లగ్జరీ విల్లా కొన్న బిగ్‌బాస్ రోహిణి.. స్టార్స్‌నే డామినేట్ చేసేలా.. ఎన్ని కోట్లో తెలుసా?
ఇటీవలి కాలంలో సినీతారలు, బుల్లితెర నటులు వరుస పెట్టి గృహ ప్రవేశాలతో హోరెత్తిస్తున్నారు. నిన్నగాక మొన్న మన రంగమ్మత్త, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఓ లగ్జరీ ఇంట్లో అడుగుపెట్టి పాలు పొంగించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా బుల్లితెర నటి, బిగ్‌బాస్ ఫేమ్ రోహిణి కూడా ఓ ఖరీదైన విల్లా కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
యాంకర్‌గా కెరీర్ మొదలు
వెబ్‌సిరీస్‌లు, సినిమాలు, బుల్లితెరపై దూసుకెళ్తున్నారు రోహిణి. అసలే ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ల కొరత తీవ్రంగా ఉండటంతో రోహిణికి అన్ని విధాలా కలిసొస్తోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రూవ్ చేసుకుంటూ ఉండటంతో ఆమెకు అవకాశాలు క్యూకడుతున్నాయి. విశాఖపట్నానికి చెందిన ఈ ముద్దుగుమ్మ గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీటెక్ చేశారు. చిన్నప్పటి నుంచి ఎదుటివాళ్లని, నటీనటులను అనుకరిస్తూ అందరినీ నవ్వించే రోహిణి తొలుత యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. అనంతరం పలు సీరియల్స్‌లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. ఈ దశలో జీ తెలుగులో ప్రసారమైన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్‌లో నెల్లూరు యాసలో కామెడీ ఇరగదీసింది.

జబర్దస్త్‌తో బ్రేక్
ఈ సీరియల్‌తో తెలుగునాట పాపులరైన రోహిణికి జబర్దస్త్ బ్రేక్ ఇచ్చింది. హైపర్ ఆది సహా పలువురు టీమ్ లీడర్స్‌తో చేసిన స్కిట్స్ హిట్ కావడంతో పాటు ఆమె కామెడీ టైమింగ్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఇన్స్‌పెక్టర్ కిరణ్ అంటూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది రోహిణి. అప్పట్లో టిక్‌టాక్, డబ్‌స్మాష్‌లో కామెడీ రీల్స్, వీడియోలు చేసి సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు బిగ్‌బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది. ఆ సమయంలో ఎంతో ఆకట్టుకున్న రోహిణి తర్వాత వెబ్ సిరీస్‌లు, పలు ఓటీటీలు, రియాలిటీ షోలలో నటించారు.
సినిమాల్లోనూ బిజీగా రోహిణి
జబర్దస్త్‌లో చేస్తుండగానే ఆమెకు పలు సినిమాలలో ఆఫర్స్ వచ్చాయి. భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు, మత్తు వదలరా, బంగార్రాజు, హ్యాపీ బర్త్ డే, హనుమాన్ వంటి సినిమాలలో కీలకపాత్రలు పోషించింది. అన్నింటికి మించి ఓటీటీలో వచ్చిన సేవ్ ది టైగర్స్ సరీస్ రోహిణి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో పని మనిషి లక్ష్మీగా యజమానికి సాయం చేసే క్యారెక్టర్‌లో కడుపుబ్బా నవ్వించింది రోహిణి. అభినవ్ గోమఠం, రోహిణి మధ్య వచ్చే సీన్లు బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పటికీ దీని తాలూకా క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయంటే రోహిణి నటను అర్ధం చేసుకోవచ్చు.
బిగ్‌బాస్ తెలుగు 9లో హల్‌చల్
గతేడాది బిగ్‌బాస్ తెలుగు 8లో వైల్డ్ కార్డ్ ద్వారా రెండోసారి హౌస్‌లోకి అడుగుపెట్టిన రోహిణి.. తన పంచ్‌లు, కామెడీతో షోను పరుగులు పెట్టించారు. ఆవిడ ఉన్నన్ని రోజులు టీఆర్పీ కూడా బాగానే ఉంది. 9 వారాల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న రోహిణి దాదాపు రూ.20 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు బుల్లితెర వర్గాల టాక్. ఇక నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ మణికొండ ప్రాంతంలో ఖరీదైన డూప్లెక్స్ ఇంటిని కొనుగోలు చేసిన రోహిణి తన కల నెరవేరినందుకు భావోద్వేగానికి గురయ్యారు.
లగ్జరీ విల్లాను కొన్న రోహిణి
ఈ ఏడాది మార్చిలో తన తల్లిదండ్రులతో కలిసి కొత్తింట్లోకి అడుగుపెట్టిన రోహిణి దానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. తాజాగా రోహిణి మరో ఖరీదైన విల్లాను కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేశారు. హైదరాబాద్ నగర శివార్లలోని కొంగర కలాన్‌లో ఓ లగ్జరీ విల్లాను కొన్నారు. దీని విలువ అక్షరాల రూ.1.7 కోట్లు అని తెలిపిన రోహిణి.. తన జీవితంలో కొత్త ఛాప్టర్ మొదలైందని క్యాప్షన్ ఇచ్చారు. ఇది చూసిన నెటిజన్లు ఈ ముద్దుగుమ్మ రెండు చేతులా బాగానే సంపాదిస్తోందని మెచ్చుకుంటూ అభినందనలు తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











