Bigg Boss Telugu 7 పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ అవుట్.. కంటెస్టెంట్స్ మూకుమ్మడిగా ఎటాక్.. శివాజీ వెన్నుపోటు!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 షోలో 6వ వారం అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. కొత్తగా 5 గురు వైల్డ్ కార్డు ఎంట్రీలతో ఇంట్లోకి వచ్చిన తర్వాత కంటెస్టెంట్ల మధ్య పోటీ ఎక్కువైంది. అప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్లు, వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా వచ్చిన వాళ్లు తమ సత్తాను నిరూపించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ విషయంలో ఇంటి సభ్యులు వ్యవహరించిన తీరు, అలాగే బిగ్‌బాస్ తీసుకొన్న నిర్ణయం షాకింగ్ కలిగించాయి. ఆ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ ఇచ్చిన మొక్కపై ప్రశాంత్ ప్రేమను కురిపించాడు. కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను మొక్కకు చూపిస్తూ మురిసిపోయాడు. తన కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను తీసి మొక్క కుండీలో పెట్టి ఆనందపడిపోయాడు. అంతలోనే వచ్చిన శివాజీ చూసి.. ఏమైందిరా.. నిన్ను ఆపేది ఎవడురా? అంటూ కామెంట్ చేశాడు. కానీ అంతలోనే ఇంటి సభ్యులందరూ ప్రశాంత్ కెప్టెన్సీకి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను చెప్పడం షాకింగ్‌గా మారింది.

పల్లవి ప్రశాంత్‌ను ఉద్దేశించి బిగ్‌బాస్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ ఇంట్లో కెప్టెన్ అనేవాడు చాలా ముఖ్యమైన వాడు. కేవలం ఇమ్యునిటీ మాత్రమే కాదు. కెప్టెన్‌కు ఉండే బాధ్యతలు ఏమిటో.. కాస్త చెబుతావా అని శోభాశెట్టిని అడిగారు. దాంతో కెప్టెన్ అంటే.. అందర్నీ కంట్రోల్‌లో పెట్టుకోవాలి అని శోభా శెట్టి అంటే.. లీడర్ షిప్ క్వాలిటీస్ అనేవి కచ్చితంగా ఉండాలి అని అమర్ దీప్ అన్నాడు.
ఇక కెప్టెన్సీ బాధ్యత గురించి పూజా మూర్తి చెబుతూ.. కెప్టెన్సీ అంటే కమాండింగ్‌గా ఉండాలి అని అన్నారు. తను వర్క్ చేస్తూ.. పది మందిని వర్క్ చేయించేలా ఉండాలి అని ఆట సందీప్ చెప్పాడు. ఇక అంబటి అర్జున్ తన అభిప్రాయాన్ని చెబుతూ.. కెప్టెన్ అంటే.. ఇంటికి సెకండ్ బిగ్‌బాస్ అని అన్నాడు. ఇక శివాజీ మాట్లాడుతూ.. బయట కెప్టెన్సీ వేరు.. ఇక్కడ కెప్టెన్సీ వేరు. వసతులు కల్పించడం ముఖ్యం కాదు అని అన్నాడు.
ఇక కెప్టెన్ అంటే ఏమిటి? అని నేరుగా పల్లవి ప్రశాంత్‌ను అడిగితే.. నేను పనిచేస్తూ.. ఇతరుల చేత పనిచేయించడమే నా పనిగా భావిస్తాను. కానీ నేను ఏదైనా పని చెబితే.. కొందరు చేయడం లేదు. కొన్ని పనులు చేబితే వినడం..నేను ఏదైనా చెబితే.. వీడేంది? అని నన్ను చూస్తున్నాడు అని ప్రశాంత్ చెప్పాడు.

ఇంటి సభ్యులు అభిప్రాయం తీసుకొన్న తర్వాత.. పల్లవి ప్రశాంత్ బ్యాడ్ కెప్టెన్ అని భావించే వారు చేతులు ఎత్తండి అంటూ బిగ్‌బాస్ అడిగితే.. ఒక్కరిద్దరూ కాకుండా అందరూ తమ చేయిని ఎత్తి ప్రశాంత్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో కెప్టెన్సీని రద్దు చేస్తూ ప్రశాంత్ నుంచి బ్యాడ్జీని వెనక్కి తీసుకొన్నాడు. ఈ పరిణామాన్ని ఊహించని ప్రశాంత్ కంటతడి పెట్టుకొన్నాడు. అయితే ఇంటి సభ్యులందరూ మూకుమ్మడిగా ప్లాన్ చేశారని.. శివాజీ కూడా ప్రశాంత్ కెప్టెన్‌గా పనికి రాడని ఓటు చేయడం వెన్నుపోటు అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











