తల్లి కాబోతోన్న సోనియా ఆకుల .. అలా ప్రెగ్నెన్సీ బయటపెట్టిన బిగ్‌బాస్ బ్యూటీ
ఇండియాలో సినిమా, టీవీ సెలబ్రెటీలు ఒకరి తర్వాత మరొకరు తమ ప్రెగ్నెన్సీ వార్తలు చెబుతూ అభిమానులను ఖుషి చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ - సిద్ధార్ధ్ మల్హోత్రా జంట తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. పండంటి ఆడబిడ్డకు కియారా అద్వానీ జన్మనిచ్చారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లుగా ప్రకటించారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి బిగ్‌బాస్ బ్యూటీ సోనియా ఆకుల కూడా చేరారు.
చిన్న వయసులోనే పెద్దమనసు
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన సోనియా ఆకుల.. హైదరాబాద్‌లోని భోజ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివారు. కొంతకాలం పాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన సోనియా ఆ తర్వాత వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లోనూ ఉద్యోగం చేశారు . సినీవారం అనే ప్రోగ్రామ్‌తో గుర్తింపు తెచ్చుకున్న సోనియా సినీ దర్శకుల కళ్లలో పడింది. జార్జ్ రెడ్డి, కరోనా వైరస్, ఆశా ఎన్‌కౌంటర్ చిత్రాలలో నటించారు సోనియా. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఆసా ఫౌండేషన్ పేరిట అనాథ పిల్లల బాగోగులు చూస్తున్నారు సోనియా ఆకుల. దాదాపు 50 మంది అమ్మాయిలకు చదువు చెప్పించాలనే లక్ష్యంతో నిధుల సేకరణ చేపడుతూ తన పెద్ద మనసు చాటుకుంటున్నారు.

బిగ్‌బాస్ తెలుగు 8లో ఛాన్స్
ఈ పాపులారిటీతో బిగ్‌బాస్ తెలుగు 8లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ నెగిటివిటీ కారణంగా నాలుగు వారాలకే ఎలిమినేట్ అయ్యారు. వారానికి 2 లక్షల చొప్పున 4 వారాల పాటు హౌస్‌లో ఉన్న సోనియా ఆకుల పారితోషికం కింద 8 లక్షలు అందుకున్నట్లు టెలివిజన్ వర్గాలు తెలిపాయి. అయితే సోనియా ఆకుల మరోసారి హౌస్‌లో అడుగుపెడతారని గాసిప్స్ వైరల్ అవ్వగా అలాంటిదేమీ జరగలేదు. బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చిన వెంటనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. నిజానికి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టడానికి ముందే సోనియాకు పెళ్లి సెట్ అయ్యింది. అయితే మెగా షోలో అవకాశం రావడంతో పెళ్లిని కొంతకాలం వాయిదా వేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
యశ్‌వీర్‌తో ప్రేమ, పెళ్లి
వరంగల్‌కు చెందిన యష్‌వీర్ ని సోనియా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. యష్ కు గతంలోనే వివాహం జరిగి విడాకులు అయ్యాయి. అయినప్పటికీ అతని వ్యక్తిత్వం, మంచి మనసు నచ్చి యష్‌తో గతేడాది డిసెంబర్‌లో మూడు ముళ్లు వేయించుకున్నారు సోనియా. తన పెళ్లికి అగ్ర కథనాయకుడు నాగార్జునతో పాటు సినీ ప్రముఖులు, బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌ని ఆహ్వానించింది సోనియా. పెళ్లి తర్వాత భర్తతో కలిసి హనీమూన్ ఎంజాయ్ చేసిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండేవారు.
ప్రెగ్నెన్సీ ప్రకటించిన సోనియా
తాజాగా పెళ్లయిన 8 నెలల తర్వాత సోనియా గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ విషయాన్ని వెరైటీగా రివీల్ చేసింది. ఓ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపంలో ఫైల్ పట్టుకుని వచ్చి తన భర్త యశ్‌కు చెబుతుంది సోనియా. అది చూసిన యశ్.. ఆమెను గట్టిగా హత్తుకుని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వెంటనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రెగ్నెన్సీపై మరో పోస్ట్ పెట్టింది సోనియా. భర్త బుగ్గ కొరుకుతూ.. వెనుక నుంచి బిడ్డ స్కానింగ్ రిపోర్టు, బేబీ సాక్స్, డ్రెస్‌ను చూపిస్తూ మురిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సోనియా ఆకుల- యష్ వీర్‌లకు సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications










