దుబ్బాక ఎన్నికల బరిలో కత్తి కార్తీక .. ప్రచారంలో దుమ్ము రేపుతున్న బిగ్‌బాస్ సెలబ్రిటీ
టెలివిజన్ హోస్ట్‌గా, బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ఇప్పటి వరకు అభిమానులను సంపాదించుకొన్న యాంకర్ కత్తి కార్తీక ప్రజా నాయకురాలిగా మారేందుకు సిద్ధమయ్యారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో ఏర్పడిన ఖాళీతో దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ క్రమంలో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి కత్తి కార్తీక స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇప్పుడు దుబ్బాకలో పర్యటిస్తూ తనను గెలిపించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కత్తీ కార్తీక వ్యక్తిగత జీవితం, ప్రచారం వివరాలు మరింతగా..

తెలంగాణ యాస, భాషతో ఆకట్టుకొని..
తెలంగాణ యాస, భాషతో ప్రముఖ టెలివిజన్ ఛానెల్ V6లో హోస్ట్‌గా తనదైన శైలిలో కత్తికార్తీక ఆకట్టుకొన్నారు. విభిన్నమైన బాడీ ల్వాంగేజ్, భాషతో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకొన్నారు. హోస్ట్‌గా కత్తి కార్తీకకు తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకొన్నారు.

బిగ్‌బాస్ తెలుగు హోస్ట్‌గా కత్తి కార్తీక
ఆ తర్వాత హోస్ట్‌గా కాస్త బ్రేక్ తీసుకొన్న కత్తీ కార్తీక బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలోకి ప్రవేశించారు. బిగ్‌బాస్‌లో తన ప్రతిభతో చాలా వారాలపాటు ఇంటిలో ఉన్నారు. హోస్ట్‌గా తెచ్చుకొన్న క్రేజ్‌ను బిగ్‌బాస్‌తో మరింత పెంచుకొన్నారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె సెలబ్రిటీ హోదాను సంపాదించుకొని సామాజిక కార్యక్రమాల్లో భాగమవుతూ వస్తున్నారు.

బలమైన రాజకీయ నేపథ్యంతో
మీడియా, సామాజిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కత్తి కార్తీకకు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఎమ్మెల్యే టీ పద్మారావు గౌడ్‌కు సన్నిహిత బంధుత్వం కార్తీకకు ముంది. ఎమ్మెల్యే, మాజీ మంత్రి పద్మారావు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో కత్తి కార్తీక పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి.

దుబ్బాక ఎన్నికల్లో అభ్యర్థిగా
ఇలాంటి నేపథ్యం ఉన్న కత్తి కార్తీక తాజాగా అనూహ్యంగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. దుబ్బాక నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దూకారు. ప్రజల కష్టాలు తీర్చడానికి, కన్నీరు తుడవడానికి రాజకీయాల్లోకి వస్తున్నాను. మీ బిడ్డగా ఆశీర్వదించండి అంటూ ప్రజలను, ఓటర్లను వేడుకొంటున్నారు.

సుడిగాలి పర్యటనలతో, విస్తృతంగా
దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో విస్తృతంగా కత్తి కార్తీక గౌడ్ పర్యటిస్తున్నారు. సుడిగాలి పర్యటనలతో ప్రత్యర్థులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. గణపతి ఉత్సవాల సందర్భంగా పలు గ్రామాల్లో పర్యటించి యువత మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిస్వార్ధంగా సేవ చేయడానికి వస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. మీ నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతానని కత్తి కార్తీక తన ఉపన్యాసాల్లో పేర్కొంటున్నారు.

దుబ్బాకలో భారీగా పోస్టర్లు, బ్యానర్లు
ఇదిలా ఉండగా, కత్తి కార్తీకను గెలిపిద్దామంటూ దుబ్బాక నియోజకవర్గంలో పోస్టర్లు భారీగా వెలిశాయి. కత్తి కార్తీక అక్కను గెలిపిద్దాం. నియోజకవర్గం అభివద్దికి పాటుపడుదాం అంటూ ఆమె వర్గీయులు, అభిమానులు, కార్యకర్తలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటికే ఈ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి రఘునందన్ రావు బీజేపీ టికెట్‌ను ఆశిస్తూ ప్రచారంలో ముందున్నారు.


Click it and Unblock the Notifications











