Bigg Boss : అందరితో అలా, నన్ను మాత్రం దూరం పెట్టి .. స్టార్ యాంకర్‌పై అవినాష్ సంచలనం
దాదాపు 105 రోజుల పాటు తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్‌బాస్ తెలుగు 8కి గత ఆదివారంతో ఎండ్ కార్డ్ పడిన సంగతి తెలిసిందే. అందరూ ఊహించినట్లుగానే కన్నడ నటుడు నిఖిల్ మలియాక్కల్ బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ విజేతగా నిలిచాడు. ఓ కన్నడ నటుడికి తెలుగు బిగ్‌బాస్ ట్రోఫీని ఇవ్వడం ఏంటంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
కాగా లిమిట్‌లెస్ ఎంటర్‌టైన్మెంట్ అంటూ మొదలైన బిగ్‌బాస్ తెలుగు 8 ప్రేక్షకులకు అంతగా వినోదాన్ని అందించలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇది గ్రహించిన బిగ్‌బాస్ నిర్వాహకులు .. సీజన్ మధ్యలో వైల్డ్ కార్డ్ ద్వారా 8 మందిని హౌస్‌లోకి పంపారు. వారే టేస్టీ తేజా, హరితేజ, గౌతమ్, గంగవ్వ, రోహిణి, మెహబూబ్, నయని పావని, అవినాష్. వీరు అడుగుపెట్టిన తర్వాత హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఓ రేంజ్‌లో వచ్చింది.

ఫిజికల్ టాస్క్‌లలో మెహబూబ్, గౌతమ్‌లు రెచ్చిపోగా.. ఇక అవినాష్, రోహిణి, టేస్టీ తేజాలు కావాల్సినంత వినోదాన్ని పంచారు. వీకెండ్ వచ్చిందంటే చాలు నాగార్జున చేసే హోస్టింగ్ మొత్తం అవినాష్ చుట్టూనే తిరిగేది. తన కామెడీ టైమింగ్ , పంచ్‌లతో పాటు మిమిక్రీ కళతో ఆయన వినోదాన్ని పంచారు. ఇక బిగ్‌బాస్ చివరి వారాల్లో టాస్క్‌లు, డిస్కషన్స్ బోర్ కొట్టించిన వేళ.. సీజన్ మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని మోశాడు .
అయితే ఎంతగా ఎంటర్‌టైన్ చేసినా టికెట్ టూ ఫినాలే టాస్క్‌ల ద్వారా తొలి ఫైనలిస్ట్‌గా ఫినాలేలో అడుగుపెట్టినా.. కమెడియన్లు బిగ్‌బాస్ విన్నర్‌లు కాదని అవినాష్ విషయంలో మరోసారి రుజువైంది. 15వ వారం బిగ్‌బాస్ ఫైనల్ ఓటింగ్‌లో అవినాష్ అందరికంటే లీస్ట్‌లో ఉండగా.. నిఖిల్, గౌతమ్‌ల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. అంతేకాదు.. ఫినాలేలో అడుగుపెట్టిన తొలి కంటెస్టెంట్ తనే.. అలాగే ఎలిమినేట్ అయిన తొలి ప్లేయర్ కూడా అవినాషే. కాకపోతే.. స్వయంగా కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర హౌస్‌లోకి వచ్చి అతనిని తీసుకుని స్టేజ్ మీదకి రావడం మంచి ఫేర్‌వెల్. అలాగే అవినాష్ వెళ్లిపోయేటప్పుడు స్వయంగా అక్కినేని నాగార్జున సెల్యూట్ చేశారు.
ఇకపోతే.. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయినా అవినాష్ బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖికి బెస్ట్ ఫ్రెండ్. ఖాళీ దొరికితే చాలు ఎక్కడికైనా ట్రిప్ వేయడం ,లేదంటే ఏదో ఒక వెరైటీ వండుకుని ఫ్రెండ్స్‌తో కలిసి తినడం వీరికి అలవాటు. అలాంటిది శ్రీముఖి చేసిన పనికి అవినాష్ హర్ట్ అయ్యాడు. బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఓ ఛానెల్‌తో మాట్లాడిన అవినాష్.. తనకు శ్రీముఖి బెస్ట్ ఫ్రెండ్ అని తనకు చాలా విషయాల్లో సలహాలు ఇచ్చిందని తెలిపాడు. అయితే టికెట్ టూ ఫినాలేలో భాగంగా ఓ రోజున శ్రీముఖి హౌస్‌లో అడుగుపెట్టగా ఆమెను చూసి హగ్ ఇద్దామని వెళ్లానని, కానీ శ్రీముఖి మాత్రం తనను పట్టించుకోలేదని అన్నాడు. అందరికీ తలా ఒక హగ్ ఇచ్చి చివరిలో నాకు హగ్ ఇచ్చిందంటూ సరదాగా చెప్పుకొచ్చాడు అవినాష్. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











