‘లవ్ అంటే శృంగారం మాత్రమే కాదు.. బ్రేకప్‌తో మానసికంగా చచ్చిపోయా'
బిగ్‌బాస్ తెలుగు సీజన్-4తో గుర్తింపు తెచ్చుకున్న దివి వాద్య (Divi Vadthya). అటు అందం, ఇటు నటన రెండూ ఉన్నప్పటికీ, సరైన బ్రేక్ దొరకక సినిమాల్లో ఇప్పటివరకు కొన్ని సైడ్ క్యారెక్టర్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినా కూడా మంచి అవకాశం వస్తే తన కెరీర్ ఒక్కసారిగా బూస్ట్ అవుతుందనే నమ్మకంతో, సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ దివి బిజీబిజీగా కొనసాగుతోంది. ఇటీవల యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న 'కిస్సిక్ టాక్ షో'లో దివి ప్రత్యేక అతిథిగా పాల్గొంది. ఈ షోలో ఆమె చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన సమాధానాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, బ్రేకప్ వంటి వ్యక్తిగత అంశాలపై దివి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
షో ప్రారంభంలోనే యాంకర్ వర్ష దివికి ఇచ్చిన ఇంట్రడక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే వర్ష వేసిన పంచులకు దివి కూడా అదే స్థాయిలో రివర్స్ పంచులు వేస్తూ నవ్వులు పూయించింది. దీంతో షో ఆరంభం నుంచే సరదా వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా దివి తన గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెల్లడించింది. తాను మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సాధించానని చెప్పడంతో యాంకర్ వర్ష ఒక్కసారిగా షాక్ అయ్యింది. 'ఇక ఈ అమ్మాయిపై ఇష్టం ఉన్నట్టు కామెంట్ చేయకండి, కొమ్మిపారేస్తుంది' అంటూ వర్ష సెటైర్ వేసింది.

ఇక దివి హైట్ గురించి కూడా సరదా చర్చ జరిగింది. 'అబ్బాయిలు 5.8 ఫీట్ ఉంటేనే అమ్మాయిలు తట్టుకోలేరు... అలాంటిది అమ్మాయి 5.8 ఉంటే అబ్బాయిలు తట్టుకుంటారా?' అంటూ వర్ష ప్రశ్నించగా, దివి నవ్వుతూ 'అందుకే నాకు ఇంకా అబ్బాయి దొరకడం లేదు' అని ఫన్నీగా సమాధానం ఇచ్చింది. దాంతో వర్ష 'అరేయ్... దివి సింగిల్ అంటరా!' అంటూ కామెంట్ చేయడం మరో హైలైట్‌గా నిలిచింది.
పెళ్లి గురించి ప్రశ్నించగా దివి ఇచ్చిన సమాధానం మరింత ఆసక్తికరంగా మారింది. 'రేపు ఫ్యూచర్‌లో పెళ్లి చేసుకుంటే అన్నిటికీ అడ్జస్ట్ అవుతావా?' అని వర్ష అడగ్గా, దివి వెంటనే స్పందిస్తూ, 'నన్ను ప్రేమగా చూసుకుంటే వాడికి బానిస అయిపోతా... అన్నిట్లో తగ్గి ఉంటా'అంటూ ఎమోషనల్ కామెంట్ చేసింది. 'ఈ మధ్య బ్రేకప్ తర్వాత అమ్మాయిని అబ్బాయి బ్యాడ్ చేయడం, అబ్బాయిని అమ్మాయి బ్యాడ్ చేయడం చాలా కామన్ అయిపోయింది... ఇది కరెక్టేనా?'అనే ప్రశ్నించగా.. దివి స్పందిస్తూ, 'ఉన్నన్ని రోజులు వాళ్లే మనకు కరెక్ట్, వాళ్లే మన హీరోలు. కానీ విడిపోయాక వాళ్ల వెర్షన్ వాళ్లకు కరెక్ట్, వీళ్ల వెర్షన్ వీళ్లకు కరెక్ట్. మన చుట్టూ ఉన్న నాలుగు ఐదుగురికి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అలా చెప్పేస్తుంటాం. ఇది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది" అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
'కొంతమంది అబ్బాయిలు ప్రేమించిన వ్యక్తిని వీరితో కలవద్దు... వారితో మాట్లాడవద్దు అంటూ ఆంక్షలు పెడుతుంటారు. దీనిపై నీ అభిప్రాయం ఏంటి?' అని ప్రశ్నించగా, దివి స్పందిస్తూ..'మనతోనే ఉండాలి అని అనుకోవడం ఒక క్యూట్ ఫీలింగ్. అలా అనుకోవడమే ప్రేమ. అలా అనుకోవడం లేదంటే అది ప్రేమ కాదు. కానీ ఆ అనుకోవడంలో కూడా ఫ్రీడం ఉండాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి... ఎదుటివారికీ ఒక లైఫ్ ఉంటుంది కదా. వాళ్ల ప్రపంచాన్ని కూడా గౌరవించాలి' అంటూ తన అభిప్రాయాన్ని చాలా క్లియర్‌గా చెప్పింది.
ఇక అక్కడితో ఆగకుండా వర్ష మరో ఎమోషనల్ ప్రశ్న వేసింది. 'నీ లైఫ్‌లో ఇలాంటి పేజ్ ఎప్పుడూ రాకూడదు అని అనిపించిందా?'అని అడగగా, దివి ఒక్కసారిగా సీరియస్ అయింది. 'నిజం చెప్పాలంటే... నాకు ప్రేమ సెట్ కాలేదు. లవ్ డిడ్ నాట్ వర్క్ ఫర్ మీ. ప్రేమ అంటే ఈజీ కాదు... అది చాలా పెయిన్‌ఫుల్. ఇప్పుడైతే బ్రేకప్ అంటే ఏంటో అందరికీ తెలుసు. కానీ లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది... మనస్సాక్షి చనిపోయినట్లుగా. ఇంకోలా చెప్పాలంటే... నీలో నువ్వే చనిపోయిన ఫీలింగ్ వస్తుంది' అంటూ దివి భావోద్వేగంగా మాట్లాడింది.
తర్వాత వర్ష మరింత లోతైన ప్రశ్న వేసింది. 'లవ్‌లో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నారా? లేక బ్రేకప్ అయిన తర్వాత హ్యాపీగా ఉన్నారా?' అని అడగగా, దివి ప్రేమపై తన నిర్వచనాన్ని చెప్పింది. 'లవ్‌లో అసలు ఇంపార్టెంట్ ఏంటి అంటే... ఎదుటి వ్యక్తి మీద కేరింగ్ చూపించడం. ప్రేమ అంటే గిఫ్టులు కాదు, శృంగారం కాదు. అవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఇంకా చాలా ఉంటాయి. భర్త పక్కన ఉన్నా పట్టించుకోని భార్యలు ఉన్నారు. అలాగే భార్య పక్కన ఉన్నా పట్టించుకోని భర్తలు కూడా ఉన్నారు. ఇవన్నీ చూస్తే... ప్రేమలో అసలు విలువలు తగ్గిపోతున్నాయి' అంటూ దివి చేసిన వ్యాఖ్యలు హార్ట్ టచ్ చేశాయి. ప్రస్తుతం దివి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











