భావన. ట్రాన్స్ గర్ల్స్‌ను చాలామంది కేవలం సె**క్స్ టాయ్స్‌లా చూశాడు. నాతో బయట తిరిగితే చిన్నచూపు పడుతుందన్న భయంతో నన్ను దూరం పెట్టాడు" అంటూ షాకింగ్ నిజాలను బయటపెట్టింది.
ఇక ఇండస్ట్రీలో జరిగిన అవమానాలకు గురించి కూడా చెప్పింది. ఒక కామెడీ షోలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకుంటూ..'షో ఆఫర్ ఇచ్చి, రిహార్సల్స్ చేయించి, స్టేజ్‌పైకి వెళ్లే ముందు 'నువ్వు చేస్తే షోకు చెడ్డ పేరు వస్తుంది' అంటూ బయటకు పంపించారు. ఆ అవమానం నన్ను మానసికంగా పూర్తిగా కుంగదీసింది. దాదాపు ఒకటిన్నర సంవత్సరం మంచానికే పరిమితమయ్యాను'అని తెలిపింది.ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ప్రియాంక ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











